ఏపీలో వైసీపీ అధికారంలో ఉంది. విపక్షంలో టీడీపీ జనసేన సహా బీజేపీ, వామపక్షాలు ఉన్నాయి. బీజేపీ తన విధానాలతో తాను పోరాడుతోంది. ఏపీ బీజేపీ జనసేనతో అఫీషియల్ గా పొత్తులో ఉంది. బీజేపీకి ఏపీలోని రెండు చట్ట సభలతో రుణం తాజాగా జరిగిన ఉత్తరాంధ్రా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో పూర్తిగా పోయింది.
2019 నుంచి అసెంబ్లీలో ఎమ్మెల్యేలు లేరు. ఎంపీలు అసలే లేరు. శాసనమండలిలో నాలుగేళ్ళ క్రితం ఇద్దరు ముగ్గురు ఉండేవారు. ఇపుడు ఉత్తరాంధ్రా ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ ఓటమి పాలు కావడంతో ఉభయ సభల్లో బీజేపీకి ఒక్క మెంబర్ కూడా లేనట్లు అయింది.
పైగా సిట్టింగ్ ఎమ్మెల్సీ సీట్లో డిపాజిట్ సైతం గల్లంతు అయింది. అయితే ఈ నెల 29 వరకూ ఎమ్మెల్సీగా తన పదవీకాలం ఉన్న బీజేపీ నేత పీవీన్ మాధవ్ తన ఓటమికి ఎంతో హుందాగా వినయంగా తీసుకున్నారు. తనకు మొదటి ప్రాధాన్యత ఓట్లు 11 వేల దాకా రెండవ ప్రాధాన్యత ఓట్లు అరవై వేల దాకా, మూడవ ప్రాధాన్యత ఓట్లు డెబ్బై వేల దాకా వచ్చాయని తనకు ఓటేసిన అందరికీ ధన్యవాదాలు అని మాధవ్ ప్రకటన జారీ చేశారు.
అదే పార్టీకి చెందిన విశాఖ మాజీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు అయితే ఇండైరెక్ట్ గా సొంత పార్టీకి తగిలే విధంగా కామెంట్స్ చేశారు. ఏపీలో వైసీపీతో బీజేపీకి పొత్తు ఉందని అంతా అనుకుంటున్నారని, ఈ విషయాన్ని తాము ఎంతగా జనాలకు చెప్పినా నమ్మకపోవడం వల్లనే బీజేపీని ఓడించారని ఆయన అంటున్నారు.
బీజేపీలో విష్ణు కుమార్ రాజు గారి తీరే వేరుగా ఉంటుంది. ఆయన ఈ మధ్య సొంత పార్టీ వైఖరి మీద మెత్తమెత్తగా కామెంట్స్ చేస్తున్నారు. ఆయన పక్క చూపులు చూస్తున్నారు అని ప్రచారం సాగుతోంది. ఆయన కోరుకున్న హామీ లభిస్తే వేరే పార్టీలోకి వెళ్తారన్న గాసిప్స్ కూడా ఉన్నాయంటున్నారు. బీజేపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విష్ణు కుమార్ రాజు గారు తన వంతుగా ఎంతవరకూ మద్దతుగా నిలిచి పోరాడారో కానీ ఇపుడు పార్టీ ఓడాక ఆయన విమర్శలు చేస్తున్న తీరు సొంత పార్టీలో కొందరు పెద్దలకు నేరుగా తగిలే విధంగా ఉందని అంటున్నారు.
ఏపీ బీజేపీలో వైసీపీ అనుకూలురు ఉన్నారన్న ప్రచారం తో పాటు టీడీపీ అనుకూలురు ఉన్నారన్న ప్రచారం ఉంది. అలాగే ఒరిజినల్ బీజేపీ నేతలు కూడా ఉన్నారు. టీడీపీ బీజేపీ పొత్తులో 2014 ఎన్నికల్లో అనూహ్యంగా ఎమ్మెల్యేగా గెలిచిన రాజు గారు ఇందులో ఏ వైపు ఉన్నారో తెలియదు కానీ ఆయన 2024లో మళ్ళీ గెలిచి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వెళ్లాలనుకుంటున్నారని తెలుస్తోంది. అసెంబ్లీకి దారేదీ అని ఆయన ఆలోచిస్తూ సొంత పార్టీ మీద ఈ రకంగా కామెంట్స్ చేశారా అన్న దాని మీద కాషాయ పార్టీలో డిస్కషన్ సాగుతోంది.