తన అన్నయ్యను ఎందుకు విమర్శిస్తారో ఒక తమ్ముడికి అర్థం కావడంలేదు. చాలా బాధపడ్డాడు. ఆవేదన చెందాడు. తన ఆన్నయ్య ఎంత గొప్పవాడో చెప్పాడు. ఆన్నయ్యనే కాదు తన తమ్ముడిని కూడా ఎవరైనా ఏదైనా అంటే తాట తీస్తానని తీవ్రంగా హెచ్చరించాడు. వారి గురించి చాలా ఎమోషనల్ గా చెప్పాడు. తన అన్నదమ్ములిద్దరూ చాలా గొప్పవాళ్ళని ఆకాశానికి ఎత్తేశాడు. ఆ తమ్ముడి పేరు కొణిదెల నాగబాబు. అన్నయ్య మెగా స్టార్ చిరంజీవి, తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై ఎవరు విమర్శలు చేసినా నాగబాబు తట్టుకోలేడు. నాగబాబు మాట్లాడిన మాటలు చాలాసార్లు వివాదాస్పదమయ్యాయి. అయినా కేర్ చెయ్యడు.
ఒక సందర్భంలో ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ మీద కూడా విరుచుకుపడ్డాడు. చిరంజీవి చాలా విజయవంతమైన సినిమాలు యండమూరి నవలల ఆధారంగానే నిర్మితమయ్యాయి. తాజాగా ఓ కార్యక్రమంలో తన సోదరులు, నటులు చిరంజీవి, పవన్ కల్యాణ్ గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే ఊరుకోనని నాగబాబు వార్నింగ్ ఇచ్చారు. ఎంత సాధించినా చిరంజీవిని కొందరు ఎందుకు విమర్శిస్తారో అర్థంకావట్లేదన్నారు.
'ఎలాంటి సినీ నేపథ్యం లేకపోయినా అన్నయ్య తన 21 ఏళ్ల వయసులో ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఇంతటి సామ్రాజ్యాన్ని స్థాపించాడంటే అది మామూలు విజయం కాదు. చిరంజీవిగారి గురించి ఇక్కడ నాకంటే ఎక్కువగా చెప్పేవారు ఎవరూ లేరు. ఇప్పుడే కాదు.. ఆయన్ను నేను నా చిన్నప్పటి నుంచీ హీరోగానే చూశా. పాఠశాల, కళాశాల విద్యనభ్యసించే రోజుల్లో అన్నయ్యకి మంచి క్రేజ్ ఉండేది. తన తమ్ముణ్ణి అయిన నన్ను నిర్మాతగా నిలబెట్టి జీవితాన్ని ఇచ్చాడు.
తమ్ముడు పవన్ కల్యాణ్ ఏదో చేయాలనే తపన ఉన్నవాడు. తన భావాలను సినిమా మాధ్యమం ద్వారా చెప్పాలనుకుని, దర్శకుడిగా మారాలనుకున్నప్పుడు ''నువ్వు డైరెక్షన్ ఎప్పుడైనా చేయొచ్చు కల్యాణ్. నీలో ఓ స్పార్క్ ఉంది. హీరో ఇమేజ్ ఉంది. నువ్వు హీరోగానే కరెక్ట్'' అని అన్నయ్య చెప్పాడు. అలా అన్నయ్య మాటని కాదనకుండా పవర్ స్టార్‌గా మీ ముందుకు వచ్చాడు పవన్. జనసేనానిగా రాజకీయ చైతన్యం తీసుకొచ్చాడు. త్వరలోనే ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చబోయే గొప్ప నాయకుడాయన.
అలాంటి నాయకుణ్ణి కానుకగా ఇచ్చిన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి. కుళ్లిపోయిన రాజకీయాలపై అస్త్రాన్ని జనసేనాని ఎక్కుపెట్టాడు. నేనూ ఆయన పార్టీలో ఉంటూ భుజం కాస్తున్నా. అల్లు అర్జున్, రామ్‌చరణ్, వరుణ్‌తేజ్, సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్,శిరీష్, నిహారిక.. వీరందరికీ బంగారు భవిష్యత్తు ఇచ్చిన మహానుభావుడు చిరంజీవి. ఆయన రుణాన్ని మేం ఎప్పటికీ తీర్చుకోలేం'' అన్నాడు నాగబాబు. ''ఇంత సాధించినా చిరంజీవిగారిని ఎందుకు విమర్శిస్తారో, ఆయన గురించి ఎందుకు అన్యాయంగా మాట్లాడతారో ఇప్పటికీ నాకు అర్థంకాదు. ఒకవేళ వారు అనుకుంటున్నట్టు చిరంజీవి సరైన వ్యక్తి కాకపోతే నేనూ పట్టించుకోను. కానీ, ఆయన ఎంత మంచి వాడో నాకు తెలుసు. చిరంజీవినేకాదు పవన్ కల్యాణ్‌నీ ఎవరైనా విమర్శించినా నేను ఊరుకోలేను.
చాలా గట్టిగా కౌంటర్ ఇస్తా. దాంతో నన్ను 'కాంట్రవర్షియల్ పర్సన్' అని అంటుంటారు. నన్ను ఎవరు ఏమనుకున్నా ఫర్వాలేదు. నా అన్న, తమ్ముణ్ణి ఏమైనా అంటే తాటతీస్తా అంటూ ఆవేశపడిపోయాడు. కొన్ని పార్టీలకు కొమ్ముకాసే కొన్ని మీడియా సంస్థలకు చిరంజీవి గురించి ఏదో ఒకటి చెప్పకపోతే ఏం తోచదు. అన్నయ్య ఇవేవీ పట్టించుకోకుండా ముందుకెళ్తూ ప్రజల కోసం బ్లడ్ బ్యాంక్ స్థాపించాడు. సామాన్యుడికీ అందుబాటులో ఉండేలా మంచి ఆస్పత్రిని నిర్మించబోతున్నారు. ఇంతకు మించి ఆయన నుంచి ఏం ఆశిస్తారో నాకు అర్థంకాదు'' అన్నాడు చిరు తమ్ముడు , పవన్ అన్నయ్య నాగబాబు.
ఆయనకు చిరు, పవన్ తోడబుట్టినవాళ్లు కాబట్టి గొప్పగా అనిపించడం సహజం. కానీ వారిద్దరూ ప్రజాజీవితంలో ఉన్నవారు. సినిమా హీరోలే కాకుండా రాజకీయ జీవితం ఉన్నవారు. చిరంజీవి రాజకీయ పార్టీ స్థాపించి ఎన్నికల్లో పోటీ చేసి, కొన్ని కారణాల వల్ల పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి, కేంద్ర మంత్రి అయిన వ్యక్తి. ఆ తరువాత తత్త్వం బోధపడి రాజకీయాలకు దూరమైపోయాడు. పవన్ కళ్యాణ్ కు హీరోగా చిరు కంటే కూడా ఎక్కువ ఫాలోయింగ్ ఉంది. కాలక్రమంలో ఆయన రాజకీయ పార్టీ స్థాపించాడు. ప్రస్తుతం పాలిటిక్స్ లో కిందా మీదా అవుతున్నాడు. ప్రజా జీవితంలో ఉండేవారిపై విమర్శలు సహజం.