తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో గుణాత్మక, విప్లవాత్మక మార్పు తెచ్చిన పార్టీ. ఇప్పటి రెండు తెలుగు రాష్ట్రాలలో ఆ పార్టీ పరిస్థితి ఏంటి? తెలంగాణలో పార్టీ ఆల్రెడీ సమాధి అయిపోయింది. ఏపీలో శవాసనం వేసి, వెంటిలేటర్ మీద ఉంది. ఈ సమయంలోనే ఆ పార్టీని బతికించుకోవాలంటే.. జస్ట్ ‘నారా’జకీయం సరిపోదు! దానిని మించిన ఆయుష్ హోమమో, మృత్యుంజయ మంత్రమో అవసరం! పార్టీ శ్రేణులు, పుట్టుకనుంచి ఆ పార్టీని తమది అని సొంతం చేసుకున్న వర్గాలు అందరూ ఇప్పుడు తలపోస్తున్నది ఒక్కటే.. పార్టీ బతకాలంటే.. అవసరమైన మృత్యుంజయమంత్రమే ‘‘జై బాలయ్య!’’
ప్రమాదమెంత పెద్దదైనా బయటపడడానికి సాధారణంగా ఎక్కడో అక్కడ చిన్న మార్గం ఉంటుంది. దానిని కనిపెట్టడంలోనే చావు బతుకులు ఆధారపడుతుంటాయి. ఆ మార్గం ఉందా లేదా అనేది వెతకాలి తప్ప అంతా అయిపోయిందని చేతులెత్తేయనక్కర్లేదు. ప్రస్తుతం తెదేపా అంపశయ్యమీదుంది. రేపో మాపో అనేట్టు గుడ్లు తేలేస్తోంది. దానికి కారణమేమిటి?
ప్రధానంగా చెప్పుకోవాలంటే నాయకత్వలోపం. ఉన్న నాయకుడిని క్యాడర్ కూడా విశ్వసించట్లేదు. పోనీ వారసుడు బాగున్నాడా అనుకుంటే అంతకంటే అధ్వాన్నం. ఎలా చూసుకున్నా సామర్ధ్యం లేని తండ్రీకొడుకుల సారధ్యంలో నడుస్తున్న పార్టీలో జవసత్వాలు లేవు. దీనివల్లే “పార్టీ లేదు బొక్కాలేదు” లాంటి కామెంట్లు కూడా విన్నాం. పైకి ఎలా కనిపిస్తున్నా లోలోపల ప్రతి తెదేపా లీడరుకి చంద్రబాబు నాయకత్వం ఏమాత్రం రుచించడంలేదు. అలా అనడం కంటె ఆయన నాయకత్వం మీద నమ్మకం సడలిపోయింది.
మరిప్పుడు మార్గమేమిటి?
ఒక్కసారి గతంలోకి వెళదాం. 1996లో ఎన్.టి.ఆర్ నుంచి పార్టీని లాక్కున్న విషయంలో లోకమంతా చంద్రబాబుని “వెన్నుపోటు దారుడు” అని ఆడిపోసుకున్నా తాను, తన వర్గీయులు మాత్రం దానిని రాజనీతి అంటారు. ఇప్పటికీ అదే మాట అంటూ ఉంటారు. అది వారి వారి ఆత్మవంచనకు పరాకాష్ట. అప్పటి పరిస్థితుల్లో.. చూస్తూ కూర్చుంటే లక్ష్మీ పార్వతి చేతుల్లోకి పార్టీ వెళ్లేలా ఉంది కనుక, ఆమె నాయకత్వంలో పార్టీ సర్వభ్రష్టత్వం పొందుతుందని గ్రహించి తప్పనిసరి పరిస్థితుల్లో వెన్నుపోటు పొడవాల్సి వచ్చిందని చెప్పుకుంటారు. గ్యాంగరిన్ వస్తే మనిషి ప్రాణం నిలబెట్టుకోవడానికి కాలెలా తీసేస్తారో అలా ఎన్.టి.ఆర్ వెన్నుపోటుని కూడా జస్టిఫై చేసుకున్నారు.
మరి ఇప్పుడు పరిస్థితి ఏమిటి? అప్పట్లో లక్ష్మీపార్వతిని బూచిగా చూపించారు. ఇప్పుడు పార్టీకి బూచి ఎవరు? పార్టీ ఎందుకిలా కునారిల్లుతోంది? ఈ పార్టీకి నాయకత్వ మార్పు అవసరమా? అనే ప్రశ్నలు సహజంగానే తలెత్తుతాయి. నాయకత్వ మార్పు విషయంలో భిన్నాభిప్రాయం లేకపోవచ్చు. నారా చంద్రబాబునాయుడు కబంధ హస్తాలనుంచి బయటకు వస్తే తప్ప పార్టీకి మనుగడ కష్టమనే అభిప్రాయం పలువురిలో ఉండివచ్చు. ఎందుకంటే.. చంద్రబాబు నాయుడు చేతిలో నిర్ణయం ఉన్నంతవరకు ఆయన తర్వాతి స్థానం లోకేష్ దే అవుతుంది. పేరుకు చంద్రబాబు అయినా నడిపేది లోకేష్ అవుతారు. పార్టీ శ్రేణులు భయపడుతున్నదంతా లోకేష్ చేతగానితనం గురించే. నాయకత్వ మార్పు కోరుకుంటున్నది కూడా లోకేష్ ప్రాబల్యం తగ్గడానికే.
నందమూరి తారక రామారావు స్థాపించిన ఈ పార్టీకి నలభయ్యేళ్ల తర్వాత.. నాయకత్వ మార్పు అనే అంశం తెరమీదకు వచ్చినప్పుడు సహజంగానే.. నందమూరి కుటుంబానికి ప్రాధాన్యం ఉండాలనే ఆలోచన కూడా వినిపిస్తుంది. ఈ ఆలోచన కొత్తది కాదు. గతంలోనూ చాలా ప్రబలంగా వినిపించింది. హరికృష్ణ బతికి ఉండగా, ఆయనను పార్టీ సారథిని చేసి.. ప్రభుత్వం బాధ్యతలు చంద్రబాబు చూసుకోవాలని చాలా పెద్ద స్థాయిలోనే ప్రయత్నాలు జరిగాయి. తర్వాత బాలకృష్ణ పేరు కూడా వినిపించింది. జూనియర్ ఎన్టీఆర్‌ను పార్టీలోకి తీసుకువచ్చి కీలక బాధ్యతలు అప్పగించాలని కూడా పలు డిమాండ్లు వినిపించాయి. కానీ అవేవీ కార్యరూపం దాల్చలేదు. అలా అనేకంటే.. ఆ డిమాండ్లను ఎప్పటికప్పుడు తొక్కేయడంలోనూ, పార్టీ అధికార పగ్గాలు తన చేతినుంచి మారకుండానూ చంద్రబాబు చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించారు.
ఇప్పుడు పరిస్థితి వేరు. చంద్రబాబు మీద నమ్మకం సడలుతోంది. అధికార మార్పు అవసరమని కోరుకునే వారి సంఖ్య పెరుగుతోంది. చంద్రబాబు నాయకత్వంలో పార్టీ పాడెక్కేసింది. ఇప్పుడు దింపుడుకళ్లెం మీదే ఆశ. పార్టీకోసం పలువురు జపిస్తున్న మృత్యుంజయ మంత్రం అదే ‘‘జై బాలయ్య!!’’
వెన్నుపోటా? తిరుగుబాటా?
ఒకేలా కనిపిస్తాయి గానీ.. ఈ రెండు పదాలకు చిన్న తేడా ఉంది. వెన్నుపోటు అంటే చంద్రబాబు చేసినది.. ఎన్టీఆర్ ను పార్టీలోనే లేకుండా చేసేసి.. ఆ పార్టీని హస్తగతం చేసుకున్నది. అలా కాకుండా.. నాయకులందరూ ‘బహిరంగంగా’ తమ నిరసనల్ని, వ్యతిరేకతల్ని వినిపించి.. ఆ ఒత్తిడికి తలొగ్గి ఎన్టీఆర్ తప్పుకుని, తాను పార్టీలోనే ఉంటూ, సారథ్యం మాత్రం చంద్రబాబు చేతిలో పెట్టి ఉంటే అది తిరుగుబాటు అయ్యేది. నిజానికి అప్పట్లో.. చంద్రబాబు గవర్నరుకు లేఖ సమర్పించడానికి ముందురోజు నాటికి.. వీరి కుట్రను తిరుగుబాటుగా ఆమోదించి, పార్టీలో లక్ష్మీపార్వతి ప్రాబల్యం తగ్గించడానికి, నాయకత్వ మార్పిడికి ఎన్టీఆర్ కొంత సుముఖంగానే ఉన్నారని.. ఆయన ఆ సుముఖతను బహిరంగపరచి శ్రేణుల సానుభూతి సంపాదించేలోగా.. చంద్రబాబు కోటరీ గవర్నరుకు లేఖ ఇచ్చేసి రాష్ట్రాధికారాన్ని చేజిక్కించుకున్నారని కూడా ఒక వాదన ఉంది. ఇప్పుడు మళ్లీ నాయకత్వ మార్పు అవసరం అనుకుంటున్న తరుణంలో వెన్నుపోటు ఉంటుందా? తిరుగుబాటు జరుగుతుందా? అనేది మీమాంస.
పార్టీకి ఉన్న తరణోపాయం ఒక్కటే ‘జై బాలయ్య’ మాత్రమే. కానీ బాలకృష్ణ, చంద్రబాబునాయుడుకు తెలియకుండా కుట్ర చేసి, ‘ఆయనను గెంటేసి’ పార్టీ సారథ్యం తీసుకుంటారా అనేది సందేహం. ఎందుకంటే.. పార్టీ అధ్యక్ష బాద్యతలు చాలా సీరియస్ గా పనిచేయాల్సిన శ్రమతో కూడుకున్న పని! తిరుగుబాటు ద్వారానే బాలయ్య చేతికి పగ్గాలు వెళ్లే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే బాలయ్య చేతికి సారథ్యం ఇవ్వాలనే వారందరూ ఒక్కటవుతున్నారు. వారు బయటపడి.. తమ స్వరాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లడం, ఫత్వా జారీచేయడం త్వరలోనే జరగవచ్చు.
తెలుగుదేశం పార్టీని తొలినుంచి కమ్మ సామాజికవర్గం ఓన్ చేసుకుంది. వారందరికీ ఎన్టీఆర్ ఆరాధ్యుడు. చంద్రబాబునాయుడు సుదీర్ఘ పాలన, విధానాల నేపథ్యంలో ఆ సామాజికవర్గంనుంచి కూడా పలువురు పార్టీకి దూరం అవుతున్న పరిస్థితి ఏర్పడింది. ఇదే వారికి హెచ్చరికగా పనిచేస్తోంది. పార్టీ పగ్గాలు తిరిగి నందమూరి కుటుంబం చేతుల్లో (ప్రస్తుతానికి బాలయ్య మినహా మరొకరు గతిలేరు) ఉంటే తప్ప తిరిగి ఆ సామాజికవర్గం సమష్టిగా పార్టీకోసం తమ సర్వశక్తులు ఒడ్డి పనిచేసే వాతావరణం లేదనేది వారి వాదన. ఇదే వాదనతో తిరుగుబాటు జరిగితే చంద్రబాబుకు గత్యంతరం ఉండదు. బాలయ్య బాబు చేతిలో పార్టీ పగ్గాలు పెట్టేసి.. గెలిస్తే సీఎం అవుతా, లేకపోతే ఇంట్లో కూర్చుంటా అనుకోవాల్సిందే.
అప్పట్లో పార్టీ భవితవ్యం కోసం అల్లుడు మామగారికి వెన్నుపోటు పొడిస్తే, ఇప్పుడు అదే పార్టీ మనుగడ కోసం బావమరిది బావగారి నుంచి పగ్గాలు లాక్కోవాల్సిన సమయం ఆసన్నమయ్యింది. తప్పులేదు…అప్పట్లో అది రాజనీతి అయితే ఇప్పుడిదీ రాజనీతే కదా! ఇక కర్మసిద్ధాంతం గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మనమొకళ్లకి చేసింది తిరిగి మనకి రావడం సహజమే. నందమూరి చేతుల్లోంచి నారావారి చేతుల్లోకి పోయిన పార్టీ ఘర్ వాపసీ అయ్యి మళ్లీ నందమూరి చేతుల్లోకి వస్తోందంటే తెదేపా శ్రేణుల్లో కచ్చితంగా కొత్త ఉత్సాహం వస్తుంది. నీరసించి డీలాపడున్న పార్టీ కార్యకర్తలకు, క్యాడర్ కు ఆక్సీజన్ అందినట్టవుతుంది. రానున్న ఎన్నికలకి చిత్తశుద్ధితో పోరాడడానికి ఆ ఆక్సీజన్ చాలా అవసరం.
మొన్నటికి మొన్న హిందూపురంలో ఆవిష్కరించిన ఒక ఆరోగ్యశకటం మీద చంద్రబాబు ఫొటో లేకుండా, కనీస ప్రస్తావన కూడా లేకుండా బాలకృష్ణ తన తండ్రి ఎన్.టి.ఆర్ చిత్రంతో ముందుకొచ్చి షాకిచ్చారు. అది సర్వత్రా చర్చనీయాంశమయినా ఎవరూ బాలకృష్ణని తప్పు పట్టలేదు.
దీనిని బట్టి అర్థమవుతున్నది ఒక్కటే.
చంద్రబాబు, లోకేష్ ఒక పక్కనుంటే యావత్ తెదేపా శ్రేణి మానసికంగా మరో పక్కన ఉంది. బాలకృష్ణని తమ నాయకుడిగా భావించడానికి అధికులలో సంసిద్ధత ఉంది. బాలకృష్ణకి మాస్ ఫాలోయింగ్ ఉంది. ఎన్నారైలలో బాలకృష్ణంటే పూనకాలు తెచ్చుకునే వీరాభిమానులున్నారు. బాలకృష్ణ పార్టీ హెడ్డైతే ఎన్నికల్లో అమెరికానుంచి ఆర్థికసాయం చేయడానికి మిలయనీర్లు, బిలియనీర్లు ఉన్నారు. కానీ చంద్రబాబు నాయకత్వమున్నంతవరకూ ఎవ్వరికీ ఊపు రాదు. ఎందుకంటే బాబు “స్పెంట్ ఫోర్స్” అని తెలివున్నవారందరికీ తేటతెల్లమైపోయింది.
భార్యని ఎవరో ఏదో అన్నారని పబ్లిక్ గా ఏడ్చే టైపు చంద్రబాబైతే.. కాస్త చిరాకు తెప్పిస్తేనే పక్కనున్నవాడిపై చేయివాటం చేసుకునే నైజం బాలకృష్ణది. ఈ వ్యవహారశైలి తప్పా ఒప్పా అనేది పక్కన పెడితే నేటి రాజకీయాల్లో ఇలాంటి రూడ్నెస్ కి కూడా ఫాలోయింగుంటోంది. అందుకే కాబోలు తెదేపా సర్వం దెబ్బతిన్నా బాలకృష్ణ మాత్రం ఓటమి ఎరుగని ఎమ్మెల్యేగా 2019లో కూడా నెగ్గారు. తండ్రి పెట్టిన పార్టీకి ఊపిరిపొయ్యాలంటే తనయుడి చేతిల్లోనే ఉంది. ఆరోగ్యశకటంపై చంద్రబాబు ఫోటో లేకుండా చేయడం తెదేపా నవశకానికి నాందిగా భావించవచ్చేమో.
ఇక ఇక్కడున్న లోపమొకటి చెప్పుకోవాలి. బాలకృష్ణకి గ్రహశక్తి బలంగా ఉన్నా ఆలోచనాశక్తి మాత్రం తక్కువ. ఎక్కడ ఏది మాట్లాడాలి, ఎంత మాట్లాడాలి అనే తూకం సరిగా ఉండదు. పార్టీ నాయకుడిగా ఎదగాలంటే ఈ విషయంలో బాగా ఫోకస్ పెట్టాలి. లేకపోతే నిత్యట్రోలింగులు తప్పవు.
ఆయన సినిమాలు, ఓటీటీ షోలు హిట్టయ్యాయంటే దానికి కారణం వెనుకనున్న రచయితలు. అటువంటి వాళ్ల సాయం తీసుకుని బాలకృష్ణ తన నూతన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టాలి. అప్పుడే ఎన్.టి.ఆర్ కడుపున పుట్టిన తన జన్మకు సార్ధకత. ఎన్.టి.ఆర్ ఆత్మకు నిజమైన శాంతి.
తోటరాముడు సాహసం చేస్తే పాతాళభైరవి అనుగ్రహం లభించినట్టు, తెదేపాని బాలకృష్ణ తన వశం చేసుకుంటే కేంద్రంలో బీజేపీ అనుగ్రహం లభించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అందుకు ఆయనకు, సోదరి పురందేశ్వరి సహకారం లభించినా లభించవచ్చు. ఎందుకంటే కేంద్రాన్ని నడుపుతున్న శక్తులకి ప్రధానశత్రువు చంద్రబాబు మాత్రమే. కనుక బాబును ధిక్కరించి ఎదిరించిన ఎవరైనా బీజేపీ కి మిత్రులవుతారు. ప్రస్తుతానికి జగన్ మోహన్ రెడ్డితో బీజేపీ మిత్రత్వానికి కూడా అదొక కారణమని వేరే చెప్పక్కర్లేదు.
కనుక అన్ని విధాలుగా రాజకీయచక్రం తిప్పడానికి బాలకృష్ణకి గ్రహాలు అనుకూలిస్తున్నట్టుగా ఉంది. అయితే లోకకళ్యాణార్థమైనా బావగారినుంచి అధికారం లాక్కోవడానికి బాలకృష్ణకి మనసు రాకపోవొచ్చు. ఏదో బంధుత్వం అడ్డు రావొచ్చు. తిరుగుబాటు అనేది సంకేతాలు ఆల్రెడీ కనిపిస్తున్నాయి గానీ.. ఆ తిరుగుబాటుకు చంద్రబాబునాయుడు తలొగ్గి పక్కకు తప్పుకోకపోతే.. అదే వెన్నుపోటు రూపాన్ని కూడా సంతరించుకోవచ్చు. అందుకేనేమో గ్రహాలు ఆ దిశగా కూడా పావులు కదిపి బాలకృష్ణ- చంద్రబాబు కుటుంబాల మధ్య ప్రతికూలతని ప్రవేశపెట్టాయి. పర్యవసానంగా బాలకృష్ణ ఆరోగ్యశకటం మీద చంద్రబాబు బొమ్మలేకుండా చేసి నందమూరిజాన్ని చాటుకున్నారు. నిజమే కదా! బాలకృష్ణకి చంద్రబాబుతో సఖ్యత ఉన్నంతవరకూ ఇద్దరినీ ఒకలాగే చూస్తుంది లోకం. గొడవపడి వేరు పడితేనే బాలకృష్ణ స్వయం శక్తి చాటుకోగలిగేది.
చివరిగా చెప్పేది ఒక్కటే. అన్ని దారులూ మూసుకుపోయిన తెదేపాకి ఇప్పుడు బాలకృష్ణే దారి. తెదేపా శ్రేణులు, అభిమానులు, శ్రేయోభిలాషులు, కులపెద్దలు ఈ దిశగా బాలకృష్ణకి తోడవ్వాలి. ఇలా చేస్తే కచ్చితంగా 2024లో తెదేపా ప్రభుత్వం ఏర్పాటు చేయగలదని కాదు. కానీ ఖచ్చితంగా పార్టీ బలాన్నైతే పుంజుకుని సంఖ్యాబలమున్న ప్రతిపక్షంగానైనా నిలబడగలగుతుంది. లేకపోతే ఎన్.టి.ఆర్. స్థాపించిన తెదేపాకి అంత్యక్రియలు తప్పవు.
.. ఎల్. విజయలక్ష్మి