ఒకరు కాదు ఇద్దరు కేంద్ర మంత్రులు వచ్చారు. ఏజెన్సీలోనే మీటింగ్ పెట్టారు. విప్లవవీరుడు అల్లూరి సీతారామరాజు ఇంతటివారు అంతటివారు అని కీర్తించారు. కేంద్ర గిరిజన మంత్రి అర్జున్ ముండా, పర్యాటక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి విశాఖ మన్యంలో అల్లూరి గురించి చాలా విషయాలే చెప్పి తెలుగు వీరుడు ఆయన కావడం గర్వకారణం అన్నారు.
ఈ పొగడ్తలు, భుజ కీర్తులు ఎలా ఉన్నా గిరి సీమలకు గట్టి మేలు చేసే కార్యక్రమం కేంద్రం వద్ద ఏమైనా ఉందా అనే గిరిజన సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. అల్లూరి వంటి వీరుడు కోటికి ఒక్కరు పుడతారు. ఆయన తన చేతిలో ఏ అధికారం లేకున్నా గిరిజనుల కోసం వారి అభ్యున్నతి కోసం పాటుపడ్డాడు. అందులోనే తన తనువు చాలించాడు.
అల్లూరి పోరాటం అంతా విశాఖ మన్యంలో జరిగితే భీమవరంలో ఆయన 125వ జయంతి నిర్వహించారు ప్రభుత్వ పెద్దలు, ఇపుడు అల్లూరి పోరాడిన ప్రాత్నానికి వచ్చి మంచి మాటలు నాలుగు చెప్పారు. అయితే అది సరిపోదు, గిరిసీమలలో ఉన్న సమస్యలకు పరిష్కారం చూపాలి. విశాఖ ఏజెన్సీ టూరిజానికి ఎంతో అవకాశం ఉన్న ప్రాంతం. కేంద్ర టూరిజం మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి విశాఖ ఏజెన్సీకి ఆ దిశగా ప్రాజెక్టులు ఏవైనా మంజూరు చేస్తే గిరిజనం సంతోషిస్తారు.
అలాగే గిరిపుత్రులకు శాశ్వత ఉపాధి కల్పించే కార్యక్రమాలను కూడా కేంద్రం చేపడితే అంతకంటే సంతోషించేవారు ఉండరు. అల్లూరి పేరుని స్మరించుకోవడంతో పాటు ఆయన ఆశయాలను అమలు చేస్తేనే నిజమైన నివాళి. నాడు తెల్లదొరలపైన పోరాడిన గిరిపుత్రులు ఇపుడు తమ హక్కుల కోసం పాలకుల వైపు చూస్తున్నారు. వారి ఆశలను నెరవేర్చడమే అల్లూరికి నిజమైన నివాళి అవుతుంది.