బ్లాక్‌లో ఖైదీ టికెట్లు

చిరంజీవి మ‌న‌కాలం లెజెండ్‌. ఆయ‌న తుపాన్‌లా రాలేదు. చిరు జ‌ల్లులా వ‌చ్చి తుపాన్‌లా మారాడు. ప్రాణం ఖ‌రీదులో నూత‌న్‌ప్ర‌సాద్‌, రావుగోపాల‌రావు డైలాగ్‌ల ముందు ఆన‌లేదు. ఎవ‌రో బానే వున్నాడే అనిపించింది. పునాది రాళ్లు అస‌లు…

చిరంజీవి మ‌న‌కాలం లెజెండ్‌. ఆయ‌న తుపాన్‌లా రాలేదు. చిరు జ‌ల్లులా వ‌చ్చి తుపాన్‌లా మారాడు. ప్రాణం ఖ‌రీదులో నూత‌న్‌ప్ర‌సాద్‌, రావుగోపాల‌రావు డైలాగ్‌ల ముందు ఆన‌లేదు. ఎవ‌రో బానే వున్నాడే అనిపించింది. పునాది రాళ్లు అస‌లు రిజిస్ట‌రే కాలేదు. మ‌నఊరి పాండ‌వుల్లో ప్ర‌త్యేకంగా క‌నిపించాడు. చిన్న పాత్రే అయినా క‌ళ్ల‌లో ఆ మెరుపు, న‌ట‌న ప్ర‌త్యేకంగా క‌నిపించింది. కృష్ణంరాజు, ముర‌ళీమోహ‌న్ లీడ్ రోల్స్‌లో ఉన్నా, ఊరు బాగుండాల‌నే త‌ప‌న, విల‌న్ మీద క‌సి చిరంజీవి క‌ళ్ల‌లోనే ఎక్కువ క‌నిపించింది. తాయార‌మ్మ బంగార‌య్య‌లో అలా మెరిసాడు. ఆ బోర్ సినిమాని క్ష‌ణం సేపు క‌నిపించే చిరంజీవి కోస‌మే రెండు సార్లు చూసాను.

ఇది క‌థ కాదులో ఆ విల‌నీ అద్భుతం. పున్న‌మినాగులో మ‌నిషి పాముగా మారే  Transtoronation సూప‌ర్‌. త‌ర్వాత చాలా వ‌చ్చాయి. ఫైట్స్‌, డ్యాన్స్‌లు బాగా చేస్తాడ‌ని పేరు. ఇంకా స్టార్‌డ‌మ్ రాలేదు. న‌లుగురు పెద్ద న‌టుల మ‌ధ్య దారి చూసుకుని రావాలి, గెల‌వాలి. అది రానే వ‌చ్చింది.

చిరంజీవి మీద ఎంత అభిమానం ఉన్నా మొద‌టి రోజు మార్నింగ్ షో చూడాల‌నే త‌ప‌న‌ వుండేది కాదు. తీరిగ్గా ఫ‌స్ట్ షో, లేదా మ‌రుస‌టి రోజు చూసేవాన్ని. టికెట్లు దొర‌క‌వ‌నే ప్ర‌శ్నే లేదు. ఖైదీ రిలీజ్ అయిన‌ప్పుడు మ‌ధ్యాహ్నం ఒంటిగంట‌కి ఒక స్నేహితుడు పిచ్చోడిలా వ‌చ్చాడు.

“ఖైదీ చించేసింది గురూ, చిరంజీవి మామూలుగా లేడు. పెద్ద హిట్” అని క‌ల‌వ‌రిస్తూ, ప‌ల‌వ‌రిస్తూ చెప్పిందే చెబుతున్నాడు. చొక్కా చించుకోవ‌డ‌మే త‌క్కువ‌. అంత గ‌ట్టిగా అరుస్తున్నాడు. అభిమానం ఎక్కువైతే ఉన్మాదం. నిజంగా అంతుందా అనుకున్నా.

సాయంత్రం ఫ‌స్ట్ షో నీలం థియేట‌ర్‌కి (అనంత‌పురం) వెళ్లాను. కాంపౌండ్ అంతా చీమ‌ల గుంపులా జ‌నం. టికెట్లు ఎప్పుడో అయిపోయాయి. రెండు రూపాయ‌ల టికెట్ 10 రూపాయ‌ల బ్లాక్ న‌డుస్తోంది. అంత డ‌బ్బుల్లేక మ‌రుస‌టి రోజు మార్నింగ్ షోకి టికెట్లు ఈజీగా దొరుకుతాయ‌ని వెళ్లాను. సేమ్ సీన్‌. ఎటు చూసినా జ‌న‌మే. బ్లాక్‌లోనే వెళ్లా. ఖైదీ రేంజ్ అర్థ‌మైంది. అప్ప‌టి వ‌ర‌కూ ఒక లెక్క‌…. ఇక‌పై ఇంకో లెక్క‌.

త‌ర్వాత చిరంజీవి సినిమాల్ని ఫ‌స్ట్ డే చూడాల‌న్నా నా వ‌ల్ల కాలేదు. అభిమాన సంఘాలు కొనేసేవి. అర్ధ‌రాత్రి ఆట‌లు చిరంజీవితోనే స్టార్ట్‌. చిరంజీవి సినిమాలు అన్నీ చూసాను. న‌చ్చ‌న‌వీ కూడా ఉన్నాయి. కానీ ఆ సినిమాలు ఆడ‌క‌పోవ‌డానికి ఇంకేవో కార‌ణాలు. చిరంజీవి న‌ట‌న మాత్రం కాదు.

తిరుప‌తి ప్ర‌తాప్‌లో జ‌గ‌దేక‌వీరుడు -అతిలోక‌సుంద‌రి వ‌చ్చిన‌ప్పుడు ఆ ప్రాంత‌మంతా రోజూ జాత‌రే. చిరంజీవి -శ్రీ‌దేవీల్లో ఎవ‌రు బాగా చేశారో జ‌డ్జ్ చేయ‌డం క‌ష్టం. ఒక‌ర్కొక‌రు తినేసారు.

చిరంజీవి పార్టీ పెట్టే నాటికి తిరుప‌తిలో నేను న్యూస్ ఎడిట‌ర్‌ని. నాకున్న అనుభ‌వంతో చిరంజీవి రాంగ్ స్టెప్ వేస్తున్నాడ‌ని అనిపించింది. ఎందుకంటే ఎన్టీఆర్ వ‌చ్చిన‌పుడు రాజ‌కీయ శూన్య‌త వుంది. 2009 నాటికి కాంగ్రెస్‌, టీడీపీ పోటాపోటీగా ఉన్నాయి. ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త ఎంతోకొంత ఉండొచ్చు కానీ, వైఎస్‌పైన వ్య‌తిరేక‌త లేదు. ఆయ‌న్ని దింపి చిరంజీవిని సీఎం చేయాల‌నే జ్వాల‌, కోరిక జ‌నంలో లేవు. తిరుప‌తిలో పార్టీ ఆవిర్భావ స‌భ జ‌రిగింది. ల‌క్ష‌లాది మంది వ‌చ్చారు. జ‌నంలో నుంచి మా ఫొటోగ్రాఫ‌ర్‌ని బ‌య‌టికి తీసుకురావ‌డానికి కొన్ని గంట‌లు ప‌ట్టింది. ఆ ఫొటోల కోసం రాష్ట్రంలోని అన్ని ఎడిష‌న్లు ఎదురు చూస్తున్నాయి. స‌భ రాత్రి 10 గంట‌ల‌కి పూర్త‌యితే తిరుప‌తి నుంచి తెల్లారే వ‌ర‌కూ వాహ‌నాలు వెళుతూనే వున్నాయి. క‌నీవినీ ఎరుగ‌ని ట్రాఫిక్ జామ్‌.

చిరంజీవి ఉప‌న్యాసం అంత‌గా ఆక‌ట్టుకోలేదు. ఆయ‌న‌కి సంస్కారం ఎక్కువ‌. తొంద‌ర‌ప‌డి ఎవ‌ర్నీ ఒక మాట అన‌లేడు. రాజ‌కీయాలు అలా లేవు. నోట్లో క‌త్తులు పెట్టుకుని తీపి మాట‌లు మాట్లాడాలి. ఆయ‌న అభ్య‌ర్థుల జాబితా చూసిన‌ప్పుడే అనుమానం వ‌చ్చింది, అధికారంలోకి రాడ‌ని. అనుకున్న‌ట్టుగానే ఆయ‌న కూడా ఒక సీటులో ఓడిపోయాడు.

జీవితం ది బెస్ట్ మాత్ర‌మే కాదు, ది వ‌ర‌స్ట్ కూడా ఇస్తుంది. ఇది ప్ర‌కృతి సూత్రం. తిరుప‌తి స‌భ‌కు ల‌క్ష‌లాది మందిని చూశాను. అదే తిరుప‌తిలో చిరంజీవి రాజీనామాతో ఉప ఎన్నిక వ‌స్తే బ‌స్టాండ్‌లో చిరంజీవి స‌భ పెడితే జ‌నం వెయ్యి మంది కూడా లేరు. ఆయ‌న రాజ‌కీయాల్లో ఉండి పోరాడాల‌ని తిరుప‌తి ప్ర‌జ‌లు అనుకున్నారు. మ‌ధ్య‌లో కాడి వ‌దిలేస్తాడ‌ని అనుకోలేదు. ఆ రోజు జ‌రిగింది స‌భ కాదు, జ‌నం నిర‌స‌న‌.

రాజ‌కీయాల్లో చిరంజీవి ఓడిపోవ‌చ్చు. లోపాలు వుండొచ్చు. వైఫ‌ల్యాలు ఎదురు కావ‌చ్చు. దాని వ‌ల్ల ఆయ‌నే న‌ష్ట‌పోయాడు. పార్టీని బ‌తికించుకుని యుద్ధం చేసి వుంటే ఆయ‌న కోరుకున్న సీఎం ప‌ద‌వి కోరి వ‌రించేది.

చిరంజీవి నుంచి నేర్చుకోవాల్సింది ఏమీ లేదా? ఉంది. అది నైతిక‌త‌. కేంద్ర మంత్రిగా ఉన్నా, కాంగ్రెస్‌లో ఆయ‌న మాట చెల్లుబాటు అవుతున్నా, ఎప్పుడూ కూడా ఆయ‌న‌పై అవినీతి మ‌చ్చ ప‌డ‌లేదు. త‌న‌వాళ్ల‌కి ప‌ద‌వులు ఇప్పించాడ‌ని, కాంట్రాక్టులు ఇప్పించాడ‌ని , కుంభ‌కోణాలు చేశాడ‌ని ఎప్పుడూ వినిపించ‌లేదు.

స‌ర్పంచులు కూడా ఊళ్ల‌ని తినేస్తున్న ఈ రోజుల్లో, కేంద్ర మంత్రిగా వుండి కూడా అధికార దుర్వినియోగం చేయ‌లేదు. డ‌బ్బుకి ఆశ‌ప‌డ‌లేదు. ఒక న‌టుడిగా సాధించిన విజ‌యం కంటే కూడా ఒక నాయ‌కుడిగా సాధించిన ఈ విజ‌యం గొప్ప‌ది. నైతిక విజ‌యం. హ్యాపీ బ‌ర్త్ డే చిరంజీవి సార్‌!

జీఆర్ మ‌హ‌ర్షి