ఏపీలో జగన్ ను ఓడించాలని, వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రాకుండా చేయాలని ప్రతిపక్షాలు తహతహలాడుతున్నాయి. పీఠం తామే దక్కించుకోవాలని టీడీపీ, బీజేపీ, జనసేన పోటీ పడుతున్నాయి. మరోవైపు జగన్ పార్టీని ఓడించాలంటే పొత్తులు తప్పనిసరి కాబట్టి ఆ పని ఎలా చేయాలనేదానిపై గందరగోళం పడుతున్నాయి. అయోమయం సృష్టిస్తున్నాయి. తమకు తామే అయోమయంలో పడుతున్నాయి. చివరకు ప్రతిపక్షాలన్నీ కలిసి జగన్ కె అధికారం అప్పగించేలా ఉన్నాయి. ప్రతిపక్షాల మధ్య అయోమయం సృష్టించడంలో జనసేనాని పవన్ కళ్యాణ్ కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈ విషయంలో బీజేపీ కూడా తనవంతు కృషి చేస్తోంది.
అసలు ఆ రెండు పార్టీల మధ్య పొత్తు ఉన్నదో లేదో, కలిసి పనిచేస్తున్నాయో లేదో తెలియదు. పవన్ కళ్యాణ్ రాజకీయ అపరిపక్వత ఇంకా కొనసాగుతూనే ఉంది. 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి తాను తగ్గి గెలిపించానని పవర్‌స్టార్ స్పష్టం చేసేరు. తాను అప్పుడు ఎంతో సాయం చేసిపెట్టాను గనుక ఇప్పుడు తనకు మద్దతునిచ్చి గెలిపించాల్సిన భారం తలకెత్తుకోమని పవన్ టిడిపి అధినేత చంద్రబాబుకి చాలా ఫ్రెండ్లీ హెచ్చరిక చేసేడు. రాష్ట్ర రాజకీయాల్లో ఇంకా హెచ్చరించేంత అనుభవంలేని నేత తలనెరిసిన వారికి ఇక తగ్గాల్సింది మీరే అని హెచ్చరికలు జారీ చేయడం, అదీ ఫ్రెండ్లీగా అయినా చేశారంటే కమలనాధుల అండదండల ధైర్యమే అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
వచ్చే ఎన్నికలకు మూడు ఆప్షన్లు అంటూ పవర్‌స్టార్ చెప్పినవేమిటంటే.. బిజెపి దోస్తానాలో పోటీచేయడం, టిడిపి ఓకే అంటే వారితో కలిసి పోటీ చేయడం, మూడవది..అసలిదంతా తలనొప్పి అనుకుంటే ఒంటరిగా పోటీచేయడం. ఇక్కడే అర్ధమవుతోంది పవన్ అనుభవ రాహిత్యం. అందరితో చర్చించి తీసుకునే నిర్ణయాలకు, అందర్నీ విన్నట్టు నటించి తీసుకునే నిర్ణయాలకూ ఎంతో తేడా వుంది. ఇవి ఆప్షన్లా! ఆయన పరిస్థితిని ఆయనే స్వయంగా బయటపెట్టుకోవడం తప్ప. టీడీపీ ఎలాగూ ఆయన్ను అంత సీరియస్‌గా తీసుకోదనే విశ్లేషకులు అంటున్నారు. అయినా పొత్తు అనేది ప్రేమలాంటిది.
అవతలివారూ మీ ప్రేమని నమ్మాలి గదా! జనసేనవారు ఏ మాటమీద నిలబడతారో వారికి క్లారిటీ వచ్చాకనే మిగతా విషయాలు మాట్లాడుకోవచ్చని చంద్రబాబు యోచన. అందుకని జనసేనీయులు కూడా పెద్దాయన అన్న మాటల్ని బాగా అర్ధంచేసుకుని పవర్‌స్టార్‌కి అర్ధమయేలా సూచించడం ఇక చాలా అవసరం.
ఇక్కడ మరో సంగతేమంటే.. ఎంతో సత్సంబంధాలు నెరపుతున్న బిజెపి వారు పవన్‌ను తమ ఉమ్మడి సీఎం అభ్యర్ధిగా ప్రకటించనే లేదు. అంటే వారికి కేంద్రంలోని పార్టీ అధినేతలు ఆ సంగతి స్పష్టం చేయలేదు. చేస్తారన్న నమ్మకం కూడా లేదు. ఎందుకంటే పవన్ పవర్‌స్టార్‌గా ప్రజాకర్షణ కలిగిన వ్యక్తి. ఓట్లు రాబట్టుకోవడానికి అదొక అస్త్రం.. అలానే పవన్‌ని చూస్తారు. అంతేగాని ఏకాఎకీ గెలిచే గుర్రంలా ఎలా భావిస్తారు. అలాంటపుడు ఆప్షన్లు ఇస్తున్నాను మీరే తేల్చుకోండి అంటూ ధీమాగా అనడం కేవలం అమాకత్వమే అవుతుంది.
జనసేన నాయకుడి నించి అభిమానులు ఆశిస్తున్నది అమాయకత్వం కాదు. పార్టీని విజయపథంలోకి తీసికెళ్లగల అసలు సిసలు సత్తా. తాను చాలా శక్తిమంతుడనని ప్రచారం చేయించుకోవడానికి ఆప్షన్లు ప్రకటించడం ఒక మార్గం అనుకుందాం
అసలు ఆప్షన్లు ఇచ్చి హెచ్చరించే శక్తి వున్నపుడు, వేరేవారిని పీఠం ఎక్కించడానికి మరో అవకాశం ఇస్తున్నానని చూచాయిగా వ్యక్తం చేసే బదులు తమరే సీఎం పీఠాన్ని ఎలా ఎక్కాలో ఆలోచించుకోవచ్చు కదా. మీరంటున్నదానికి మీరే క్లారిటీ ఇవ్వలేకపోతే ఎలా? ఇక టీడీపీ శ్రేణులు మాత్రం పవన్ కళ్యాణ్ తగ్గాలి అంటూ చేసిన సూచన పైన అంతర్గతంగా మండిపడుతున్నాయి. పవన్ తగ్గాలి అనే ఫార్ములాకు అంగీకరించాల్సిన అవసరం లేదని సోషల్ మీడియాలో అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ మీద ఉన్న వ్యతిరేకత కారణంగా..టీడీపీ ఒంటరిగా పోటీ చేసినా అధికారంలోకి వస్తుందనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. తగ్గాల్సింది చంద్రబాబు కాదు.. పవన్ తగ్గాలంటూ పోస్టింగ్స్ కనిపిస్తున్నాయి. టీడీపీ అధినేత..ముఖ్య నేతలు మాత్రం వ్యూహాత్మకంగా మౌనం పాటిస్తున్నారు.
వచ్చే ఎన్నికలు..ప్రజాభిప్రాయం…గెలుపు – ఓటమి అవకాశాల పైన పూర్తి అంచనాలు వచ్చిన తరువాతనే పొత్తుల పైన స్పందించాలని అప్పటి వరకు ఆమోదించటమో..తిరస్కరించటమో చేయాల్సిన అవసరం లేదనే అభిప్రాయంతో ఉన్నారు. ఇక, ఈ పరిస్థితుల్లో బీజేపీ మైండ్ గేమ్ ప్రారంభించింది. చంద్రబాబు సీట్లు అడిగితే పొత్తుల విషయం ఆలోచిస్తామని బీజేపీ నేతలు చెబుతున్నారు. మొత్తంగా.. ఇప్పుడు పొత్తుల పేరుతో చంద్రబాబు తగ్గాలనే డిమాండ్లతో… టీడీపీ అధినేత తీసుకోబోయే నిర్ణయాలు వచ్చే ఎన్నికల్లో కీలకం కానున్నాయి.
అయితే, జనసేన నేతలు మాత్రం తూర్పు గోదావరి లో చంద్రబాబు పర్యటన సందర్భంగా పొత్తుల అంశాన్ని ప్రస్తావిస్తూ..తాము త్యాగాలకు సిద్దమని చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తున్నారు. ఈ సారి టీడీపీ అధికారంలోకి రాకపోతే..ఇక, టీడీపీ మనుగడ కష్టమనే వైసీపీ వాదనను జనసేన నేతలు విశ్వసిస్తున్నారు. అదే సమయంలో..టీడీపీ ఒంటరిగా పోటీకి దిగి.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు బీజేపీ – జనసేన తో సహా ఇతర పార్టీల మధ్య చీలితే అది పరోక్షంగా వైసీపీకి సహకరిస్తుందనేది జనసేన అంచనా.