
ఏపీ బీజేపీ చీఫ్‌గా దగ్గుబాటి పురందేశ్వరి బాధ్యతలు తీసుకున్న వేళా విశేషం ఏమో కానీ, సొంత పార్టీ నుంచే తీవ్ర నిరాదరణ ఎదుర్కొంటున్నారు. ఇంత కంటే ఒక పార్టీ అధ్యక్షురాలిగా దుఃఖం కలిగించే అంశం ఏముంటుంది? ఇదంతా పురందేశ్వరి స్వయంకృతాపరాధమే అని బీజేపీ నేతలు అంటున్నారు. పురందేశ్వరిపై వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తుంటే, ఆమెకు మద్దతుగా నిఖార్సయిన బీజేపీ నేతలెవరూ మద్దతుగా నిలబడడం లేదు.
పురందేశ్వరి తమ పార్టీ రాజకీయ ప్రయోజనాలను పక్కన పెట్టి, చంద్రబాబుకు లాభం చేకూర్చేందుకే శ్రమిస్తున్నారని బీజేపీ నేతలు అంటున్నారు. అందుకే పురందేశ్వరిపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు నిత్యం తీవ్రస్థాయిలో సోషల్ మీడియా, మీడియా వేదికగా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నా... ఏ ఒక్క బీజేపీ నేతలు నోరు విప్పడం లేదు. పైగా విజయసాయిరెడ్డికి పురందేశ్వరికి సంబంధించిన అవినీతి బాగోతం గురించి ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తూ, ఆమెపైకి ఉసిగొల్పుతున్నారు.
పురందేశ్వరిపై వైసీపీ విమర్శలను బీజేపీ నేతలు ఎంజాయ్ చేస్తున్నారు. మరోవైపు టీడీపీ నేతలు నొచ్చుకుంటున్నారు. పురందేశ్వరిపై విజయసాయిరెడ్డి విమర్శలను జీర్ణించుకోలేక మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు, వర్ల రామయ్య తదితర టీడీపీ నేతలు కౌంటర్లు ఇస్తున్న పరిస్థితి. ఇంతకంటే పురందేశ్వరికి అవమానం ఏముంటుంది? తనను వైసీపీ నేతలు తీవ్రంగా టార్గెట్ చేస్తుంటే, సొంత పార్టీ నుంచి ఎందుకు మద్దతు కొరవడిందో పురందేశ్వరి ఆత్మపరిశోధన చేసుకోవాల్సిన అవసరం వుంది.
పురందేశ్వరిపై విజయసాయిరెడ్డి విమర్శిస్తుంటే... ఆమెకు మద్దతుగా మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ట్వీట్ చేశారు. విజయసాయిరెడ్డికి ధైర్యం వుంటే జగన్ తల్లి, చెల్లి ఎక్కడున్నారో చెప్పాలని ఆయన డిమాండ్ చేయడం గమనార్హం. ఇదే మాట బీజేపీ నేతల నుంచి వచ్చి వుంటే పురందేశ్వరికి సంతోషం కలిగేది. చంద్రబాబుకు రాజకీయంగా లబ్ధి కలిగించేందుకు పురందేశ్వరి రాజకీయం చేస్తున్నారంటూ వైసీపీ విమర్శలను పక్కన పెడితే, అదే విషయాన్ని బీజేపీ నాయకులు, కార్యకర్తలు కూడా నమ్ముతున్నారు. అందుకే వారి నుంచి మౌనం వ్యక్తమవుతోంది.
అంటే బాబు ప్రయోజనాల కోసం పురందేశ్వరి పని చేస్తున్నారనే విమర్శలకు మౌనం ద్వారా మద్దతు పలుకుతున్నట్టుగా వుంది. ఈ విషయాన్ని అర్థం చేసుకుని పురందేశ్వరి తన పద్ధతి మార్చుకోవడమా లేక తాను టీడీపీలో చేరడమా? అనేది ఆలోచించుకోవాలి. కానీ ఒక్కటి మాత్రం నిజం. సొంత పార్టీ నిరాదరణ కంటే, పురందేశ్వరి మనసుకు కష్టం కలిగించే అంశం మరొకటి వుండదు.
నేను మొక్కలతో, దేముడితో మాట్లాడుతా