Advertisement

Advertisement


Home > Politics - Analysis

నాలుగో వంతు ఫిరాయింపుదార్లే.. బీజేపీ లోక్ స‌భ అభ్య‌ర్థులు!

నాలుగో వంతు ఫిరాయింపుదార్లే.. బీజేపీ లోక్ స‌భ అభ్య‌ర్థులు!

భార‌తీయ ఫిరాయింపుదార్ల పార్టీ అనొచ్చు బీజేపీని! ఒక‌వైపు కాంగ్రెస్ ముక్త్ భార‌త్ అనే నినాదాలు ఇస్తూ.. ఆ పార్టీ నుంచి ఎడా పెడా నేత‌ల‌ను చేర్చుకుంటూ వ‌స్తోంది క‌మ‌లం పార్టీ! కాంగ్రెస్ కు పేరు మారిస్తే బీజేపీ అవుతుంద‌న్న‌ట్టుగా క‌మ‌లం పార్టీ నిండా ఇప్పుడు కాంగ్రెస్ లీడ‌ర్లే క‌నిపిస్తూ ఉన్నారు! కేవ‌లం కాంగ్రెస్ వాళ్లే కాదు, ఇప్ప‌టికిప్పుడు లెక్క‌బెడితే క‌మ‌లం పార్టీలో నాలుగో వంతు ఫిరాయింపు లీడ‌ర్లు, పార్టీ మారిన వారే క‌నిపిస్తారు!

లోక్ స‌భ ఎన్నిక‌ల్లో భార‌తీయ జ‌న‌తా పార్టీ త‌ర‌ఫున నిల‌బ‌డిన వారి జాబితాలో అయితే ఏకంగా నాలుగో వంతు వేరే పార్టీల నుంచి బీజేపీలోకి వ‌చ్చి చేరిన వారే ఉన్నారంటే ఆశ్చ‌ర్యం క‌ల‌గ‌క మాన‌దు! ఇప్ప‌టి వ‌ర‌కూ వివిధ ద‌శ‌ల‌కు సంబంధించి బీజేపీ లోక్ స‌భ అభ్య‌ర్థుల జాబితా దాదాపు 435 ఉంది. వారిలో ఏకంగా 106 మంది గ‌త ఐదు సంవ‌త్స‌రాల్లోనూ, త‌మ అవ‌స‌రానికి అనుగుణంగా ఈ ఎన్నిక‌ల ముందు బీజేపీ తీర్థం పుచ్చుకున్న వాళ్లు! ఇలా బీజేపీ అభ్య‌ర్థుల జాబితాలో ఏకంగా వంద మందికి పైగా ఆ పార్టీ లోకి ఇటీవ‌లి కాలంలో చేరిన వారే!  

బీజేపీ అంటే వ్య‌వ‌స్థీకృతం అని, ఆ పార్టీలో ఎద‌గాలంటే ఆ పార్టీ వ్య‌వ‌స్థ‌ల్లో చాలా కాలం పాటు ప‌ని చేసి ఉండాల‌ని, ఆర్ఎస్ఎస్ నేప‌థ్యం అని, ఏబీవీపీ అని, సంఘ్ ప‌రివార్ లో ఏదో ఒక బ్రాంచ్ లో ప‌ని చేసిన వారికి, ఇళ్లు, కుటుంబాన్ని వ‌దిలి సంఘ్ ప‌రివార్ ఆఫీసుల్లో రేయింబ‌వ‌ళ్లు ప‌ని చేసిన వారికి, సంఘ్ ప‌రివార్ విశ్వాసాల‌కు క‌ట్టుబ‌డిన వారికి, కాషాయ సిద్ధాంతాలే ఊపిరిగా పీల్చిన వారికి.. బీజేపీ త‌ర‌ఫున అవ‌కాశాలు ల‌భిస్తాయ‌ని పేరు! అయితే అదంతా గ‌తం! కేవ‌లం గ‌త ఐదేళ్ల‌లో బీజేపీ లోకి చేరిన వారికి ఏకంగా నాలుగో వంతు లోక్ స‌భ సీట్లు వెళ్లిపోయాయంటే.. బీజేపీ జ‌స్ట్ ఫిరాయింపుదార్ల స్టే కోసం ఉప‌యోగ‌ప‌డుతోంద‌ని అన‌డానికి ఇంక వేరే రుజువులు అక్క‌ర్లేదు! 

పార్టీలో ద‌శాబ్దాల పాటు ప‌ని చేసిన వారిని నాయ‌కులుగా త‌యారు చేసుకుంటుంద‌నే పేరున్న బీజేపీ ఇలా డ‌బ్బు సంచుల‌తోనో, వేరే పార్టీల్లో బాగా సంపాదించుకునో వ‌చ్చిన వారికి టికెట్లు ఇచ్చి ఆశ్చ‌ర్య‌ప‌రుస్తూ ఉంది! బీజేపీ అంటే ఇంకా పాత సిద్ధాంతాలు, రాద్ధాంతాలు అనుకునే వాళ్ల‌కు లోక్ స‌భ అభ్య‌ర్థుల జాబితా ఫుల్ క్లారిటీ ఇచ్చి ఉండాలి!

గ‌త ఐదేళ్ల‌లో మాత్ర‌మే బీజేపీ తీర్థం పుచ్చుకుని ఎంచ‌క్కా ఈ లోక్ స‌భ ఎన్నిక‌ల్లో బీజేపీ అభ్య‌ర్థులు అయిన వారి జాబితాను ప‌రిశీలిస్తే.. ఇందులో ఏపీ కూడా ముందు వ‌ర‌స‌లో ఉంది. ఏపీలో తెలుగుదేశం- జ‌న‌సేన‌ల‌తో పొత్తుతో బీజేపీ ఆరు స్థానాల్లో పోటీ చేస్తోంది. అందులో ఏకంగా ఐదు మంది గ‌త ఐదేళ్ల‌లోపే బీజేపీలోకి చేరిన వారు! వారు ఎందుకు బీజేపీలోకి చేరారు, ఎలా చేరార‌నే సంగ‌తీ తెలిసిందే! తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబునాయుడు అవ‌స‌రాల కోసం బీజేపీలోకి చేరిన బాప‌తు వాళ్లంతా! 

తెలంగాణ‌లో అయితే బీజేపీ 17 స్థానాల్లో పోటీ చేస్తే, అందులో 11 చోట్ల ఇటీవ‌లి కాలంలో బీజేపీలోకి చేరిన వారే బ‌రిలో ఉన్నారు! తెలంగాణ‌లో బీజేపీకి వేళ్లు ఉన్నాయ‌ని, రూట్స్ నుంచి ఎదిగింద‌ని అంటూ ఉంటారు! అయితే.. రూట్స్ నుంచి ప‌దిల ప‌డిన పార్టీ అయితే ఇలా ఆఖ‌రి స‌మ‌యంలో తీర్థం పుచ్చుకున్న వారికి టికెట్లు ఇవ్వాల్సిన అవ‌స‌రం ఏముంద‌నేది ప్ర‌శ్న‌!

హ‌ర్యానాలో ప‌దికి ఆరు మంది, పంజాబ్ లో 13 మందికి గానూ ఏడుగురు, జార్ఘంలోనూ 13 మందికి గానూ ఏడు మంది, ఒడిశాలో బీజేపీ 21 సీట్ల‌కు పోటీ చేస్తే అక్క‌డో ఆరుగురు, మ‌హారాష్ట్ర‌లో బీజేపీ పోటీ చేస్తున్న 28 సీట్ల‌లో ఏడు మంది.. వీరంతా టికెట్ హామీ ల‌భించాకో, టికెట్ కోస‌మో బీజేపీలోకి చేరిన వారే త‌ప్ప ఆ పార్టీ సిద్ధాంతాల‌తో ఎదిగిన వారేమీ కాదు! అన్నింటికి మించిన విచిత్రం ఏమిటంటే.. బీజేపీ త‌మ‌కు తిరుగులేదు అని అంటున్న ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో కూడా ఆయారాంల‌కు పెద్ద పీట ప‌డింది! యూపీలో బీజేపీ 74 మంది అభ్య‌ర్థుల జాబితాను ప్ర‌క‌టిస్తే వారిలో ఏకంగా 23 మంది ఆ పార్టీలోకి అవ‌స‌రార్థం చేరిన వారే! బీజేపీ అత్యంత బ‌ల‌వంతంగా ఉంద‌నుకున్న యూపీలోనే ఇలా మూడో వంతు మంది ఫిరాయింపుదార్ల‌కు బీజేపీ టికెట్ లు ల‌భించాయి!

వెస్ట్ బెంగాల్ లో ప‌ది మంది, క‌ర్ణాట‌క‌లో న‌లుగురు, త‌మిళ‌నాడులో ఐదుగురు.. ఇలా ఏ రాష్ట్రం చూసినా ఇదే ప‌రిస్థితి! ఆఖ‌రి నిమిషంలో బీజేపీలోకి చేరి, టికెట్ ఇస్తామంటే బీజేపీలోకి చేరి, టికెట్ ఇస్తామంటేనే బీజేపీలోకి చేరిన వారే ఆ పార్టీ అభ్య‌ర్థులు అయ్యారు! అలాంటి వారు రాత్రికి రాత్రి క‌మ‌లం పార్టీ లోక్ స‌భ అభ్య‌ర్థుల‌య్యారు! వారంతా ఎందుకు బీజేపీలోకి చేరారు అనేది బ‌హిరంగ ర‌హ‌స్యం! త‌మ అవ‌స‌రార్థం వారు క‌మ‌లం పార్టీ కండువాలు వేసుకున్నారు, కాషాయ వాదులు అయిపోయారు!

దేశం కోసం, ధ‌ర్మం కోసం అంటూ ఉంటారు వాట్సాప్ యూనివ‌ర్సిటీలోని క‌మ‌లం పార్టీ మ‌ద్ద‌తుదార్లు! అయితే .. ఇలా అవ‌స‌రార్థ రాజ‌కీయాలు, అవ‌కాశ‌వాద రాజ‌కీయాలు కూడా దేశం కోసం, ధ‌ర్మం కోసం అనే వారు న‌మ్ముతూ ఉండ‌వ‌చ్చు! 

అయితే.. దేశంలో ఏకంగా వంద‌కు పైగా లోక్ స‌భ సీట్ల‌ను ఇలా అవ‌స‌రార్థం వ‌చ్చి చేరిన వారికే కేటాయించ‌డం ద్వారా.. బీజేపీ త‌మ రాజ‌కీయం గురించి స్ప‌ష్ట‌మైన సందేశాన్నే ఇచ్చింది! త‌మ‌ది అధికారం కోసం, డ‌బ్బు ఖ‌ర్చు పెట్ట‌గ‌లిగిన పెట్టుబ‌డిదారుల కోసం చేసే రాజ‌కీయ‌మే త‌ప్ప ఇంకే సిద్ధాంతం, విధానం కూడా ఏమీ లేద‌ని క‌మ‌లం పార్టీ ఫుల్ క్లారిటీ ఇచ్చింది 2024 లోక్ స‌భ సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌తో!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?