
ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ ఎన్నిక అనగానే దశాబ్దాల రాజకీయాలు పరిచయం వున్నవారికి గుర్తుకు వచ్చే పేరు పి.వి.చలపతిరావు. భాజపాగా మారడానికి ముందు జనసంఘ్ గా వున్నప్పుడే పట్టభద్రుల కోటా నుంచి ఒకటికి రెండుసార్లు ఎన్నికయ్యారు. కాంగ్రెస్ ఈ రాష్ట్రాన్ని చిరకాలం పాలించనంత కాలం పట్టభద్రుల ఎన్నిక అంటే జనసంఘ్ కే ఎక్కువ అవకాశాలు వుండేవి. తరువాత తరువాత తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక కొంత వరకు పరిస్థితి మారింది. గత టెర్మ్ లో పివి చలపతిరావు తనయుడు పివి మాధవ్ మళ్లీ ఈ స్థానాన్ని గెల్చుకున్నారు.
కానీ ఇప్పుడు జరిగిన హోరా హరో పోరులో వైకాపా-తేదేపాల నడుమ భాజపా నలిగిపోయింది. వాస్తవం చెప్పాలంటే ఒకప్పుడు పట్టభద్రులు అంటే లెక్క వేరు. 80 వ దశకానికి ముందు వీరి సంఖ్య చాలా తక్కువ. అసలు అందుకోసమే గ్రాడ్యుయేట్ల నుంచి ఓ ప్రతినిధి సభలో వుండాలని ఈ ఏర్పాటు చేసారు. అప్పట్లో నిశానీ..వేలిముద్ర ప్రతినిధులే కదా ఎక్కువ వుండేది. కాస్తో, కూస్తో ఐడియాలజీ, సిద్దాంతాలు వుండే ఓటర్ల ఈ జాబితాలో వుండే అవకాశం వుంది.
ఇప్పుడు అసలు డిగ్రీ చదవని వారిని లెక్కపెట్టుకోవచ్చు. ప్రతి ఒక్కరూ చదువుకుంటున్నారు. ఏదో ఒక డిగ్రీ చేస్తున్నారు. ఇది ఇలా మరింత ముందుకు వెళ్తే, భవిష్యత్ లో మామూలు ఓటర్ లిస్ట్ కు, పట్ట భద్రుల ఓటరు లిస్ట్ కు పెద్ద తేడా వుండదు. అందువల్ల ఇకపై పట్టభద్రుల నుంచి భాజపా జనాలు ఎన్నిక కావడం అన్నది సాధ్యం కాకపోవచ్చు. ఉత్తరాంధ్ర ఎన్నికలో భాజపా మూడో స్థానానికి పడిపోవడం వెనుక మతలబు ఇదే. ఎప్పుడూ లేనిది ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎన్నిక కూడా హోరా హోరీగా జరగడానికి, డబ్బులు మంచి నీళ్లలా ఖర్చు కావడానికి కారణం అక్కడ కూడా అన్ని రాజకీయ అవ లక్షణాలు వచ్చేయడమే.
వెయ్యి గడప వున్న పల్లెటూరులో ఒకప్పుడు ఒకరిద్దరు డిగ్రీ హోల్డర్లు వుంటే ఇప్పుడు కనీసం రెండు డజన్ల మంది వుంటున్నారు. అందువల్ల ఇకపై పట్టభద్రుల ఎన్నిక అంటే కూడా పక్కా ఎమ్మెల్యే ఎన్నికల మాదిరిగానే వుంటుంది. 80 వ దశకంలో వున్నట్లు సైలంట్ గా, అసలు జనాలకు పట్టనట్లు వుండదు.
శాంపిల్ సర్వే
పైన చెప్పుకున్న కారణాల వల్లే, ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎన్నికను రాబోయే ఎమ్మెల్యే ఎన్నికలకు ఓ శాంపిల్ సర్వేగా తీసుకోవచ్చు. అయితే ఇది కొంతవరకు మాత్రమే. ఓటర్ మూడ్ ఎలా వుందీ అన్నది ఈ ఎన్నిక కొంత వరకు చెబుతుంది.
కానీ ఇక్కడ గమనించాల్సింది ఒకటి వుంది. ఇది జస్ట్ రెండు లక్షల పై చిలుకు ఓట్లతో లెక్క. ఎమ్మెల్యే ఎన్నికలు అంటే లక్షలకు లక్షల ఓట్లు. పల్లెల్లో వెయ్యి మందికి డిగ్రీ జనాలు ఓట్లు వెయ్యి మందికి ఇరవై వుంటే, చదువు కోని వారి సంఖ్య వందల్లో వుంటుంది. అది వైకాపాకు కొంత వరకు ధీమా ఇవ్వొచ్చు.
కానీ ఈ చదువుకున్నవారు ఆ చదువుకోని వారిని ప్రభావితం చేసే అంశాన్ని ఇక్కడ మరిచిపోకూడదు. అందువల్ల ఈ ఎన్నికలను ఓ శాంపిల్ సర్వేలా తీసుకుని వైకాపా జాగ్రత్త పడాల్సిన తరుణం వచ్చేసినట్లే.