చివ‌రికి ప‌వ‌న్‌…ఆ ఇద్ద‌రిలా మిగిలిపోతారు!

ప‌వ‌న్‌క‌ల్యాణ్ రెండు రోజులు ఢిల్లీలో వుండి చివ‌రిగా తేల్చేశాడు. వైసీపీ విముక్త ఆంధ్ర‌ప్ర‌దేశ్ త‌మ ఎజెండా అని చెప్పాడు. విముక్తి చాలా పెద్ద ప‌దం. శతాబ్దాలు బ్రిటీష్ దాస్యంలో మ‌గ్గిన దేశానికి తెల్ల దొర‌ల…

ప‌వ‌న్‌క‌ల్యాణ్ రెండు రోజులు ఢిల్లీలో వుండి చివ‌రిగా తేల్చేశాడు. వైసీపీ విముక్త ఆంధ్ర‌ప్ర‌దేశ్ త‌మ ఎజెండా అని చెప్పాడు. విముక్తి చాలా పెద్ద ప‌దం. శతాబ్దాలు బ్రిటీష్ దాస్యంలో మ‌గ్గిన దేశానికి తెల్ల దొర‌ల నుంచి విముక్తి అని అప్ప‌ట్లో జాతీయ నాయ‌కులు వాడారు. ప‌వ‌న్ ఇప్పుడు వైసీపీ నుంచి విముక్తి అంటున్నాడు.

వైసీపీ చేసిన నేరం ఏమంటే పేద ప్ర‌జ‌ల‌కి సంక్షేమ ప‌థ‌కాలు క్ర‌మం త‌ప్ప‌కుండా అందించ‌డ‌మే. ముస‌లి వాళ్ల‌కి ఒక‌టో తేదీ ఇంటి ద‌గ్గ‌రికే పింఛ‌న్లు ఇస్తున్నారు. వాళ్ల‌కి పింఛ‌న్లు లేకుండా విముక్తి క‌ల్పిస్తారా?

అమ్మ ఒడితో త‌ల్లుల‌కి డ‌బ్బులొస్తున్నాయి. పిల్ల‌ల్ని ప్ర‌భుత్వ స్కూళ్ల‌కి పంపేవాళ్ల సంఖ్య పెరిగింది. వాళ్ల‌కి విముక్తి క‌లిగించి ప్రైవేట్ స్కూళ్ల‌కి దోచి పెడ‌తారా?

ఇంటి దగ్గ‌రికే రేష‌న్ బండి వ‌స్తోంది. దాన్ని ఆపేసి ఎండావానల్లో అంద‌ర్నీ ప‌డిగాపులు కాయిస్తారా? నాడు-నేడుతో స్కూళ్ల రూపు రేఖ‌లు మారిపోతున్నాయి. అదంతా వెన‌క్కి తీసుకెళ్లి కాంపౌండ్‌, టాయిలెట్లు లేని స్కూళ్ల‌ని అలాగే చూడాల‌ని అనుకుంటున్నారా? పెచ్చులూడిపోయిన గోడ‌ల కింద బిక్కుబిక్కుమ‌ని పిల్ల‌లు కూచోవాలా?

మ‌ధ్యాహ్న భోజ‌నం నాణ్యత పెరిగింది. పిల్ల‌ల‌కి పౌష్టికాహారం కింద చిక్కీలు, రాగిజావ ఇస్తున్నారు. వాళ్ల నోటి దగ్గ‌ర కూడు తీసేస్తారా?

రైతుల‌కి భ‌రోసా ద‌క్కుతోంది. ఉచితంగా బోర్లు వేస్తున్నారు. పల్లెల్లో వాలంటీర్ల వ్య‌వ‌స్థ‌తో ప‌రిస్థితులు మారిపోయాయి. ప్ర‌తిదానికి మండ‌ల కేంద్రానికి ప‌రుగులు తీసే ప‌నిలేదు. విముక్తి క‌లిగించి ఇదంతా వెన‌క్కి తీసుకెళ్తారా?  

ఆస‌రాతో మ‌హిళ‌లు స్వ‌యం స‌మృద్ధి అవుతున్నారు. చేనేత కార్మికులు, ఆటో డ్రైవ‌ర్లు, చిన్న‌చిన్న వ్యాపార‌స్తులు అంద‌రికీ వైసీపీ ప్ర‌భుత్వం అండ‌గా నిలుస్తోంది. ఈ పేద‌వాళ్ల‌కి సంక్షేమ నుంచి విముక్తి క‌లిగించి క‌ష్టాల దారి చూపిస్తారా?

జ‌గ‌న్‌పైన మీకు కోపం వుంటే వుండొచ్చు. వైసీపీలో లోపాలు, వైఫ‌ల్యాలు ఉన్నాయి. ప్ర‌భుత్వం అంటేనే విజ‌యాలు, వైఫ‌ల్యాల స‌మ్మేళ‌నం. అయితే పేద‌ల సంక్షేమం విష‌యంలో వైసీపీ చిత్త‌శుద్ధిని, సీరియ‌స్‌నెస్‌ను ఎవ‌రూ శంకించ‌లేరు.

ప‌వ‌న్ ద‌గ్గ‌ర వుండాల్సింది విముక్తి ఎజెండా కాదు. వైసీపీ పథ‌కాల నుంచి పేద‌లెవ‌రూ విముక్తి కోర‌డం లేదు. పేద‌ల‌కి ఏం కావాలో ప‌వ‌న్‌కి తెలియ‌దు. అది తెలుసుకోవ‌డం ఆయ‌న ఎజెండా. చంద్ర‌బాబుని ముఖ్య‌మంత్రి చేసే ఎజెండా వ‌ల్ల ఆయ‌న మ‌రో హ‌రికృష్ణ‌, ద‌గ్గుబాటిగా మిగిలిపోతారు.