ప‌వ‌న్ ధ్యాస‌, శ్వాస అదొక్క‌టే!

సినిమా ప‌రంగా ప‌వ‌న్‌క‌ల్యాణ్ అగ్ర‌హీరో స్థాయికి ఎదిగారు. అన్న మెగాస్టార్ చిరంజీవి ప్రోత్సాహంతో ప‌వ‌న్ క‌ల్యాణ్‌ సినీ రంగంలో ప్ర‌వేశించారు. న‌ట‌న‌లో త‌న‌కంటూ ప్ర‌త్యేక స్టైల్‌ను ఏర్పాటు చేసుకున్నారు. టాలీవుడ్‌లో చెప్పుకోత‌గ్గ స్థాయిలో అభిమానుల్ని…

సినిమా ప‌రంగా ప‌వ‌న్‌క‌ల్యాణ్ అగ్ర‌హీరో స్థాయికి ఎదిగారు. అన్న మెగాస్టార్ చిరంజీవి ప్రోత్సాహంతో ప‌వ‌న్ క‌ల్యాణ్‌ సినీ రంగంలో ప్ర‌వేశించారు. న‌ట‌న‌లో త‌న‌కంటూ ప్ర‌త్యేక స్టైల్‌ను ఏర్పాటు చేసుకున్నారు. టాలీవుడ్‌లో చెప్పుకోత‌గ్గ స్థాయిలో అభిమానుల్ని సంపాదించుకున్నారు. రాజ‌కీయాల్లో ప్ర‌వేశించి హీరో కావాల‌ని క‌ల‌లుగ‌న్నారు. క‌ల‌లు క‌ల్ల‌ల‌య్యాయి. ప్ర‌జాద‌ర‌ణ చూర‌గొన‌డం అంటే సినిమాల్లో న‌టించ‌డం అంత ఈజీ కాద‌ని అర్థం కావ‌డానికి ఎక్కువ స‌మ‌యం ప‌ట్ట‌లేదు.

నిజానికి రాజ‌కీయాల్లో త‌న‌ బ‌లం, బ‌ల‌హీన‌త ఏంట‌ని ప‌వ‌న్ ప్ర‌శ్నించుకోవాలి. ఏపీలో బ‌ల‌మైన కాపు సామాజిక వ‌ర్గ‌మే ఆయ‌న బ‌లం. అదే లేక‌పోతే ప‌వ‌న్‌క‌ల్యాణ్ ప‌రిస్థితి ఏంట‌ని ప్ర‌శ్నిస్తే… శూన్య‌మ‌నే స‌మాధానం వ‌స్తుంది. కాపులంతా త‌న‌కు ఓట్లు వేయ‌క‌పోవ‌డం వ‌ల్లే అధికారం ద‌క్క‌లేద‌ని ఇటీవ‌ల ప‌వ‌న్‌క‌ల్యాణ్ వాపోయిన సంగ‌తి తెలిసిందే. త‌న‌కు కులాలు, మ‌తాలు లేవ‌ని ప‌వ‌న్‌క‌ల్యాణ్ ప‌దేప‌దే చెబుతుంటారు.

ఇలా చెప్పేవాళ్ల‌తోనే ప్ర‌మాదం. మ‌న‌సులో కుల స్పృహ బ‌లీయంగా ఉన్న వాళ్లే ఇలా మాట్లాడుతుంటార‌ని మాన‌సిక విశ్లేష‌కులు చెబుతుంటారు. ఉభ‌య‌గోదావ‌రి జిల్లాల్లో ఈ ద‌ఫా వైసీపీ తుడిచి పెట్టుకుపోతుంద‌ని రెండు రోజుల క్రితం ప‌వ‌న్‌క‌ల్యాణ్ హెచ్చ‌రిం చిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌త్యేకంగా ఆ రెండు జిల్లాల ప్ర‌స్తావ‌నే ఎందుకు తెచ్చారో అర్థం చేసుకోలేని స్థితిలో జ‌నం లేరు. ఆ జిల్లాల్లో త‌న సామాజిక వ‌ర్గం బ‌లంగా ఉంద‌ని, త‌న‌నే ఆద‌రిస్తుంద‌ని, వైసీపీని తిర‌స్క‌రిస్తుంద‌ని ప‌వ‌న్ న‌ర్మ‌గ‌ర్భ వ్యాఖ్య‌లు చేశారు. క‌నీసం ఈ సారైనా త‌న సామాజిక వ‌ర్గం అండ‌గా ఉండ‌క‌పోతుందా? అనే ఏకైక న‌మ్మ‌కంతో ప‌వ‌న్ ఉన్నారు. కులం ఒక్క‌టే త‌న‌కు న‌మ్మ‌క‌మైన ఓటు బ్యాంకుగా ప‌వ‌న్ భావిస్తున్నార‌ని స‌మాచారం.

జ‌న‌సేన రాజ‌కీయ వ్య‌వ‌హారాల క‌మిటీ చైర్మ‌న్ నాదెండ్ల మ‌నోహ‌ర్ నేతృత్వంలో ప‌వ‌న్ సామాజిక వ‌ర్గం, అలాగే మెగా అభిమాన సంఘాల నేత‌లు, కార్య‌క‌ర్త‌ల్ని ఏకం చేసే ప‌నిలో ఉన్నారు. ఈ నేప‌థ్యంలో మంగ‌ళ‌గిరిలో జ‌న‌సేన కార్యాల‌యంలో అఖిల‌భార‌త చిరంజీవి యువ‌త‌, రాష్ట్ర చిరంజీవి యువ‌త ప్ర‌తినిధుల‌తో నాదెండ్ల స‌మావేశ‌మ‌య్యారు. మెగా అభిమాన సంఘాల‌న్నీ రాజకీయ ప్ర‌క్రియ‌లో భాగ‌మై ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ను ముఖ్య‌మంత్రి చేయ‌డానికి ముందుకు రావాల‌ని నాదెండ్ల పిలుపునిచ్చారు. క్షేత్ర స్థాయిలో ప‌నిచేస్తున్న అభిమాన సంఘాల‌ను పార్టీలో క‌లిపే ప్ర‌క్రియ‌ను మూడు నెల‌ల్లో పూర్తి చేస్తామ‌ని అన్నారు.

ఇదే రీతిలో వివిధ ర‌కాల కాపు సంఘాల నేత‌ల‌తో స‌మావేశాలు నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు చేస్తున్నార‌ని స‌మాచారం. జ‌న‌సేన లెక్క‌ల‌న్నీ కుల స‌మీక‌ర‌ణ‌పై ఆధార‌ప‌డి ఉన్నాయ‌నే చ‌ర్చ న‌డుస్తోంది. దీన్ని త‌ప్పు ప‌ట్టాల్సిన ప‌నిలేదు. అన్ని పార్టీలు కూడా ఇదే ప‌ని చేస్తున్నాయి. అయితే జ‌న‌సేన విష‌యానికి వ‌చ్చే స‌రికి మిగిలిన కులాల‌తో స‌మ‌న్వ‌యం చేసుకోలేక‌పోవ‌డం పెద్ద లోటుగా క‌నిపిస్తోంది. ఈ క్ర‌మంలో ప‌వ‌న్ సామాజిక వ‌ర్గం ఒంట‌రిగా మిగిలాల్సి వుంటుంద‌నే హెచ్చ‌రిక‌ల‌పై ఆ పార్టీ పెద్ద‌లు ఆలోచించాల్సి వుంది.