జగన్ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలనివ్వనని, అందుకు తాను నాయకత్వం వహిస్తానని జనసేనాని పవన్‌కల్యాణ్ వీరావేశంతో చెప్పారు. ఆ మాటను నిలబెట్టుకునే దారి కనుచూపు మేరలో కనిపించడం లేదు. జనసేనతో పొత్తు పెట్టుకోవాలనే ఉద్దేశంతో చంద్రబాబునాయుడు వన్‌సైడ్ లవ్ అంటూ కవ్వించారు. అసలే చంద్రబాబు మాయలోడు. జనసేనతో పొత్తుపై పార్టీ నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో చంద్రబాబు వెనక్కి తగ్గారు.
ఈ నేపథ్యంలో మంగళగిరిలో ఇటీవల జరిగిన జనసేన విస్తృతస్థాయిలో సమావేశంలో పవన్‌కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. వన్‌సైడ్ లవ్, వార్ వన్‌సైడ్…. ఈ రెండింటిలో టీడీపీ వైఖరిపై స్పష్టత రావాల్సి వుందన్నారు. అలాగే గతంలో తాను 2014, 2019లలో తగ్గానని, 2024లో కూడా తగ్గడానికి సిద్ధంగా లేనని తేల్చి చెప్పారు. టీడీపీ కాస్త తగ్గాలని సూచించారు. ఈ సందర్భంగా తనను తగ్గించుకునే వాడు హెచ్చింపబడును అనే బైబిల్ వాక్యాన్ని తెరపైకి తెచ్చారు.
ఇప్పటికే రెండు సార్లు తగ్గానని చెబుతున్న పవన్, ముచ్చటగా మూడోసారి కూడా తగ్గి బైబిల్ ప్రకారం గొప్పవాడు కావచ్చు కదా అని టీడీపీ వ్యంగ్యంగా అంటోంది. ఏ రకంగానూ టీడీపీ, జనసేన మధ్య పొత్తు కుదిరే అవకాశాలు లేవని జనసేనకు అర్థమైంది. మరోవైపు జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కామెంట్స్ ప్రాధాన్యం సంతరించుకున్నాయి. పార్టీల పరంగా ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయనేది పక్కన పెట్టి …రాష్ట్రంలో అధికార మార్పు రావాలని, వైసీపీ ప్రభుత్వం పోవాలనే కాంక్షతో అందరూ పని చేయాలని నాదెండ్ల పిలుపునిచ్చారు.
మరి పిల్లిమెడలో గంట కట్టేదెవరు? ఒకవైపు అధినేత పవన్ మాత్రం తాను తగ్గేదే లే అంటున్నారు. ఎవరికెన్ని సీట్లు వస్తాయనేది పక్కన పెట్టాలని చెప్పినంత సులువా ఆచరణ! జగన్ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చనివ్వనంటూ 2014లో మాదిరిగా టీడీపీకి భేషరతుగా జనసేనాని మద్దతు ఇస్తారా? టీడీపీ నుంచి సానుకూల సంకేతాలు రాకపోవడంతో జనసేన గందరగోళంలో పడింది. ఏం చేయాలో ఆ పార్టీ నేతలకు దిక్కుతోచడం లేదు.