టీడీపీ అధినేత చంద్రబాబు మాటలు నమ్మి జనసేనాని పవన్‌కల్యాణ్ ఏదేదో ఊహించుకున్నారు. అందుకే జగన్ వ్యతిరేక ఓట్లు చీలనివ్వనని బహిరంగంగా ప్రకటించారు. రెండు రోజుల క్రితం మంగళగిరిలో జనసేన కార్యాలయంలో పవన్ మాట్లాడుతూ మూడు ఆప్షన్లను అందరి ముందు ఉంచారు. వాటిపై రాజకీయ పార్టీల నుంచి గట్టిగా రియాక్షన్ వచ్చింది. తగ్గాలో, పెరగాలి చెప్పడానికి నువ్వెవరని టీడీపీ నుంచి గట్టిగానే ప్రశ్నలు వెల్లువెత్తాయి.
175 నియోజకవర్గాల్లో చంద్రబాబే అభ్యర్థి అని ఆ పార్టీ సోషల్ మీడియా విస్తృతంగా ప్రచారం మొదలు పెట్టింది. దీంతో జనసేనకు తత్వం బోధపడింది. టీడీపీతో పొత్తు తలుపులు మూసుకుపోయాయని గ్రహించింది. ఈ నేపథ్యంలో 24 గంటల్లోనూ జనసేన రాజకీయ వైఖరిలో పూర్తిగా మార్పు రావడం ఆశ్చర్యం కలిగిస్తోంది. తాజాగా జనసేన డిమాండ్, రాజకీయ పంథా మారిందని, ఆ పార్టీ నేతల మాటలే చెబుతున్నాయి.
జనసేన మనసులో నుంచి టీడీపీని తొలగిపోయింది. బీజేపీతో మాత్రమే పొత్తు అని మానసికంగా ఓ నిర్ణయానికి వచ్చారు. ఈ నేపథ్యంలో ఏపీలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సోమ, మంగళవారాల్లో రాష్ట్రంలో పర్యటించనున్నారు. నడ్డా పర్యటనను దృష్టిలో ఉంచుకుని జనసేన తమ డిమాండ్‌ను బలంగా వినిపించే ప్రయత్నం చేస్తోంది.
జనసేన, బీజేపీ మధ్య పొత్తు కొనసాగుతుందని, అయితే ఉమ్మడి సీఎం అభ్యర్థిగా తమ నాయకుడు పవన్‌కల్యాణ్ పేరును ఏపీ పర్యటనలో నడ్డా ప్రకటించాలని డిమాండ్ చేయడం విశేషం. అంతేకాదు, తమ పార్టీ తరపున నడ్డాకు స్వాగతం పలుకుతామని జనసేన అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ స్పష్టం చేయడం ఆ పార్టీలో వచ్చిన మార్పునకు నిదర్శనం. ఇదంతా టీడీపీ తిరస్కరణ తర్వాత జనసేనలో వచ్చిన మార్పుగా బీజేపీ నేతలు చెబుతున్నారు.
జనసేన తన తప్పు తెలుసుకుని ఇప్పటికైనా తమ దారిలోకి రావడం శుభపరిణామమని బీజేపీ నేతలు అంటున్నారు. చంద్రబాబును నమ్మితే మోసపోతామని తాము ముందు నుంచీ హెచ్చరిస్తున్న విషయాన్ని బీజేపీ గుర్తు చేస్తోంది.