అదేమీ మహాజనప్రవాహం కానే కాదు. కాకపోతే ఇప్పుడు దయనీయమైన పరిస్థితుల్లో వారు ఆశించిన దానికంటె ఖచ్చితంగా ఎక్కువ! ఆ మాత్రం జనం వచ్చినదానికే ఉబ్బితబ్బిబ్బు అయిపోతున్నది తెలుగుదేశం. కేవలం ఎన్నికల్లో గెలవడం కోసం అయితే.. తమకు ఒకరి మద్దతు అవసరమే లేదని, ఒంటరిగా కూడా విజయం సాధించగలమని విర్రవీగుతున్నది. కాకపోతే.. జగన్పై వ్యతిరేకత లెక్కతేల్చడం కోసమే ఇతరులతో బంధం కలుపుకోదలచుకున్నట్లుగా అహంకారపూరితమైన మాటలు మాట్లాడుతున్నది. ఈ అహంకారం పార్టీకి ఖచ్చితంగా చేటు చేస్తుందన్నది అందరూ మాట్లాడుకుంటున్న విషయం!
నిన్నటిదాకా చంద్రబాబునాయుడు ‘‘స్నేహమేరా జీవితం.. స్నేహమేరా శాశ్వతం’’ అంటూ కోరస్ లో పాటలు పాడారు! ఇవాళ ‘‘నలుగురికి నచ్చినది నాకసలే ఇక నచ్చదురో.. నరులెవరూ నడవనిది ఆ రూట్లో నే నడిచెదరో’’ అంటూ తెగ నీలుగుతున్నారు. ‘‘పొగరని అందరు అన్నాఅది మాత్రం నా నైజం’’ అని సినిమాలో మహేష్ బాబు పాట లెవెల్లో.. చంద్రబాబునాయుడు సోలోగా కూడా పాడుకోవచ్చు గాక! అవసరం వస్తే కాళ్లు పట్టుకుంటా.. అవసరం తీరిపోతే, కాళ్లు పట్టుకు లాగేస్తా అనేదే ఆయన నైజం అని ప్రజలు ఆ మాటల్ని అర్థం చేసుకుంటున్నారు.
తెలుగుదేశం పార్టీ మార్చిన మాటల సరళిని ప్రజలు సరిగానే అర్థం చేసుకుంటున్నారు. మరి వారితో పొత్తులకోసం తానే ఉబలాటపడిపోతున్న పవన్ కల్యాణ్ ఎప్పటికి అర్థం చేసుకుంటారో..?ఇదంతా ఒక ఎత్తు అయితే.. అసలు ఇంతకీ తెలుగుదేశం పార్టీ బలం పెరిగిందా? గతంలో గెలిచిన 23 స్థానాలనే నిలబెట్టుకోలేకపోయిన వారు.. మరిన్ని స్థానాలను గెలుచుకోగల స్థితిలో ఉన్నారా? ఇంతకీ చంద్రబాబు బలుపు అని అనుకుంటున్నది నిజంగా బలుపేనా? వాపా? గ్రేటాంధ్ర విశ్లేషణాత్మక వ్యాసం ఇది!
తెలుగుదేశం పార్టీ ఒక్కసారిగా స్వరం మార్చింది. తమకు హఠాత్తుగా అపరిమితమైన బలం వచ్చేసిందని భావిస్తోంది. తమ పార్టీ బలోపేతం అయిందని అనుకుంటోంది. ప్రజలు తమకు బ్రహ్మరథం పడుతున్నారని భావిస్తోంది. వచ్చే ఎన్నికలలో అప్రతిహతమైన తిరుగులేని విజయాన్ని నమోదు చేయబోతున్నామని విశ్వసిస్తోంది. తమకు ఎదురే లేదని విర్రవీగుతూ ఉంది. పర్లేదు.
కొంతవరకు 'ఓవర్ కాన్ఫిడెన్స్' పెద్ద జబ్బేమీ కాదు. ఒక లిమిట్ దాటనంత వరకు అలాంటి రోగానికి పెద్దగా మందులు వాడాల్సిన అవసరం లేదు. కానీ హద్దులు దాటిన తర్వాత, దానిని కాన్ఫిడెన్స్ అన్నారు.. 'ఓవర్' అనే పదాన్ని దానికి ముందు జత చేయాలని గుర్తు చేయకపోతే ప్రమాదం. అది వాళ్ళకే చేటు చేస్తుంది. ఓవర్ కాన్ఫిడెన్స్ మాయలో నుంచి బయట పడక పోతే.. ఆ పార్టీనే నష్టపోతుంది. అసలు ఎందుకు ఇంత ఓవర్ కాన్ఫిడెన్స్? దీనివలన ఎలా నష్టపోతున్నది? ఈ విషయాలని విశ్లేషిద్దాం.
మహానాడు పుట్టించిన భ్రమ అది..
మహానాడు కార్యక్రమానికి వచ్చిన జనం వారికి చాలా గొప్ప అనిపించింది. ఆ జనాన్ని వాళ్ళే నమ్మలేకపోయారు. మురిసిపోయారు. అంతవరకు పరిమితం అయితే బాగుండేది. ఇప్పుడు మిడిసిపడుతున్నారు. అక్కడే వచ్చింది ఇబ్బంది. నిజానికి మహానాడు కు కాసింత జనం రావడానికి చాలా కారణాలున్నాయి. ముందస్తు ఎన్నికలు వచేస్తాయేమో అనే చంద్రబాబు ప్రచారాన్ని ఆ పార్టీ నాయకులు ఎక్కువ మంది నమ్మడం ప్రధాన కారణం. అసలు వచ్చే ఏడాదికి మహానాడు ఉంటుందో లేదో అని నాయకులు అనుకున్నారు. వచ్చే ఏడాది మహానాడు సమయం కంటే ముందుగానే ఎన్నికలు రావొచ్చు అనే ఆశ వారికి ఉంది.
ఈలోగా తమకు టీడీపీ టికెట్లు కావాలంటే బల ప్రదర్శన తప్పదు అనే ఉద్దేశంతోనే జనాల్ని తరలించారు. పార్టీ భవితవ్యం ఎలా ఉన్నప్పటికీ ఎమ్మెల్యే కావాలనే కోరిక ప్రతీ ఊరిలో ఒకరికి ఉంటుంది గనుక జనం సంగతి వారు చూసుకున్నారు. డబ్బు ఖర్చు పెట్టి తరలించారు. చంద్రబాబు ప్లే చేసిన మరో ట్రిక్కు కూడా జనాన్ని తరలించడానికి బాగానే ఉపయోగపడింది. మరి కొద్ది నెలల వ్యవధిలోనే ఎమ్మెల్యే టికెట్ల అభ్యర్థులను పూర్తిగా ఖరారు చేస్తామని, చంద్రబాబునాయుడు పదేపదే ప్రకటించారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 175 నియోజకవర్గాలలో 30 స్థానాల్లో ఇంకా డైలమా ఉన్నది తప్ప, మిగిలిన నియోజకవర్గాలకు చురుగ్గా కసరత్తు జరుగుతోందని, కొన్ని నెలల వ్యవధిలోనే అభ్యర్థుల జాబితా ప్రకటన ఉంటుందని, వారంతా తమ తమ నియోజకవర్గాలలో కష్టపడి పని చేసుకోవచ్చు అని నారా లోకేష్ కూడా చాలాసార్లు హింట్ ఇచ్చారు. దాంతో తక్షణం బల ప్రదర్శన చేసుకోవడం అనేది అందరి అవసరం అయింది. టికెట్ల మీద ఆశ ఉన్న వారందరూ తలో చేయి వేసి మనుషులను తరలించారు. ఏదైతేనేం మహానాడులో జనం పుష్కలంగా కనిపించారు. వారందరూ పార్టీ కార్యకర్తలేనా? కిరాయికి తరలివచ్చారా? అనేది వేరే సంగతి! ఆ జనాన్ని చూసుకుని చంద్రబాబు వాపును బలుపు అనుకుంటున్నారు.
వ్యతిరేకత ఉందనే ఆత్మవంచన
జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పట్ల ప్రజలలో రాష్ట్ర వ్యాప్తంగా అపరిమితమైన వ్యతిరేకత ఉన్నదనే ఒక ఆత్మ వంచనలో తెలుగుదేశం పార్టీ బతుకుతున్నది. ప్రజలను మభ్యపెట్టడానికి.. ప్రజలతో మైండ్ గేమ్ ఆడడానికి ఇలాంటి అసత్య ప్రచారాలు ఉపయోగపడతాయి గాని, వాస్తవానికి అవి పార్టీకి చేటు చేస్తాయి. ఎలాగంటే వ్యతిరేకత ప్రచారాన్ని.. ప్రజలు కాకుండా పార్టీ కార్యకర్తలు అతిగా తలకు ఎక్కించుకుంటే నష్టం తప్పదు! ఎటూ వ్యతిరేకత ఉన్నది కదా.. జగన్ ను ఓడించగలిగిన అన్ని ఓట్లు తమ ఖాతాలో అప్పనంగా వచ్చి పడిపోతాయని వారు అనుకుంటే కొంప కొల్లేరవుతుంది.
జగన్ మీద వ్యతిరేకత ఎందుకు ఉంటుంది? ప్రతి ఇంటికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నప్పుడు ఎవరు మాత్రం ఎందుకు వ్యతిరేకిస్తారు? ఈ లాజిక్ ను తెలుగుదేశం మిస్ అవుతోంది. నిజానికి జగన్మోహన్ రెడ్డి సంకల్పంతో.. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా గడపగడపకు కార్యక్రమాలు జరుగుతున్నాయి. గడపగడపకు కార్యక్రమం చాలా అద్భుతమైన స్పందన సాధిస్తోంది. ప్రతి ఇంటికి వెళ్తున్న ఎమ్మెల్యే ఆయా కుటుంబాలకు ప్రభుత్వం ద్వారా ఏయే పథకాలు అందాయో.. ఈ మూడేళ్లలో వారికి ఎంత లబ్ధి చేకూరుతుందో చాలా స్పష్టంగా లెక్కలు చెబుతున్నారు.
ప్రత్యేకంగా వారికి అందిన లబ్ది వివరాలు తెలియజేసేలా ఒక లేఖను కూడా ఇస్తున్నారు. తమకు ప్రభుత్వం ఎంత మంచి చేస్తున్నదో ప్రజలు మరచిపోయే అవకాశం కూడా లేదు. ఇంత పక్కాగా, ప్రణాళికాబద్ధంగా ప్రభుత్వం ప్రజలలో మంచి పేరు మూటగట్టుకుంటున్నది. ప్రజలు ప్రభుత్వాన్ని అభిమానిస్తున్నారు. ఇదిలా ఉండగా వ్యతిరేకత ఉన్నదంటూ గడపగడపకు కార్యక్రమంలో ఎమ్మెల్యేలను నిలదీస్తున్నారు అంటూ అనేకానేక విషపూరితమైన కథనాలు పచ్చ మీడియాలో వెల్లువలా వస్తున్నాయి.
నిజం చెప్పాలంటే రాష్ట్రవ్యాప్తంగా ఉండే ఐదు కోట్ల జనాభాలో పచ్చ మీడియాలో ఎన్ని వందల కథనాలు వచ్చాయో అందరు మాత్రమే వ్యతిరేకించినట్లు ! మిగిలిన రాష్ట్రమంతా కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలకు నీరాజనం పడుతోంది అన్న మాట వాస్తవం! అయితే పచ్చ మీడియా ఒక కుట్ర ఉద్దేశంతో వ్యతిరేకత వ్యక్తమయ్యే అతి కొన్ని సంఘటనలు మాత్రం ప్రచారం చేస్తున్నది!.
సహజంగానే ఎమ్మెల్యే ఇంటికి వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీకి చెందిన వారు వ్యతిరేకించడం.. విమర్శించడం.. గోల చేయడం జరుగుతుంది. అవి మాత్రమే మీడియాలో ప్రచారం పొందుతున్నాయి. అలాంటి అతి స్వల్ప సంఘటనల వార్తలను చూసుకుని.. జగన్ ప్రభుత్వం ఓడిపోతుందని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు విశ్వసిస్తే గనుక తమ గోతిని తానే తవ్వుకుంటున్నట్లు లెక్క!
ఈ ఎగస్ట్రాలు పవన్ కు చిరాకు పుట్టిస్తే..
తెలుగుదేశం పార్టీ నాయకులు ఇప్పుడు చాలా ఎగస్ట్రాలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ అవసరమే తమకు లేదని, వ్యాఖ్యానాలు వినిపిస్తున్నారు. తమ పార్టీ ఒంటరిగానే అబ్జల్యూట్ మెజారిటీని సాధిస్తుందని కూడా అంటున్నారు. ఇవన్నీ కూడా వారు ప్రైవేటు సంభాషణల్లో చెబుతున్న విషయాలు మాత్రమే కావచ్చు. పార్టీ అధికారికంగా ఇంకా అలాంటి విషయాన్ని ప్రకటించక పోవచ్చు. కానీ తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఇలాంటి ఓవరాక్షన్ కేవలం వారంతట వారే చేస్తున్నారని అనుకోవడానికి వీలు లేదు. పార్టీ హైకమాండ్ నుంచి ఎలాంటి సూచనలు లేకుండా.. వారు ఇంత తెగించి మాట్లాడతారు అనుకోవడం భ్రమ! మరి తెలుగుదేశం ఎందుకు ఇలాంటి నాటకాలు ఆడుతూ ఉన్నట్లు?
ఎందుకంటే.. ఇప్పుడు ఆ రెండు పార్టీల నడుమ సీట్ల పంపకానికి సంబంధించిన చర్చ నడుస్తుంది. పవన్ కళ్యాణ్ 30 సీట్లలో పోటీ చేయాలని గట్టిగా పట్టుబడుతున్నట్లు ఇదివరకే వార్తలు లీక్ అయ్యాయి.. దానికి తగినట్లుగానే 30 సీట్లు లో అభ్యర్థుల ఎంపిక ఇంకా మొదలుకాలేదు.. అని నారా లోకేష్ ఒక సంకేతం ఇచ్చారు. ఇలాంటి సమయంలో తమకు సొంతంగా బలం పెరిగిపోయింది.. అనే మాటలతో మైండ్ గేమ్ ఆడితే మరిన్ని ఎక్కువ సీట్లు అడగకుండా పవన్ కళ్యాణ్ ను నియంత్రించవచ్చు అనేది తెలుగుదేశం పార్టీ వారి చీప్ స్ట్రాటజీ! ఈ చీప్ తెలివితేటలను పవన్ కళ్యాణ్ గమనిస్తే కనుక వారి మీద ఆయనకు అసహ్యం పుడుతుంది.
పవన్ కళ్యాణ్ లేకుండా ఎన్నికలకు వెళ్లే ఆలోచన చంద్రబాబుకు ఏమాత్రం లేదు.. అంత సాహసం ధైర్యం లేనేలేవు! బాబు నాయుడు చాలా వ్యూహాత్మకంగా పార్టీ నాయకులతో ఇలాంటి అతి మాటలు మాట్లాడిస్తున్నారు తప్ప.. స్వయంగా తాను గానీ తన కొడుకు గానీ ఆ మాట చెప్పడం లేదు! అంతమాత్రాన పవన్ అమాయకుడు అనుకోవడానికి వీలు లేదు. అందుకే తెగే వరకు లాగితే పవన్ తో వారు ఆశిస్తున్న స్నేహబంధం పురుడు పోసుకోక ముందే పుటుక్కుమనే ప్రమాదం కూడా ఉంది!!
చంద్రబాబు తెలుసుకోవాల్సిన సత్యం ఒకటి ఉంది. వాపును బలుపుగా ప్రొజెక్ట్ చేయడం రాజకీయాల్లో అవసరం. అలా ప్రజలను మోసం చేయడానికే చేయాలే తప్ప.. తమను తాము మోసం చేసుకోడానికి కాకూడదు. ఈ సత్యాన్ని తెలుసుకోకుంటే తెలుగుదేశం అథః పాతాళానికి పడిపోతుంది. ఈ ఎన్నికలు మిస్ అయితే ఇక జన్మలో లేవడం ఉండదు.
.. ఎల్. విజయలక్ష్మి