ప‌వ‌న్ ఎంత గొప్పోడంటే…!

ఏ నాయ‌కుడైనా ఎవ‌రినైనా కొంత కాల‌మే మోసం చేస్తాడ‌ని పెద్ద‌లు అంటుంటారు. అన్ని కాలాల్లోనూ ఎవ‌రూ మోసం చేయ‌లేర‌ని చెబుతుంటారు. కానీ పెద్ద‌ల మాట‌ల‌కు కూడా అంతుచిక్క‌ని గొప్ప నాయ‌కుడు జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌. ఏకంగా…

ఏ నాయ‌కుడైనా ఎవ‌రినైనా కొంత కాల‌మే మోసం చేస్తాడ‌ని పెద్ద‌లు అంటుంటారు. అన్ని కాలాల్లోనూ ఎవ‌రూ మోసం చేయ‌లేర‌ని చెబుతుంటారు. కానీ పెద్ద‌ల మాట‌ల‌కు కూడా అంతుచిక్క‌ని గొప్ప నాయ‌కుడు జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌. ఏకంగా ప‌దేళ్లుగా త‌న సామాజిక వ‌ర్గాన్ని మోసం చేస్తూనే ఉన్నారాయ‌న‌. ఇందుకు మ‌నోళ్లు కూడా సీఎం కావాల‌నే ఏకైక కాపుల ఆకాంక్షే, వారిని ప‌వ‌న్ మోసం చేయ‌డానికి కార‌ణమైంది.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో బీసీల త‌ర్వాత అత్య‌ధిక జ‌నాభా క‌లిగిన సామాజిక వ‌ర్గంగా కాపు, దాని అనుబంధ కులాలు గుర్తింపు పొందాయి. ఏపీలో కేవ‌లం నాలుగైదు శాతం ఓటు బ్యాంక్ క‌లిగిన రెడ్డి, క‌మ్మ సామాజిక వ‌ర్గాలు సుదీర్ఘ కాలంగా అధికారాన్ని చెలాయిస్తున్నాయి. అలాంట‌ప్పుడు గెలుపోట‌ముల‌ను ప్ర‌భావితం చేయ‌గ‌ల త‌మ కులం నుంచి సీఎం ఎందుకు కాకూడ‌ద‌నే కోరిక కాపుల నుంచి పుట్ట‌డం స‌మంజ‌స‌మే.

అయితే కాపుల రాజ్యాధికారం ఆకాంక్ష‌ను బాగా సొమ్ము చేసుకున్న కుటుంబం ఏదంటే… మెగాస్టార్ ఫ్యామిలీనే. 2009లో మెగాస్టార్ చిరంజీవి ప్ర‌జారాజ్యం పార్టీని స్థాపించారు. బ‌డుగు, బ‌ల‌హీన‌వ‌ర్గాల‌కు రాజ్యాధికారం పేరుతో చిరంజీవి స‌ముద్ర కెర‌టంలా ఆ స‌మ‌యంలో ఉవ్వెత్తున ఎగిసిప‌డ్డారు. ఆ ఎన్నిక‌ల్లో చిరంజీవి నిజాయ‌తీగానే నిల‌బ‌డ్డారు.

అయితే ప్ర‌జారాజ్యం కేవ‌లం కాపుల పార్టీగా ముద్ర‌ప‌డ‌డంతో అన్ని సామాజిక వ‌ర్గాల ఆద‌ర‌ణ పొంద‌లేక‌పోయింది. అయిన‌ప్ప‌టికీ 18 అసెంబ్లీ సీట్ల‌తో చిరంజీవి అసెంబ్లీలో అడుగు పెట్టారు. చిరంజీవి తిరుప‌తి నుంచి గెలుపొందారు. అయితే ఆయ‌న పార్టీని కాపాడుకోలేక‌పోయారు. కాంగ్రెస్‌లో విలీనం చేశారు. ఈ మాత్రం సీట్లు ప‌వ‌న్‌కు వ‌చ్చి వుంటే, ఆయ‌న పార్టీని విలీనం చేసి వుండేవారు కాదు.

చిరంజీవికి సినిమా వ్యాపారమే త‌ప్ప‌, రాజ‌కీయాన్ని సొమ్ము చేసుకోవ‌డం తెలియ‌క‌నే ప్ర‌జారాజ్యాన్ని విలీనం చేశార‌నే కామెంట్స్ అప్ప‌ట్లో వినిపించాయి. ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ను చూడండి. జ‌న‌సేన పార్టీ పెట్టి ప‌దేళ్లైంది. ఇంత వ‌ర‌కూ ఆయ‌నే అసెంబ్లీలో అడుగు పెట్ట‌లేదు. పార్టీ పెట్టిన సంద‌ర్భంలో ప‌వ‌న్ ఎన్నిక‌ల‌కు దూరంగా వుండి, టీడీపీ-బీజేపీ కూట‌మికి మ‌ద్ద‌తు తెలిపారు.

2019లో మాత్రం బీఎస్పీ, వామ‌ప‌క్షాల‌తో పొత్తు కుదుర్చుకున్నారు. ప‌వ‌న్ రెండు చోట్ల నిలిచి, క‌నీసం ఒక్క‌చోట కూడా గెలవ‌లేక‌పోయారు. అయితేనేం, 2024 ఎన్నిక‌ల స‌మ‌యానికి మళ్లీ రెడీగా ఉన్నారు. ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌ను గ‌ద్దె దించేందుకు టీడీపీతో పొత్తు కుదుర్చుకున్న‌ట్టు బిల్డ‌ప్ ఇస్తున్నారు. ఏపీలో ప‌వ‌న్‌ను కాపు సామాజిక వ‌ర్గ ప్ర‌తినిధిగానే టీడీపీ, వైసీపీ గుర్తిస్తున్నాయి. అందుకే పొలిటిక‌ల్‌గా ప‌వ‌న్ సీరియ‌స్ నాయ‌కుడు కాన‌ప్ప‌టికీ, ఆయ‌న మ‌ద్ద‌తుతో కొద్దోగొప్పో కాపుల ఓట్ల‌ను త‌మ వైపు తిప్పుకోవ‌చ్చ‌ని టీడీపీ న‌మ్ముతోంది.

ఏపీలో త‌న బ‌లం కుల‌మే అని ప‌వన్‌కు బాగా తెలుసు. కాపుల‌ను గ‌త ప‌దేళ్లుగా బాగా సొమ్ము చేసుకుంటున్న‌, బ‌ద్నాం చేస్తున్నా వారెవ‌రైనా ఉన్నారంటే… కేవ‌లం ప‌వ‌న్ క‌ల్యాణే. ఎందుకంటే ప‌వ‌న్‌ను మ‌రే కులం న‌మ్మ‌దు. ఆయ‌న్ను మిగిలిన కులాలు రాజ‌కీయ పిచ్చోడిగా చూస్తాయి. కానీ త‌న‌ను అభిమానించే కాపుల‌ను ప‌వ‌న్ కుల‌పిచ్చోళ్లుగా చూస్తూ, మ‌న‌సులో న‌వ్వుకుంటూ వుంటారు.

ప‌దేళ్లుగా పార్టీ పెట్టి, తాడు బొంగ‌రం లేకుండా రాజ‌కీయం చేస్తున్న త‌న‌ను అభిమానించే వాళ్ల‌ను పిచ్చోళ్లు అనుకోకుండా, ఏమ‌నుకుంటార‌నేది ప‌వ‌న్ అంత‌రంగం. ప‌వ‌న్ ఆలోచ‌న స‌రైందే. ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత త‌మ‌ను ప‌ట్టించుకోలేద‌ని రెడ్లు ఆగ్ర‌హంగా ఉన్నారు. అలాగే 2014 నుంచి 19 వ‌ర‌కూ కేవ‌లం పెద్ద‌పెద్ద క‌మ్మ నేత‌ల‌కే చంద్ర‌బాబు దోచి పెట్టార‌ని ఆయ‌న సామాజిక వ‌ర్గం కోప‌గించుకుని గ‌త ఎన్నిక‌ల్లో బుద్ధి చెప్పింది.

కానీ ప‌దేళ్లుగా త‌మ‌ను చెర‌కును పిప్పి చేసిన‌ట్టు పీల్చి పిప్పి చేస్తున్నా మెజార్టీ కాపు సామాజిక వ‌ర్గం ఇంకా మేల్కొన‌లేద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. మోస‌పోయే వాళ్లుంటే ప‌వ‌నే కాదు, చంద్ర‌బాబైనా, జ‌గ‌న్‌బాబైనా త‌మ కులాల‌ను వాడుకుంటూనే వుంటారు. అప్ర‌మ‌త్త‌గా వుండాల్సింది ఆయా కులాలు మాత్ర‌మే. టీడీపీకి త‌మ‌ను తాక‌ట్టు పెట్టి సొమ్ము చేసుకుంటున్న ప‌వ‌న్‌కు బుద్ధి చెప్ప‌డ‌మా? లేక ఆయ‌న స్వార్థానికి బ‌లి కావ‌డ‌మా? అనేది కాపులే నిర్ణ‌యించుకోవాల‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది.