నువ్వేం నాయకుడవయ్యా పవన్ కళ్యాణ్!

తాజాగా పవన్ కళ్యాణ్ 2024 ఎన్నికలకు తన ముందున్న మూడు ఆప్షన్స్ ని చెప్పుకున్నారు.  Advertisement 1. బీజేపీ – జనసేన కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం  2. బీజేపీ-జనసేన-టీడీపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు…

తాజాగా పవన్ కళ్యాణ్ 2024 ఎన్నికలకు తన ముందున్న మూడు ఆప్షన్స్ ని చెప్పుకున్నారు. 

1. బీజేపీ – జనసేన కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం 

2. బీజేపీ-జనసేన-టీడీపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం 

3. జనసేన ఒంటరిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం. 

ఇందులో మొదటి కేసు అసలు జరగని పని. అసలు బీజీపీకి ఆంధ్ర ప్రదేశులో ఓటు బ్యాంకెక్కడుంది? క్యాండిడేట్స్ ఎవరు? సోము వీర్రాజు నుంచి కింది స్థాయి బీజీపీ నాయకుడి వరకు ఎవ్వరికీ జనంలో ఫాలోయింగ్ లేదు. ఒక్క పవన్ కళ్యాణ్ ని చూసి మొత్తం రాష్ట్రం ఓట్లేసేయడానికి ఈయనగారేమన్నా 2014 నాటి నరేంద్ర మోదీ అనుకుంటున్నాడా? తనని తెదాపాతో కలవకుండా బీజేపీ ఆశ చూపి ఆడుకుంటోంది తప్ప తనని ముఖ్యమంత్రి చెయ్యడానికి కాదనే సత్యం ఈ మహానుభావుడికి తెలుస్తోందో లేదో? 

ఇక రెండవ కేసు సత్యదూరం. ఎందుకంటే బీజెపీ, తెదేపా అనేవి ఈ జన్మకి కలవవు. కనీసం మోదీ ఉన్నంతకాలం ఇది జరగని విషయం. పోనీ బీజేపీ లేకుండా జనసేనాని తెదేపాతో కలుద్దామనుకుంటే “బీజేపీ లేనిదే నువ్వొద్దు” అంటోంది తెదేపా. ఎందుకంటే బీజేపీతో కలిస్తే బలం చేకూరుతుంది కానీ పవన్ తో కలిస్తే కాదని తెదేపా నమ్మకం. అదన్నా ఈ మహానుభావుడికి వెలుగుతోందో లేదో. 

ఇక మూడవ కేసు హాస్యాస్పదం. పవన్, నాదెండ్ల మనోహర్, నాగబాబు తప్ప నాలుగో వ్యక్తి జనసేనలో ఎవరున్నారో కూడా ఎవ్వరికీ తెలీదు. అలా ఉంది మన జనసేనాని కేడర్ నిర్మాణం. నాలుగో వాడెవడో కూడా తెలియకుండా 175 స్థానాల్లో అభ్యర్థుల్ని ఎప్పుడు నిలబెట్టాలి? ధైర్యం చేసి వచ్చేదెవడు? సొంత ప్రభుత్వం మాట దేవుడెరుగు. అసలు పవన్ అయినా గెలిచి అసెంబ్లీకెళ్తాడా? ఇదే పెద్ద డౌట్. 

ఇవన్నీ ఒక ఎత్తైతే ఒక విషయంలో పవన్ కళ్యాణ్ అమాయకత్వానికి చిరాకేస్తుంది. రాజకీయాల్లో ఇంకా ఓనమాలు దిద్దని వాడికి కూడా “నువ్వేం నాయకుడవయ్యా” అని అనాలనిపిస్తుంది. 

నాయకుడికి కొన్ని ప్రాధమిక లక్షణాలుంటాయి. అందులో ముఖ్యంగా ఓపెన్ గా కులాల ప్రస్తావన తెచ్చి ఓట్లడగడం. 

కులాల లెక్కలు లేకుండా రాజకీయం నడవదన్నది తెలిసిన విషయమే. కానీ మరీ బహిరంగంగా- “కాపులు ఓటేస్తే జనసేన గెలిచేది” అనడం తెలివితక్కువతనం, కనీస రాజకీయ అవగాహన లేకపోవడం. 

అంటే ఈ వాక్యం విని కాపులంతా గిల్టీ ఫీలైపోతారనా?  ఈ సారి ఓటేసేస్తారనా? కాపులొక్కళ్లు వేసేస్తే గెలిచేస్తుందా జనసేన? గతా కులాలవాళ్లు వెయ్యక్కర్లేదా? 

ఆ మాటకొస్తే బలిజ, ఒంటరి, తెలగ వర్గాలు కాపులతో కలిసి నడిచినా కొంతలోకొంత అనుకోవచ్చు. ఆ ఐక్యతే కుదరడంలేదు. 

కాపులంతా ఒక తాటిమీదకి రావాలన్నా, పై వర్గాలతో ఐక్యత చేకూరాలన్నా పవన్ కల్యాణ్ ఒంటరి సింహంగా పోరాడాలి. 

ఇక్కడ సింగిల్ గా ఫైట్ చేసే వాడివైపే జనం మొగ్గుతున్నారు. పొత్తులకి కాలం చెల్లింది. జనం నమ్మట్లేదు. 

జగన్ మీద పవన్ వర్గానికి, చంద్రబాబు గ్రూపుకి తప్ప మిగిలిన వర్గాల్లో అంత ద్వేషభావం లేదు. వెల్ఫేర్ స్ఖీములు నడుస్తున్నంత కాలం ఈ సైకిలు, గ్లాసు స్కీములు ఎంత తెలివిగా వేసినా పనిచెయ్యవు. 

కనుక అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వెల్ఫేర్ స్కీములు నడపడానికి అప్పు పుట్టని, ఆదాయం రాని పరిస్థితి వచ్చే వరకు వేచి చూడడమే వీళ్లు చెయ్యాల్సిన పని. 

ఆ పరిస్థితి రాకుండా గట్టెక్కే ప్రయత్నాలు చేయడమే జగన్ మోహన్ రెడ్డి కర్తవ్యం.

అంతవరకూ అన్నీ యథాతథంగానే నడుస్తాయి తప్ప ఎవరు తల్లక్రిందులుగా తపస్సు చేసినా ఏమీ జరగదు. 

శ్రీనివాసమూర్తి