అదేదో సినిమాలో క్యారెక్టర్‌కు ఓ డౌట్ వస్తుంది. ఈడు పొగుడుతున్నాడా? తిడుతున్నాడా? అని. జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ వైఖరి అలాగే వుంది. చంద్రబాబుకు మంచి చేయబోతున్నారా? చెడు చేయబోతున్నారా? అనే అనుమానం వస్తోంది.
ఇవ్వాళ కాకుంటే రేపయినా జనసేన నేరుగా తెలుగుదేశంతోనే వెళ్లడం ఖాయం. అందులో అనుమానపడాల్సింది లేదు. అలా కాకపోతే మళ్లీ జనసేన ఇబ్బందిపడాల్సి వస్తుంది. అందువల్ల తెలుగుదేశంతో కలిసి వెళ్లడం పక్కా అన్నదే రాజకీయ వర్గాల బోగట్టా. అలా కాకుండా ఒక్కసారి ఒక్క రోజు తెలుగుదేశం పార్టీకి దూరం జరుగుతున్న ఫీల్ ఏ మాత్రం కలిగించినా చాలు. తెలుగుదేశం అనుకూల మీడియా, సోషల్ మీడియా ఎలా ప్లేట్ మారుస్తుందో, పవన్ ను ఏ విధంగా ఆడేసుకుంటుందో చూసేయచ్చు.
అందువల్ల పద్దెనిమిది సీట్లు అయినా, ముఫై సీట్లు అయినా తెలుగుదేశంతో కలిసి వెళ్లాల్సిందే. కానీ అలా వెళ్లేటపుడు పవన్ జాగ్రత్తగా మాట్లాడాలి కదా. వాలంటీర్లను తెలివిగా జనాలకు దూరం చేస్తున్నాను, వాలంటీర్ల ప్రభావం నుంచి ఓటర్లను దూరం చేస్తున్నాను అని అనుకుంటూ వాళ్ల మీద బురద వేస్తున్నారు. కానీ రేపు ఎన్నికల్లో వాలంటీర్ల ఓట్లు ఈయనకు కానీ ఈయన మిత్రుడు చంద్రబాబుకు కూడా అక్కరలేదా.
వాలంటీర్లు ఇప్పుడు అభద్రతా భావానికి గురికారా? పవన్.. ఆయన మిత్రుడు చంద్రబాబు పవర్ లోకి వస్తే పరిస్థితి ఎలా వుంటుందో? వాలంటీర్ వ్యవస్థ పట్ల చంద్రబాబు మొదటి నుంచీ వ్యతిరేకంగా వుంటూనే వస్తున్నారు. ఇప్పుడు పవన్ కూడా అదే బాట పట్టారు.
ఇప్పటికే రెడ్డి సామాజిక వర్గాన్ని బలంగా, అదే పనిగా దుయ్యబడుతూ వాళ్లను తెలుగుదేశం అలయన్స్ కు దూరం చేస్తున్నారు పవన్. ఇప్పుడు వాలంటీర్ల వంతు వచ్చింది. ఇలా ఒక్కొక్కరిని దూరం చేసి, అప్పుడు తాను దగ్గరవుతారేమో తెలుగుదేశం పార్టీకి పవన్? వ్యవహారం చూస్తుంటే అలాగే వుంది.
అందుకే అన్నారేమో పెద్దలు వెనకటికి… మూర్ఖుడైన మిత్రుడి కన్నా, తెలివైన శతృువు బెటర్ అని.