జనసేనాని పవన్‌కల్యాణ్ నోటి దురుసు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు రాజకీయంగా భారీ ప్రయోజనం కలిగించింది. వాలంటీర్లపై పవన్‌కల్యాణ్ ఇష్టమొచ్చినట్టు తిట్టడం ద్వారా అనవసరంగా ఆయన కొత్త శత్రువుల్ని తయారు చేసుకున్నట్టైంది. అది కూడా బలమైన సైన్యాన్ని కేవలం నోటి దురుసుతో వ్యతిరేకంగా తయారు చేసుకున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వాలంటీర్లపై పవన్ తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు జగన్‌కు వరంగా మారాయి.
ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు 2.50 లక్షల మంది వాలంటీర్లు రాత్రికి రాత్రే జనసేనకు బద్ధ శత్రువులుగా మారారు. వాలంటీర్లుగా పెద్ద సంఖ్యలో మహిళలున్నారనే కనీస స్పృహ కూడా పవన్‌లో లేకపోయింది. వాలంటీర్లను బ్రోకర్లగా చిత్రీకరించడంతో రాష్ట్ర వ్యాప్తంగా వాళ్లంతా రగిలిపోతున్నారు. పవన్ దిష్టిబొమ్మల్ని దహనం చేస్తున్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. రాజకీయ నాయకులు కంట్రోల్ తప్పి, నోటికొచ్చినట్టు మాట్లాడితే వచ్చే దుష్ప్రరిణామాలు ఇలాగే వుంటాయి.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై పవన్ ద్వేషం ఎంత తీవ్రస్థాయిలో వుందంటే… గ్రామాలకే పరిపాలనను తీసుకొచ్చిన సచివాలయ వ్యవస్థ, దానికి అనుబంధంగా పని చేసే వాలంటీర్లను దూషించేంతగా అంటే ఆశ్చర్యపోనవసరం లేదు. జగన్‌పై వ్యక్తిగత ద్వేషంతో ఆయన తీసుకొచ్చిన వాలంటీర్లను కూడా నీచంగా మాట్లాడ్డంతో సమస్య ఉత్పన్నమైంది. నిజానికి సచివాలయ వ్యవస్థ జగన్ చేసిన పని. వాలంటీర్లు స్వయంగా ఇళ్లకు వచ్చి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి పనులు చేస్తున్నారు. అలాగే పింఛన్లను ప్రతినెలా ఒకటో తేదీనే ఇంటికెళ్లి పంపిణీ చేస్తున్నారు.
ప్రభుత్వ పథకాలు, ఇతరత్రా అంశాలకు సంబంధించిన సమాచారాన్ని ప్రజలకు చేరవేయడంలో వాలంటీర్ల పాత్ర ప్రశంసనీయమైంది. అలాంటి వాలంటీర్లపై అవాకులు చెవాకులు పేలి ఒక పెద్ద సమూహాన్ని శత్రువుగా తయారు చేసుకోవడం పవన్‌కే చెల్లింది. ఇకపై జనసేనతో పాటు ఆ పార్టీతో అంటకాగే టీడీపీకి వ్యతిరేకంగా వాలంటీర్లు పట్టుదలతో పని చేసే అవకాశం వుంది. ఇది రాజకీయంగా జగన్ నెత్తిపై పాలు పోసినట్టే. వాలంటీర్లు ప్రతి నెలా కేవలం రూ.5 వేలు మాత్రమే ప్రభుత్వం నుంచి తీసుకుంటున్నారు.
కానీ ఎన్నికల ముంగిట వారు చేసే పని చాలా కీలకంగా మారనుంది. పవన్ వివాదాస్పద, అభ్యంతరకర వ్యాఖ్యలతో ఇకమీదట వాలంటీర్ల పనితీరు వేరుగా వుంటుంది. అది జగన్‌కు రాజకీయంగా ప్రయోజనకారిగా మారనుంది. ఇదే జగన్‌కు పవన్ చేసిన అతిపెద్ద సాయంగా పలువురు అభిప్రాయపడుతున్నారు.