చంద్రబాబునాయుడు చాలా బిజీ అయ్యారు. ఇటు మ్యానిఫెస్టో తయారీ, అటు అభ్యర్థుల ఎంపికపై ఆయన తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. వివిధ రంగాల నిపుణులతో ఆయన భేటీ అవుతున్నారు.
మ్యానిఫెస్టోలో ప్రజాకర్షక పథకాలు ఏవైతే బాగుంటుందనే అంశంపై గంటల తరబడి భేటీ అవుతున్నట్టు పార్టీ వర్గాల ద్వారా సమాచారం. ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏఏ రంగాల్లో ప్రజలపై భారం వేసిందనే కోణంలో ఆయన వివరాలు తెప్పించుకుని, వాటిని ఎలా తగ్గించవచ్చో కసరత్తు చేస్తున్నారు.
ఉదాహరణకు భూముల రిజిస్ట్రేషను వైసీపీ ప్రభుత్వం భారీగా పెంచడంతో వ్యతిరేకత వస్తోంది. ఇలాంటివి ఎంత వరకు తగ్గించవచ్చో చంద్రబాబు ఆర్థిక నిపుణులతో చర్చించినట్టు తెలిసింది. అలాగే ప్రజలపై వివిధ రకాల పన్నుల రద్దు లేదా తగ్గింపుపై ఏం చేయవచ్చో చర్చిస్తున్నారని తెలిసింది. దసరాకు ఎట్టి పరిస్థితుల్లోనూ సంపూర్ణ మ్యానిఫెస్టో విడుదల చేయాలని చంద్రబాబు పట్టుదలతో ఉన్నారు.
ఇక అభ్యర్థుల ఎంపికపై కూడా ఆయన దృష్టి సారించారు. ఇప్పటికే ఐదారు సంస్థలతో రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు సర్వే చేయించారు. రాబిన్‌శర్మ టీమ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పరిస్థితుల గురించి చంద్రబాబుకు నివేదిస్తోంది. అలాగే టీడీపీ ఆశావహులపై కూడా రాబిన్‌శర్మ టీమ్‌తో పాటు ఇతర సర్వే సంస్థల నుంచి తెప్పించుకున్న నివేదికలను ముందుంచుకుని, ఎవరైతే గెలిచే అవకాశం వుంటుందో చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు.
రోజూ లేదా రెండు రోజులకో మారు ఐదారు నియోజకవర్గాల నుంచి టీడీపీ నాయకులను పిలిపించుకుని చర్చిస్తున్నారు. పోటీ ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో అందర్నీ సమన్వయపరిచి, అభ్యర్థి ఎంపికపై వివాదం తలెత్తకుండా కొంత మంది నాయకులకు బాధ్యతలు అప్పగిస్తున్నారు.
సమస్య లేని చోట కొందరికి టికెట్‌పై క్లారిటీ ఇస్తున్నారు. ప్రజలతో మమేకం కావాలని, గెలుచుకుని రావాలని ఆశీర్వదించి పంపుతున్నారని పార్టీ వర్గాల ద్వారా సమాచారం.