పవన్ ఉత్తరాంధ్ర టూర్ వుంటుందా?

తూర్పు, పశ్చిమ జిల్లాల్లో టూర్ విజయవంతంగా ముగించుకున్నారు జనసేన అధిపతి పవన్ కళ్యాణ్. తరువాత ఏంటీ అంటే పార్టీ వర్గాల్లో వినిపించింది ఉత్తరాంధ్ర టూర్ అని. అయితే ఇప్పుడు వెంటనే ఆ టూర్ వుంటుందా?…

తూర్పు, పశ్చిమ జిల్లాల్లో టూర్ విజయవంతంగా ముగించుకున్నారు జనసేన అధిపతి పవన్ కళ్యాణ్. తరువాత ఏంటీ అంటే పార్టీ వర్గాల్లో వినిపించింది ఉత్తరాంధ్ర టూర్ అని. అయితే ఇప్పుడు వెంటనే ఆ టూర్ వుంటుందా? అన్నది అనుమానం. ఎందుకంటే ఒకటి కాదు చాలా కారణాలు వున్నాయి. కీలకంగా ఇప్పుడు వర్షాకాలం, రైతులకు, రైతు కూలీలకు పంటల సీజన్. అందువల్ల జనాలు రావడం అన్నది ఓ సమస్య. వర్షం ఎప్పుడు పడుతుందో తెలియదు. రెండవది ఓజి సినిమా వర్క్. ఇప్పటి నుంచి ఈ నెలాఖరు వరకు విశ్రాంతి ప్లస్ బ్రో సినిమా పనుల మీద వుంటారు.

ఇక రెండో కారణం ఏమిటంటే జగన్ ఎన్నిసార్లు ఎంత కాదని చెప్పినా, ముందస్తు ఎన్నికలు వస్తాయనే నమ్మారు పవన్ . చంద్రబాబు పార్టీ కేడర్ కోసం ముందస్తు జపం చేస్తూ వస్తుంటే అదే నిజమనుకున్నారు. కానీ ఇప్పుడు ఢిల్లీ వెళ్లి వచ్చాక పవన్ కు క్లారిటీ వచ్చింది. డిసెంబర్ లో ఎన్నికలు లేకుంటే ఇప్పటి నుంచి తిరగడం వల్ల మైనస్ తప్ప ప్లస్ కాదు. ఎందుకంటే ఎక్కడ మాట్లాడినా పవన్ స్పీచ్ ల్లో కంటెంట్ కొత్తగా వుండదు.

రెడ్లను తిట్టడం, వాలంటీర్లను అనుమానించడం, ఇలా కొన్ని పాయింట్లే తప్ప మరోటి కాదు. పొత్తుల గురించి ఇప్పుడు వద్దంటారు. సిఎమ్ కేడిండేట్ అవునా కాదా అన్నది చెప్పరు. ఇప్పుడే ఇవన్నీ మాట్లాడితే ఎన్నికల ముందు ఏం మాట్లాడాలి. అందువల్ల పర్యటనలకు మళ్లీ పాజ్ ఇవ్వడం తప్ప మరో మార్గం లేదు.

ఇదిలా వుంటే పవన్ రెండు జిల్లాల్లో పర్యటిస్తేనే, జన సైనికులు తమ నాయకుడు సిఎమ్ అని ఫిక్స్ అయిపోయారు. రేపు పాతిక లేదా ముఫై సీట్లు తీసుకుని తేదేపాకు మద్దతు ఇద్దాం అంటే సీన్ మొత్తం రివర్స్ అయిపోతుంది. అందువల్ల ఆచి తూచి వ్యవహరించాల్సి వుంటుంది. ఎందుకంటే తేదేపాతో కలిసి వెళ్లాలన్నది పవన్ ఏనాడో ఫిక్స్ అయిపోయినట్లే. ఇప్పుడు జిల్లాలు తిరుగుతున్న కొద్దీ పవన్ పట్ల అభిమానుల ఆశలు పెరుగుతూ వుంటాయి. అప్పుడు కనీసం యాభై సీట్లకు తక్కువ పొత్తు పెట్టుకుంటే కష్టం అవుతుంది.

ఇవన్నీ వుంటే పవన్ టూర్లు తేదేపా ప్లాన్ ప్రకారం వుంటాయినే టాక్ ఒకటి వుంది. అందుకే లోకేష్ తిరిగే ప్రాంతాలు, కృష్ణ, గుంటూరు కాకుండా ఈస్ట్ వెస్ట్, ఉత్తరాంధ్ర ఎంచుకున్నారు. కానీ దీనివల్ల లోకేష టూర్ కు జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. అస్సలు జనాలకు ఆ యాత్ర పట్టకుండా పోయింది. ఇప్పుడు పవన్ కనుక తన యాత్ర కొనసాగిస్తే, లోకేష్ యాత్ర ఇంకా మైనస్ లోకి వెళ్లిపోతుంది. అందువల్ల పవన్ ప్లాన్ ను తేదేపా మారుస్తుందనే అనుకోవాలి.

ఇవన్నీ ఇలా వుంచితే అక్టోబర్ నుంచి ఉస్తాద్ షూటింగ్ చేయాలని పవన్ భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే డిసెంబర్ నాటికి విడుదల చేయాల్సిన ఓజి సినిమా పనులు బకాయి వుండనే వున్నాయి. అందువల్ల ఉత్తరాంధ్ర టూర్ ఇప్పట్లో వుండకపోవచ్చు.