ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఒక విషయంలో వైసీపీ నేతలు, కార్యకర్తలను నిరాశ పరుస్తున్నారు. ప్రత్యర్థులపై విమర్శలు చేసే సందర్భంలోనూ పేపర్ చూస్తూ చదువుతుండడం అభిమానులకి సైతం నచ్చడం లేదు. గతంలో జగన్ ప్రసంగంలో అప్పుడప్పుడు మాత్రమే సమాచారం కోసం పేపర్ చూసుకునేవారు. అదేంటో గానీ, ఇటీవల కాలంలో ప్రతి బహిరంగ సభలోనూ ఆయన చదువుతుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
బహిరంగ సభల్లో తమపై విమర్శలను కూడా చూసి చదువుతున్న సీఎం జగన్‌పై విపక్షాలు వెటకరిస్తున్నాయి. వైఎస్ జగన్ లీడర్ కాదని, రీడర్ అని ప్రతిపక్షాల నేతలు దెప్పి పొడుస్తున్నారు. రోజూ తమపై అవాకులు చెవాకులు పేలే ముఖ్యమంత్రి… చూడకుండా విమర్శలు కూడా చేయలేరా? అని ప్రశ్నిస్తున్నారు. ఇవాళ తిరుపతి జిల్లా వెంకటగిరి సభలో ప్రతిపక్షాల నేతలు, ఎల్లో మీడియాపై చెలరేగిపోయారు.
ఈ సందర్భంగా జగన్ పేపర్ చూస్తూ చదవడం అభిమానులకి నిరాశ కలిగించిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జగన్‌లో వచ్చిన మార్పును వైసీపీ కేడర్ కూడా గమనిస్తోంది. మన సేవా మిత్రులు, సేవా వజ్రాలు అయిన మన వలంటీర్ల క్యారెక్టర్‌ను తప్పు పట్టిందెవరో తెలుసా? అని చదువుతూ కనిపిస్తారు. అంతేకాదు, విమర్శలను కూడా చదువుతూ కొనసాగించడంపై వైసీపీ అభిమానులకు నచ్చడం లేదు. మరోవైపు జగన్ ప్రతిదీ చదువుతూ ప్రసంగించడం ఏంటని నిలదీస్తున్నారు.
ప్రతిపక్షాల నేతలు చంద్రబాబునాయుడు, పవన్‌కల్యాణ్ కేవలం సమాచారం కోసమే పేపర్లు చూసుకుంటారని ఆ పార్టీల నాయకులు గుర్తు చేస్తున్నారు. జగన్ నేరుగా జనం కళ్లలో కళ్లు పెట్టి మాట్లాడకపోవడాన్ని తప్పు పడుతున్నారు. ఇటీవల వారాహి యాత్రను వరాహి అని జగన్ పలకడంపై పవన్ తప్పు పట్టారు. సీఎం జగన్‌కు తెలుగు నేర్పిస్తానని చీవాట్లు పెట్టిన సంగతి తెలిసిందే. కాస్త పేపర్లు చూసి చదవడం తగ్గిస్తే జగన్‌కే మంచిది.