జెండా అని పేరు పెట్టుకుని రెండు జెండాలు కలిసి నిర్వహించిన సభలో జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ ప్రసంగం ఎలా వుంది అని అడిగితే మూడు ముక్కల్లో చెప్పవచ్చు.
జగన్ మీద ఆక్రోశం… తనకు తగిన బలం లేదని ఆవేదన.. ప్రశ్నించేందుకు పార్టీ పెట్టిన తననే ప్రశ్నిస్తున్న జనసేన తమ్ముళ్లపై ఆగ్రహం. అంతకు మించి మరేమీ లేదు.
ఎన్నికల ముందు రెండు కీలక రాజకీయ పార్టీలు కలిసి నిర్వహించిన సభ లో కీలక నేతల ప్రసంగం అంటే ఎలా వుండాలి. కనస్ట్రక్టివ్ గా వుండాలి. పాలన ఎలా వుందో వివరించి విమర్శించాలి. తమ పాలన వస్తే ఎలా వుంటుందో వివరించాలి. అది తప్ప అన్నీ వున్నాయి పవన్ ప్రసంగంలో. జగన్ మీద ఆక్రోశం అడుగు అడుగునా కనిపించింది. ఎందుకు జగన్ మీద అంత కోపం అంటే సమాధానం వుండదు. కోపం అంతే. జగన్ ను ఎడాపెడా తిట్టడం, పాతాళానికి తొక్కేస్తా అని చెప్పడం, అరుపులు కేవలు పక్కా థర్డ్ గ్రేడ్ స్పీచ్ అనాల్సిందే పవన్ కళ్యాణ్ స్పీచ్ ను.
వేదిక మీద ముఫై మంది బాడీ గార్డులను పెట్టుకుని జగన్ కు యుద్దం ఇస్తా అని అనడం పవన్ కే చెల్లింది. పవన్ స్పీచ్ లో కొత్త పాయింట్ ఒక్కటి చెప్పమని అడిగితే ఏ జనసైనికుడైనా తెల్లమొహం వేయాల్సిందే. ప్రసంగం ఆద్యంతం జగన్ మీద ద్వేషం.. ఆక్రోశం.. అది తప్ప మరేమైనా వుందా అంటే వుంది.
తనకు బలం లేదనే ఆవేదన వుంది. జనసమీకరణ చేయలేను. వాళ్లకు ఇంత బువ్వ పెట్టి తన వెంట తిప్పుకోలేను. నియోజకవర్గాల స్థాయిలో తమకు కేడర్ లేదు. కేడర్ ను పోషించే నాయకులు లేరు. పోల్ మేనేజ్ మెంట్ రాదు. అనే ఆవేదన వుంది. ఈ ఆవేదన సాకుగా తెలుగుదేశం పార్టీకి తోకపార్టీగా మారిపోయామని చెప్పలేక, ఏవో సాకులు వెదుక్కోవడం వుంది.
ఇంకా ఏం వుంది అంటే ఆగ్రహం వుంది. ప్రశ్నించడానికి పార్టీ పెట్టిన తననే ప్రశ్నిస్తారా? అనే ఆగ్రహం వుంది. విదేశాల్లో కూర్చుని సోషల్ మీడియాలో తనను ప్రశ్నించే జనసైనికులు తన వారు కాదు అని ఆగ్రహం వ్యక్తం చేసారు. తను ఎలా చేస్తే అలా తల ఊపుతూ తన వెంట నడిచే వారే తనవాళ్లు అని క్లారిటీ ఇచ్చారు.
టోటల్ గా పవన్ ప్రసంగం జనసైనికులను కాస్సేపు ఉర్రూతలూగించవచ్చు.
తనకు భలే దొరికాడు అని చంద్రబాబు ఆనందపడవచ్చు
కానీ ప్రతి సారీ ఇదే సొద, ఇదే రోద అనుకునేవాళ్లు కూడా వుంటారు. అసలు పవన్ కు వున్న అజెండా ఏమిటో చెప్పలేదు. కేవలం జగన్ ను గద్దె దింపడం మాత్రమే తన అజెండా అని చెప్పేస్తే ఓ పనైపోతుంది కతా అని నిట్టూర్చేవారు ఎక్కువ మంది వుంటారు.
టోటల్ సభ మొత్తాన్ని ఒక్క మాటలో చెప్పాలంటే
జగన్ ను గద్దె దింపేదుకు, జగన్ తో పోరాడేందుకు, జగన్ ను తట్టుకునేందుకు ఏకమైన రాజకీయ మూకల సభ.
కొసమెరుపు.. భాజపా ఊసేదీ?