2014 లోక్ సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ దేశ వ్యాప్తంగా సంచలన విజయం సాధించి, అధికారాన్ని పొందింది. 2019 ఎన్నికల్లో కూడా కమలం పార్టీ అంతకు మించిన విజయాన్ని సాధించి అధికారాన్ని పొందింది. అయితే గత పదేళ్లతో పోలిస్తే బీజేపీ వచ్చే ఎన్నికల విషయంలో మరింత కాన్ఫిడెంట్ గా ఉంది. అయోధ్యలో బాలరాముడి ప్రతిష్ట అనంతరం కమలం పార్టీ భారీ టార్గెట్ ను పెట్టుకున్నట్టుగా ఉంది. 370 అని, కాదు 400 అని కమలం పార్టీ మద్దతుదార్లు మాట్లాడుతున్నారు.
ఆ సంగతలా ఉంటే.. ఇప్పుడు బీజేపీ తీరులో కనిపిస్తున్న పెద్ద మార్పు.. కాంగ్రెస్ నుంచి వచ్చే నేతలను చేర్చేసుకోవడానికి చాలా ఉత్సాహం చూపిస్తూ ఉండటం! అంటే గత పదేళ్లలో కాంగ్రెస్ నేతలను బీజేపీ చేర్చుకోలేదని కాదు, కొన్ని రాష్ట్రాల్లో అయితే కాంగ్రెస్ ను చీల్చి చెండాడి.. బీజేపీ అధికారం పొందింది. మధ్యప్రదేశ్, కర్ణాటక, గోవాతో సహా అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ ను చీల్చడం ద్వారానే బీజేపీ అధికారాన్ని చేపట్టింది. దశాబ్దాలుగా కాంగ్రెస్ లో పని చేసిన వారిని, తండ్రులు కాంగ్రెస్ నేతలుగా ఉండటంతో ఆ పార్టీలో ఎదిగిన వారిని చేర్చుకుని బీజేపీ ఇప్పుడు వారికి కేంద్రమంత్రి పదవులు, పెద్ద పెద్ద కిరీటాలు పెడుతోంది!
తాము వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకం, కాంగ్రెస్ వాసనే పడదు, బీజేపీలో ఎదగడం అంటే.. ఆర్ఎస్ఎస్ పునాదుల నుంచి వచ్చుండాలనే నిర్వచనాలు ఇప్పుడు కమలం పార్టీలో అర్థం లేదు! బీజేపీ తరఫున రాజ్యసభ సభ్యులుగానో, మరో హోదాలకో ఎన్నికైన వారి చరిత్రను చూస్తే.. సంఘ్ పరివార్ లో పని చేసి వచ్చిన నేపథ్యం గతంలో ఉండేది! అయితే.. ఇప్పుడు మొన్ననే కాంగ్రెస్ నుంచి వచ్చాడు, రేపోమాపో మరి కొందరు కాంగ్రెస్ నేతలు వస్తారు.. బీజేపీని బలోపేతం చేస్తారు అనే మాటలు వినిపిస్తున్నాయి!
మహారాష్ట్ర వంటి చోట అయితే ఇది మరింత తీవ్రం అయ్యింది! తాము దశాబ్దం కిందట తీవ్ర అవినీతి ఆరోపణలు చేసిన అశోక్ చవాన్ ను చేర్చుకుని రాత్రికి రాత్రి రాజ్యసభకు నామినేట్ చేశారు! ఇప్పుడెవరో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ను చేర్చుకుంటోందట కమలం పార్టీ! యూపీలో సమాజ్ వాదీ పార్టీ నుంచి వచ్చే వారికి కమలం పార్టీ రెడ్ కార్పెట్ లు వేస్తోంది! ఇక నితీష్ కుమార్ విషయంలో ఆయనకే కాదు, బీజేపీకి కూడా నైతికత లేనట్టే!
గత పదేళ్లలో అవసరార్థం కాంగ్రెస్ ను చీల్చి వారికి కాషాయ తీర్థం పోసిన కమలం పార్టీ, ఇప్పుడు ఎవరినైతే తాము తీవ్రంగా విమర్శించామో వారినే చేర్చుకుని తనను తాను ఉత్సాహపరుచుకుంటోంది! కాంగ్రెస్ ముక్త్ భారత్ అంటే, కాంగ్రెస్ లో ఉన్న వారికి అధికారం ఎర చూపి చేర్చేసుకోవడమా!