జగన్‌ను విశాఖ ఎందుకు నమ్మాలి?

గడ్డి మోపు కర్రకు కట్టి, ఎద్దును నడిపించిన వైనం గుర్తుందా? అదిగో రాజధాని అంటూ ఉత్తరాంధ్రను జగన్ అలాగే ఊరిస్తున్నారు. దీని వల్ల ఏ ప్రయోజనం. విశాఖ రాజధాని అని ప్రకటించడం తప్ప దానికి…

గడ్డి మోపు కర్రకు కట్టి, ఎద్దును నడిపించిన వైనం గుర్తుందా? అదిగో రాజధాని అంటూ ఉత్తరాంధ్రను జగన్ అలాగే ఊరిస్తున్నారు. దీని వల్ల ఏ ప్రయోజనం. విశాఖ రాజధాని అని ప్రకటించడం తప్ప దానికి సంబంధించి జగన్ గత నాలుగేళ్లలో ఏం చేసారు.? విశాఖ కు కానీ విశాఖ జిల్లాకు కానీ చెందిన వారికి కానీ ఓ నమ్మకం లేదా ఓ ఆనందం కలగాలి కదా? విశాఖలో కనీసం క్యాంప్ ఆఫీసు పెట్టలేకపోయారు. క్యాంప్ కార్యాలయం లేదు. నెలకు ఒకసారి అయినా ఓ వారం రోజులు కాదు కనీసం రెండు రోజులు కుదురుగా వుండలేకపోయారు.

జిల్లాలు బైఫరికేషన్ అన్నారు. విశాఖ జిల్లాలో వున్న అనకాపల్లిని సెపరేట్ చేసారు. అలా అని అక్కడా ఏమీ చేయలేదు. ఓ కలెక్టర్ కార్యాలయం కట్టలేకపోయారు. మెడికల్ కాలేజీ అంటూ సామూహిక శంకుస్థాపన చేసారు. కానీ కనీసం ఓ ఇటుక కూడా వేయలేదు. దశలవారీ ప్రయారిటీకి ఆ కాలేజీ నోచుకోలేదు. ఇంకెలా నమ్మకం పెట్టుకోవాలి జగన్ మీద?

చంద్రబాబు ఏమంటున్నారు.. ఉత్తరాంధ్ర వారికి కూడా అమరావతే కావాలి. వాళ్లూ అదే కోరుకుంటున్నారు అనే కదా. ఎందుకు కోరుకోరు. జగన్ కనుక నెలకు ఓ వారం అయినా విశాఖ లో కూర్చుని పాలనా వ్యవహారాలు సాగిస్తే కదా, ఉత్తరాంధ్ర వాసులకు రాజధానికి ఇక్కడ వుంటే కలిగే సౌలభ్యం తెలుస్తుంది.

ఏమన్నా అంటే కోర్టులు అడ్డంకులు అంటారు. వివాదాలు వచ్చే చోట ఎందుకు కట్టాలి. సిటీకి నడిబొడ్డున ఉడాకు అంత స్థలం వుంది. అక్కడ ఏడాదిలో ఓ భవంతి లేపలేరా? తెలంగాణ అంత పెద్ద సచివాలయం ఎంత త్వరగా కట్టారు. జగన్ ఎందుకు నాలుగేళ్లలో పట్టుమని ఓ అయిదు అంతస్తుల భవనం కట్టలేకపోయారు. 

ఎంత సేపూ తన ఇష్టాలు.. తన కోరికలు, తనకు నచ్చిన స్థలంలో సెక్రటెరియట్ కట్టడం, స్వంత ఇల్లు వుంటేనే నైట్ హాల్డ్ చేయడం కాదు. మళ్లీ గెలవాలంటే ముందుగా ఉత్తరాంధ్ర వాసుల మనసులు గెలవాలి అని అనుకోవడం లేదు.

విశాఖ అన్నది తెలుగుదేశం పార్టీ కన్నా, దాని పునాదుల్లో దాగిన దాని మద్దతు సామాజికవర్గానికి చాలా కీలకం. దాదాపు నాలుగు దశ్దాబాలుగా విశాఖను తమ అడ్డాగా చేసుకుంది ఆ సామాజిక వర్గం. వైకాపా వచ్చిన తరువాత విజయసాయి రెడ్డి ధాటికి తట్టుకోలేక నానా పన్నాగాలు పన్నింది. 

అక్కడ కూడా జగన్ తప్పే చేసారు. ఆ పన్నాగాలు నమ్మి, విజయసాయిని విశాఖ నుంచి పంపించి సుబ్బారెడ్డిని తెచ్చారు. దాంతో మళ్లీ ఆ సామాజిక వర్గం జడలు విప్పింది. ఇప్పుడు విశాఖలో పరిస్థితి చూస్తుంటే వైకాపా ఒక్క ఎమ్మెల్యే స్థానం అయినా గెలుచుకుంటుందా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఎందుకంటే ఆ వర్గానికి వున్న కట్టు, ఆర్థిక అండదండలు, వ్యాపారాలు అలాంటివి.

ఇవన్నీ తెలిసి కూడా జగన్ విశాఖ మీద పూర్తి దృష్టి పెట్టకుండా పరమ బద్దకంగా వ్యవహరిస్తున్నారు అని అంటే అది అతిశయోక్తి కాదు.