తెలుగుదేశం మహిళా నేతలపై “గ్రేట్ ఆంధ్ర” పేరుతో కొందరు దుష్ప్రచారాని బరి తెగించారు. వ్యక్తులు, పార్టీల కంటే నిజాలే “గ్రేట్ ఆంధ్ర” కు ప్రాతిపదిక. వాస్తవాల పునాదులపై అంచెలంచెలుగా “గ్రేట్ ఆంధ్ర” వెబ్ మీడియా ఎదిగింది. రాజకీయ, సినీ, సామాజిక, చారిత్రిక, సాహిత్య, సాంస్కృతిక తదితర రంగాలకు సంబంధించిన వార్తలను ఎప్పటికప్పుడు పాఠకలోకానికి “గ్రేట్ ఆంధ్ర” అందిస్తోంది.
గత కొన్నేళ్లుగా గ్రేట్ ఆంధ్ర సాధించుకున్న విశ్వసనీయతను కొందరు రాజకీయ స్వార్థానికి వాడుకునేందుకు బరి తెగించారు. ఈ నేపథ్యంలో “టీడీపీలో వ్యభిచార లంకలు” శీర్షికతో తెలుగుదేశం మహిళా నాయకురాళ్లు వంగలపూడి అనిత, కావలి గ్రీష్మ, బొల్లినేని జ్యో శ్రీ చౌదరి, సంగ తేజశ్వని, స్వాతిరెడ్డి అలియాస్ స్వాతి చౌదరి, ఉండవల్లి అనూష వ్యక్తిగత జీవితాలపై తీవ్ర అభ్యంతరకర, సభ్య సమాజం ఛీత్కరించేలా “గ్రేట్ ఆంధ్ర” పేరుతో ప్రత్యేక కథనాన్ని డిజైన్ చేసి, సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేపట్టారు.
రాజకీయ స్వార్థం కోసం అక్షర వ్యభిచారానికి పాల్పడే ఇలా ధోరణులను గ్రేట్ ఆంధ్ర అన్ని వేళలా వ్యతిరేకిస్తోంది. అలాంటిది గ్రేట్ ఆంధ్ర పేరుతో ఏకంగా తెలుగుదేశం మహిళా నాయకులపై ఫేక్ కథనాన్ని సృష్టించి, ప్రచారం చేయడం రాజకీయాల్లో దిగజారుడు తనానికి నిదర్శనంగా చెప్పొచ్చు. ఈ అవాంఛనీయ ధోరణులకు గ్రేట్ ఆంధ్రను వాడుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.
అలాగే తెలుగుదేశం మహిళా నాయకురాళ్ల వ్యక్తిగత జీవితాలను బద్నాం చేయడాన్ని వ్యతిరేకించడంతో పాటు అందుకు గ్రేట్ ఆంధ్ర విశ్వసనీయతను వాడుకోడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ ఫేక్ ప్రచారంపై చట్టపరమైన చర్యలకు ఉపక్రమిస్తున్నామని హెచ్చరిస్తున్నాం.