‘‘ఏపీలో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్లీ అధికారంలోకి వస్తే.. రాష్ట్రంలోని ప్రజలందరూ రాష్ట్రం వదలిపోవాలని అనుకుంటున్నారట. ఈ రాష్ట్రంలో ఇక ఉండలేం.. అని అందరూ అంటున్నారట.’’ ఈ విషయాన్ని జనసేనాని పవన్ కల్యాణ్ వెల్లడించారు. అలా జగన్ మళ్లీ సీఎం అయితే రాష్ట్రం వదలి వెళ్లిపోవాలని అనుకుంటున్న వాళ్లంతా పవన్ కల్యాణ్ కు తమ మనోగతాన్ని చెవిలో చెబుతున్నారో ఏమో తెలియదు మరి! ఆయన మాత్రం రాష్ట్రప్రజలందరి తరఫున వకాలత్తు పుచ్చుకుని.. జగన్ గెలిస్తే జనం వెళ్లిపోతారని సిద్ధాంతీకరించేస్తున్నారు.
ఇప్పటిదాకా బాహాటంగా.. విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఇక్కడ వ్యాపారం చేయలేకపోతున్నామని, హైదరాబాదు వెళ్లిపోయి అక్కడ వ్యాపారం చేసుకోవాలని ఉన్నదని చెప్పిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇలాంటి ఎంపీ మాటలను పట్టుకుని జగన్ ప్రభుత్వాన్ని నిందించాలని, ఇరుకున పెట్టాలని పవన్ కల్యాణ్ భావిస్తున్నారేమో తెలియదు.
అదే సమయంలో.. తన విశాఖ వారాహి యాత్రలో భాగంగా.. ఎంపీ సత్యనారాయణ విశాఖపట్టణంలో విపరీతంగా భూకబ్జాలకు పాల్పడుతున్నారని, చర్చి భూములను కూడా స్వాహా చేస్తున్నారని స్వయంగా పవన్ కల్యాణే ఆరోపించారు. అంటే విశాఖ ఎంపీ చేస్తున్న వ్యాపారం మొత్తం అక్రమాల మయం అని పవన్ స్వయంగా చెబుతున్నారు.
అలాంటి అక్రమాలు నిండిన వ్యాపారం చేసే వ్యక్తి.. ‘తాను ఇక్కడ వ్యాపారం చేసుకోలేకపోతున్నాను.. హైదరాబాదు వెళ్లిపోయి అక్కడ చేసుకుంటాను’ అంటున్నాడంటే దాని అర్థం ఏమిటి? సొంత పార్టీ ఎంపీ అయినప్పటికీ కూడా.. వారి అక్రమ దందాలను జగన్ సర్కారు సాగనివ్వడం లేదు.. అనే కదా! మరి అలా అక్రమార్కులను కట్టడి చేస్తున్నందుకు జగన్ సర్కారును అభినందించాల్సిందిపోయి.. ఇలా ఏడవడం ఎందుకు? అనేది ప్రజలకు కలుగుతున్న సందేహం.
సాధారణంగా.. పెద్దలు ఒక మాట అంటూ ఉంటారు. కృష్ణ శాస్త్రి బాధ.. ప్రపంచానికి బాధ! ప్రపంచం బాధ మొత్తం శ్రీశ్రీ బాధ! అని!! ఆ తరహాలో పవన్ కల్యాణ్ తన బాధను రాష్ట్రం మొత్తానికి పులమాలని అనుకుంటున్నట్టుగా ఉంది.
పార్టీ పెట్టి పదేళ్లు అయినప్పటికీ.. ఏపీలో ఇటీవల కొద్ది కాలం కిందటే కాపురం ప్రారంభించారు పవన్ కల్యాణ్. అలాగని ఆయన హైదరాబాదు కాపురాన్ని ఖాళీ చేయలేదు. అక్కడా ఇక్కడ రెండు కాపురాల మీద ప్రయాణం సాగిస్తున్నారు. ‘నేను ఏపీలోనే నివసిస్తున్నా’ అని ఎన్నికల వేళ చెప్పుకోడానికి ఈ విజయవాడ కాపురం డ్రామా నడిపిస్తున్నారు.
జగన్ మళ్లీ గెలిస్తే గనుక.. ఖచ్చితంగా పవన్ రాష్ట్రం విడిచి పారిపోవాల్సిందే. జీవితంలో ఇక ఎన్నటికీ తన పార్టీకి పుట్టగతులు ఉండవని ఆయనకు అర్థమైపోతుంది. అలాంటి నేపథ్యంలో.. తన బాధను రాష్ట్రం మొత్తానికి పులుముతూ ప్రచారం చేయాలని అనుకోవడం.. కామెడీగా ఉంది.