పవర్ షేరింగ్ పై పవన్ దృష్టి?

నేను సిఎమ్ గా వుండి వుంటే…నేను సిఎమ్ ను అయితే…నాకు ఒక్క చాన్స్ ఇవ్వండి…ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు జనసేనాధిపతి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అసలు పవన్ కళ్యాణ్ మదిలో ఏముంది?  Advertisement ఆయన…

నేను సిఎమ్ గా వుండి వుంటే…నేను సిఎమ్ ను అయితే…నాకు ఒక్క చాన్స్ ఇవ్వండి…ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు జనసేనాధిపతి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అసలు పవన్ కళ్యాణ్ మదిలో ఏముంది? 

ఆయన తన గురించి, తన పార్టీ స్టామినా గురించి ఏమనుకుంటున్నారు? ఆంధ్ర రాజకీయాల్లో కనీసం చక్రం తిప్పాలనుకున్నా 50 స్థానాల్లో గెలవాల్సి వుంటుంది. అలా గెలవాలంటే కనీసం 100 స్థానాల్లో పోటీ చేయాల్సి వుంది. వంద స్థానాల్లో పోటీ పెట్టాలంటే కనీసం ఇరవై నుంచి ముఫై కోట్ల వంతున ఖర్చు చేసే కెపాసిటీ వున్న అభ్యర్థులు వంద మంది కావాల్సి వుంటుంది. దానికి మించి వంద మందికి పార్టీ నుంచి కనీసం తలా అయిదు కోట్లు ఇవ్వాలన్నా అయిదు వందల కోట్లు కావాలి. 

ఈ లెక్కలన్నీ పవన్ కు తెలుసా? తెలియదా? ఎందుకంటే గత రెండు నెలల్లో పవన్ నాలుగు రకాలుగా మాట్లాడారు. మాట్లాడుతున్నారు. అన్నింటికన్నా ముందుగా ఓ స్టేట్ మెంట్ పడేసారు. జగన్ ను దింపాలంటే అందరూ కలిసి పోరాడాల్సి వుందన్నారు. ఆ తరువాత పొత్తులు అంటే ఈ సారి తాము కాదు అవతలి వాళ్లు కూడా త్యాగాలు చేయాల్సి వుంటుందన్నారు. 

ఎప్పుడూ తామే త్యాగం చేయడం కుదరదన్నారు. ఆ తరువాత తనకు ఒక్క చాన్స్ ఇచ్చి చూడమని ప్రజలను కోరడం మొదలుపెట్టారు. అసలు తాను సిఎమ్ గా వుండి వుంటే పరిస్థితులు వేరుగా వుండేవన్నారు. 

అంటే సిఎమ్ గా తనకే ఓటు వేయమని పవన్ పదే పదే చెబుతున్నారు. దీని పర్యవసానం ఎలా వుంటుందో పవన్ కు అర్థం అవుతోందా? వంద స్థానాల్లో పోటీ చేస్తూ ఇలా రిక్వెస్ట్ చేస్తే జనాలు ఆలోచిస్తారేమో? భవిష్యత్ లో తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంటే ఈ డైలాగులు ఏమవుతాయి? తనకు ఓ అవకాశం ఇవ్వమని అడిగిన తరువాత తానే అధికారాన్ని టార్గెట్ చేయకపోతే ప్రజలు ఎందుకు ఓటేస్తారు?

ఈ సంగతులు ఏవీ పవన్ కు తెలియవని అనుకోవడానికి లేదు. ఆయన కావాలనే ఇదంతా చేస్తున్నారని అనుకోవాలేమో? చంద్రబాబు నుంచి లేదా తెలుగుదేశం నుంచి ఏదో ఆఫర్ ఆశిస్తూ వుండొచ్చు. అధికారం భాగమా? అధికారంలో పంపకమా? ఏది పవన్ టార్గెట్ అనుకోవాలి. అధికారంలో భాగమే అయితే అదేమీ పెద్ద సమస్య కాదు. నాలుగో అయిదో మంత్రి పదవులు ఇవ్వడానికి చంద్రబాబు రెడీగా వుంటారు. అలా కాకుండా రెండున్నరేళ్లు..రెండున్నరేళ్లు అధికారం పంచుకోవడం అన్న కోరిక వుంటే మాత్రం చాలా కష్టం. 

అలా అధికారం షేర్ చేసుకోవాలి అంటే పవన్ కనీసం యాభై కి పైగా ఎమ్మెల్యేలను గెలిపించుకోగలగాలి. అలా గెలిపించుకుని కూడా బాబుగారి రాజకీయాలు తట్టుకుని వారిని నిలబెట్టుకోగలగాలి. ఇవన్నీ జరిగేపనులేనా? 

మహానాడు తరువాత చంద్రబాబు ఆశలు పెరిగినట్లు, ఇటీవల తన సభలకు వస్తున్న జనాన్ని చూసి పవన్ కు కూడా ఆశలు రేగుతున్నట్లు కనిపిస్తోంది. నిజానికి పవన్ ఏం ఆలోచిస్తున్నారో? ఆయన మదిలో ఏముందో పార్టీలో కీలకమైన నాదెండ్ల మనోహర్ కు కూడా తెలియడం లేదని రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. చూస్తుంటే పవన్ మరోసారి తెలిసో, తెలియకో తప్పటడుగులు వేసేలాగే వుంది వ్యవహారం.