సికింద్రాబాద్ అగ్నిపథ్ అల్లర్లతో రైల్వే సంస్థకి కలిగిన నష్టం 12 కోట్ల రూపాయలు. అయితే ఆ విధ్వంసం సృష్టించేందుకు సాయి డిఫెన్స్ అకాడమీ నిర్వాహకుడు ఆవుల సుబ్బారావుకి అయిన ఖర్చు 35వేల రూపాయలు.
అవును.. 35వేల రూపాయలు ఖర్చు చేసి.. యువతను రెచ్చగొట్టి, పక్కా ప్లానింగ్ తో సుబ్బారావు అగ్నిపథ్ అల్లర్లను అమలు చేశారని పోలీసులు తేల్చారు. సుబ్బారావుతో పాటు అతని అనుచరులు మల్లారెడ్డి, శివ, బీసీరెడ్డిని అరెస్ట్ చేసి రైల్వే కోర్టులో హాజరుపరిచారు. రైల్వే కోర్టు వారికి రెండు వారాల రిమాండ్ విధించింది.
లాడ్జీలో కూర్చుని ధ్వంస రచన..
ఆవుల సుబ్బారావుకి సాయి డిఫెన్స్ అకాడమీ ఉంది. అగ్నిపథ్ పథకం వల్ల తన అకాడమీలో చేరే విద్యార్థుల సంఖ్య తగ్గిపోతుందనే అనుమానం అతనికి ఉంది. అందుకే తన దగ్గర కోచింగ్ తీసుకునేవారిని రెచ్చగొట్టాడు. ఈనెల 16 సాయంత్రం నరసరావుపేట నుంచి హైదరాబాద్ కి వచ్చి, బోడుప్పల్ లోని ఎస్వీఎం గ్రాండ్ లాడ్జిలో బస చేశాడు. రైల్వే స్టేషన్లో విధ్వంసం కోసం హకీంపేట ఆర్మీ సోల్జర్స్ అనే వాట్సప్ గ్రూప్ క్రియేట్ చేసి ప్లాన్ అమలు చేశాడు.
అభ్యర్థులను రెచ్చగొట్టి సికింద్రాబాద్ కి తీసుకొచ్చే బాధ్యత తన అనుచరులైన మల్లారెడ్డి, శివ, బీసీ రెడ్డికి అప్పగించాడు ఆవుల సుబ్బారావు. సాయి డిఫెన్స్ అకాడమీలో శిక్షణ తీసుకున్న యువకులకు రూ.35వేలు ఇచ్చి.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో విధ్వంసానికి సహాయ సహకారాలు అందించాడు.
ఎప్పటికప్పుడు తన సహచరులకు ఫోన్ ద్వారా ఆదేశాలిచ్చేవాడు. బోడుప్పల్ లోని హోటల్‌లో కూర్చొని విధ్వంస దృశ్యాలను టీవీలో చూస్తూ మరిన్ని ఆదేశాలిచ్చాడు. రైల్వే స్టేషన్లలో విధ్వంసం సృష్టిస్తే, కేంద్రం అగ్నిపథ్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటుందనే ఉద్దేశంతో సుబ్బారావు ఈ కుట్ర పన్నాడు.
ఆధారాలు తారుమారు..
సుబ్బారావు అనుకున్నది అనుకున్నట్టుగా అమలైనా.. విధ్వంసాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో భయంతో సుబ్బారావు వాట్సప్ మెసేజ్ లు అన్నీ డిలీట్ చేశాడు, తన ఫోన్ కాల్ లిస్ట్ కూడా డిలీట్ చేశాడు. కానీ వాట్సప్ గ్రూప్ అడ్మిన్ ఎవరనే విషయం కూపీలాగితే సుబ్బారావు వ్యవహారం బయటపడింది.
అంతే కాదు, టెక్నాలజీ సహాయంతో డిలీట్ చేసిన మెసేజీలు, కాల్ హిస్టరీని కూడా బయటకు తీశారు పోలీసులు. అతని అనుచరులతో కలిపి మొత్తం నలుగురిపై రైల్వే యాక్ట్‌తో పాటు మరో 25 సెక్షన్ల కింద రైల్వే పోలీసులు కేసులు నమోదు చేశారు. కోర్టులో హాజరు పరిచి రిమాండ్ కి తరలించారు.