Advertisement

Advertisement


Home > Politics - Analysis

నామినేష‌న్ల ఊపు.. రెబెల్స్ ఎవ‌రో స‌త్తా తేలే స‌మ‌యం!

నామినేష‌న్ల ఊపు.. రెబెల్స్ ఎవ‌రో స‌త్తా తేలే స‌మ‌యం!

త‌మ‌కు టికెట్ ఇవ్వ‌క‌పోతే రెబెల్ గా నామినేష‌న్ ఖాయ‌మంటూ కూట‌మికి చాలా మంది ఇన్ చార్జిలు హెచ్చ‌రిక‌లు చేశారు. ప్ర‌త్యేకించి జ‌న‌సేన‌, బీజేపీల పోటీకి ఏకంగా 30 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాలను, ఎనిమిది లోక్ స‌భ నియోక‌వ‌ర్గాల‌ను కేటాయించిన తెలుగుదేశం పార్టీకి అదో బెడ‌ద అయితే, తెలుగుదేశం పార్టీలోనే అనేక చోట్ల పాత వాళ్లను కాద‌ని కొత్త వాళ్ల‌కు అవ‌కాశం ఇవ్వ‌డంతో ర‌చ్చ రేగింది. దీంతో అనేక చోట్ల తాము రెబెల్స్ గా బ‌రిలోకి దిగ‌డం ఖాయ‌మంటూ కొంద‌రు నేత‌లు బాహాటంగా, మ‌రి కొంద‌రు త‌మ పార్టీ కార్య‌క‌ర్త‌ల ముందు ప్ర‌క‌ట‌న‌లు చేశారు. మ‌రి ప్ర‌క‌ట‌న‌ల సంగ‌తెలా ఉన్నా.. బ‌రిలో నిల‌వ‌డ‌మే అస‌లు సంగ‌తి! ఈ రోజుల్లో ఎన్నిక‌ల బ‌రిలో నిల‌వ‌డం అంటే మాట‌లేమీ కాదు! పైసా లేనిది ప‌ని జ‌ర‌గ‌దు!

తెలుగుదేశం టికెట్ ఇవ్వ‌లేద‌నో, చంద్ర‌బాబు ఇన్నాళ్లూ ఖ‌ర్చులు పెట్టించి ఇప్పుడు ఝ‌ల‌క్ ఇచ్చార‌నో, త‌మ‌కు కాకుండా వేరే వాళ్ల‌కు టికెట్ కేటాయించార‌నో అల‌గ‌డం పెద్ద క‌థ కాదు. ఇండిపెండెంట్ గా బ‌రిలో దిగి సీరియ‌స్ గా పోటీలో ఉండాలంటే ఖ‌ర్చులు భారీగా పెట్టుకోవాల్సి ఉంటుంది. పార్టీ త‌ర‌ఫున బ‌రిలోకి దిగితే.. వ‌చ్చే ఖ‌ర్చు క‌న్నా ఇండిపెండెంట్ గా సీరియ‌స్ గా బరిలో ఉండ‌టానికి చాలా ఎక్కువ ఖ‌ర్చులు అవుతాయ‌న‌డంతో పెద్ద ఆశ్చ‌ర్యం లేదు.

ఎలాగోలా పార్టీ ఆమోద ముద్ర‌తో బ‌రిలోకి దిగే వారికి పార్టీ క్యాడ‌ర్ క‌లిసి వ‌స్తుంది. పార్టీ పై అభిమానంతోనో, అధినేత‌పై అభిమానంతోనో, ఆస‌క్తితోనో.. సొంత ఖ‌ర్చుల‌తో తిరిగే వారు ఉంటారు. ఏదో ఒక ద‌శ‌లో పార్టీ ద్వారా ల‌బ్ధి పొందిన వారికి లోటు ఉండ‌దు. కులం, సామాజిక‌వ‌ర్గ స‌మీక‌ర‌ణాలు.. ఇలాంటి లెక్క‌లెన్నింటితోనో, వేరే పార్టీ అంటే న‌చ్చ‌క ఇటు వైపు తిరిగే వారు ఉంటారు. ఇలా నేత‌ల‌కు స‌గానికి స‌గం ఖ‌ర్చు త‌గ్గిపోతుంది. అలాగే పార్టీ త‌ర‌ఫున పోటీలో ఉంటే.. ఎంపీ అభ్య‌ర్థి నుంచి ఖ‌ర్చుల క‌వ‌రేజీ ఉంటుంది. ఎంపీ అభ్య‌ర్థులు కూడా ఎంతో కొంత ఖ‌ర్చులు షేర్ చేసుకుంటారు.

చాలా చోట్ల ఎంపీ అభ్య‌ర్థులు త‌ప్ప‌నిస‌రిగా ఖ‌ర్చులు పెట్టుకునే తీరు ఉంటుంది. అదే ఇండిపెండెంట్ అంటే పార్టీ త‌ర‌ఫున ఉండే ప్రివిలేజెస్ ఉండ‌వు! ఇక ఈ రోజుల్లో వ్య‌క్తిగ‌తంగా ఛ‌రిష్మా క‌లిగిన నేత‌లు ఎంత‌మంది అనేది ప్ర‌శ్నార్థ‌కం! ఏదో పార్టీ ఇమేజ్ తో నేత‌లు జ‌నాల్లోకి వెళ్లాల్సిందే కానీ, వ్య‌క్తిగ‌తంగా ఒక నియోజ‌క‌వ‌ర్గంలో అయినా ఒక వ్య‌వ‌స్థ స్థాయికి ఎదిగిన వారు చాలా త‌క్కువ‌! కాబ‌ట్టి.. వ్య‌క్తిగ‌త ఇమేజ్ తో గ‌ట్టిగా ఐదారు వేల ఓట్లు కూడా వ‌స్తాయ‌నే న‌మ్మ‌కం ఎవ్వ‌రికీ ఉండ‌దు!

క‌నీసం ఆ ఐదారు వేల ఓట్లు అయినా చీల్చి పార్టీ అభ్య‌ర్థికి న‌ష్టం చేయాల‌న్నా.. ప్ర‌చారం చేయాలి, పోటీ ప‌డాలి, ఖ‌ర్చులు పెట్టుకోవాలి! మ‌రి అంత శ‌క్తియుక్తులు ఎంత‌మందికి ఉంటాయ‌నేది ప్ర‌శ్నార్థ‌కం. సింపుల్ గా చెప్పాలంటే గ‌త ఎన్నిక‌ల్లో ఏపీ అసెంబ్లీలో ఒక్క ఇండిపెండెంట్ అభ్య‌ర్థి కూడా విజ‌యం సాధించ‌లేదు. ఇప్పుడు కూడా ఇండిపెండెంట్ గా పోటీ చేసి స‌త్తా చాటేసే వాళ్లు ఎవ్వ‌రూ క‌నిపించ‌డం లేదు. ఎవ‌రైనా సీరియ‌స్ గా నిల‌బ‌డితే తెలుగుదేశం కూట‌మి అభ్య‌ర్థుల ఓట్ల‌ను మాత్రం ఎంతోకొంత చీల్చ‌గ‌ల‌రు. మ‌రి అలా సీరియ‌స్ పాలిటిక్స్ ఎంత‌మంది రెబెల్స్ చేస్తార‌నేది ప్ర‌శ్నార్థ‌కం!

అయితే.. రెబెల్ అభ్య‌ర్థులు ఇండిపెండెంట్ గా బ‌రిలోకి దిగితే వ‌చ్చే న‌ష్టం క‌న్నా.. వారు సొంత పార్టీలో ఉంటూ ఏదైనా దెబ్బ తీస్తార‌నే భ‌య‌మే కూట‌మి అభ్య‌ర్థులు క‌నిపిస్తూ ఉంది. ఇన్నాళ్లూ పార్టీ బాధ్య‌త‌ల‌ను చూసిన త‌మ‌ను కాద‌ని, అధినేత వేరొక‌రికి టికెట్ ఇవ్వ‌గానే పైకి ధూంధాం అన‌క‌పోయినా.. లోలోప‌ల రాజ‌కీయంతో దెబ్బ కొట్టే వాళ్లే అస‌లు అభ్య‌ర్థుల‌ను క‌ల‌వ‌ర పెడుతూ ఉన్నారు.

నామినేష‌న్ల ప్ర‌క్రియ మొద‌లైన నేప‌థ్యంలో ఎవ‌రి పాత్ర ఏమిట‌నే క్లారిటీ వ‌చ్చేస్తోంది. కొన్ని చోట్ల అనూహ్యంగా కూట‌మి త‌ర‌ఫున ఆశావ‌హులు నామినేష‌న్ల‌ను దాఖ‌లు చేస్తున్నారు. మ‌రి కొన్ని చోట్ల రెబెల్ బ‌రిలో ఉంటామ‌నే వారు ఇంకా గుంభ‌నంగా ఉన్నారు. మ‌రి ఎవ‌రి తిరుగుబాటుదార్ల స‌త్తా ఏమిటో తేల‌డానికి ఇక రోజుల స‌మ‌య‌మే మిగిలి ఉంది!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?