రామేశ్వరం పోయినా శనేశ్వరం పోనట్టు…తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని చంద్రబాబు వెంటాడుతున్నారు. 2018లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకుని కాంగ్రెస్ భారీ మూల్యం చెల్లించుకుంది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ, వామపక్షాలు కుదుర్చుకుని బలంగా ఉన్నట్టు కనిపించింది. ఈ కూటమి అధికారంలోకి వస్తుందనేంతగా ఎల్లో మీడియా హడావుడి చేసింది. అయితే కాంగ్రెస్-టీడీపీ కూటమిని గెలిపిస్తే, మళ్లీ చంద్రబాబు చేతిలోకి తెలంగాణ పాలనా పగ్గాలు పోతాయని, ఆంధ్రా పీడ ఎప్పటికీ తొలగదంటూ కేసీఆర్ అస్త్రాన్ని సంధించారు.
కేసీఆర్ తెలంగాణ సెంటిమెంట్‌తో కాంగ్రెస్, టీడీపీ కూటమి చావు దెబ్బతింది. అధికారంలోకి వస్తామని భావించిన కాంగ్రెస్ పార్టీ, తమ ఓటమికి చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవడమే కారణమని చివరికి కనుక్కుంది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందమైంది. మళ్లీ ఎన్నికల పరీక్షకు తెలంగాణ నిలిచింది. బీఆర్ఎస్ తన అభ్యర్థులను ప్రకటించి ప్రత్యర్థులకు సవాల్ విసిరింది.
కాంగ్రెస్ పార్టీ కూడా మొదటి విడతగా 55 మంది అభ్యర్థులను ప్రకటించింది. తెలంగాణలో రాజకీయ వాతావరణాన్ని గమనిస్తే మరోసారి పరోక్షంగా కాంగ్రెస్‌పై చంద్రబాబు దెబ్బ పడే అవకాశాలున్నాయనే చర్చకు తెరలేచింది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిలో చంద్రబాబును చూస్తున్నారు. పైగా హైదరాబాద్‌లో స్థిరపడిన ఆంధ్రా కమ్మ సామాజిక వర్గానికి చెందిన కొందరి అత్యుత్సాహం కాంగ్రెస్‌కు నష్టం తెచ్చేలా ఉంది.
రేవంత్‌ను సీఎం చేసుకోవడం ద్వారా, తెలంగాణలో చంద్రబాబు పాలన తెచ్చుకున్నట్టు అవుతుందని కొందరు కమ్మ నేతలు బహిరంగంగా ప్రకటిస్తున్నారు. ఇటీవల ఓ ఎల్లో మీడియాధిపతి ఇదే విషయాన్ని తన కాలమ్‌లో పేర్కొన్న సంగతి తెలిసిందే. దీంతో కాంగ్రెస్‌కు సంప్రదాయ ఓటు బ్యాంక్ అయిన రెడ్లు ఆ పార్టీకి దూరమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు బీఆర్ఎస్ అత్యధికంగా 42 సీట్లను రెడ్లకు కేటాయించడంతో ఆ సామాజిక వర్గంలోని మెజార్టీ బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతోందన్న ప్రచారం ఊపందుకుంది.
కాంగ్రెస్‌కు ఓట్లు వేస్తే రేవంత్‌రెడ్డిని అడ్డు పెట్టుకుని చంద్రబాబు సామాజిక వర్గం పెత్తనం చేస్తుందనే భయం రెడ్లలో వుంది. అంతేకాకుండా, తామెంతగానో ఆరాధించే దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె షర్మిలను కాంగ్రెస్‌లోకి రాకుండా రేవంత్‌రెడ్డి అడ్డుకున్నారనే కోపం వారిలో వుంది. కాంగ్రెస్‌పై అభిమానం వున్నప్పటికీ, రేవంత్‌రెడ్డిలో చంద్రబాబు కనిపిస్తున్నారనే కారణంతో బీఆర్ఎస్ వైపు చూస్తున్న వాళ్ల సంఖ్య పెరుగుతోందనే చర్చకు తెరలేచింది. ఈ ఇబ్బందిని కాంగ్రెస్ అధిగమించే విధానం అనుసరించి తెలంగాణలో జయాపజయాలు ఆధారపడి వుంటాయి.