Advertisement

Advertisement


Home > Movies - Reviews

Tiger Nageswara Rao Review: మూవీ రివ్యూ: టైగర్ నాగేశ్వర రావు

Tiger Nageswara Rao Review: మూవీ రివ్యూ: టైగర్ నాగేశ్వర రావు

చిత్రం: టైగర్ నాగేశ్వర రావు
రేటింగ్: 2/5
తారాగణం:
రవితేజ, అనుపమ్ ఖేర్, నుపుర్ సనన్, రేణు దేశాయ్, జిషు సేన్ గుప్త, మురళిశర్మ తదితరులు
కెమెరా: ఆర్ మధి
ఎడిటింగ్: కోటగిరి వేంకటేశ్వర రావు
సంగీతం: జీవీ ప్రకాష్ కుమార్
నిర్మాత: అభిషేక్ అగర్వాల్
దర్శకత్వం: వంశీ
విడుదల తేదీ: 20 అక్టోబర్ 2023

నాగేశ్వర రావు ప్రసిద్ధిచెందిన స్టూవర్టుపురం దొంగ. అతని బయోపిక్ ఈ చిత్రం. ఏ మాత్రం సెంటిమెంట్ లేనితనం నుంచి ఒక రాబిన్ హుడ్ తరహాగా మారి తన ప్రాంతాన్ని ఎలా సంస్కరించాడన్నది ఇతివృత్తం. అసలు విషయమేంటో చూద్దాం. 

1956లో 8 ఏళ్ల నాగేశ్వరరావు ఒక దొంగతనం చేసే క్రమంలో తండ్రి తలనే నరికేసి పారిపోతాడు. అంత పాశవికమైన మనస్తత్వం అతనిది. బెజ్జెల ప్రసాదు (నాజర్) అప్పటికే స్టూవర్టుపురంలో దొంగల గురువు. అతని దగ్గర శిష్యరికం చేస్తాడు. ఎదిగాక ఆ ప్రాంతమ్మీద పట్టున్న నాయకుడికి ఎదురు నిలిచి తన ఉనికి చాటుకుంటాడు. దొంగతనాలు, దోపిడీలు చేస్తూ.. పోలీసుల్ని చంపుతూ జీవించే అతబు సారా (నుపుర్ సనన్) అనే అమ్మాయితో ప్రేమలో పడతాడు. అతని నేరపూరిత జీవితం వల్ల ఆమెను కోల్పోతాడు. ఏ నేరం చేసే ముందైనా అతనికి చెప్పి చేయడం అలవాటు. అలా ప్రధాని ఇందిరాగాంధి ఇంట్లో జొరబడి ఒక వస్తువు కాజేసి ఆమె దృష్టిని ఆకర్షిస్తాడు. ఆ పని చేయడం వెనుక నాగేశ్వరరావు ఉద్దేశమేంటనేది చివరికి తెలుస్తుంది. 

బయోపిక్ తీయడం ఆషామాషీ కాదు. రాజ్ కుమార్ హిరాని సైతం "సంజు" విషయంలో తడబడి మంచి ఎమోషనల్ స్టోరీగా మలచలేకపోయాడు. బయోపిక్స్ కి కమెర్షియల్ వేల్యూ తీసుకొస్తూ "మహానటి"తో చక్కని ఫార్మాట్ ని పరిచయం చేసిన దర్శకుడు నాగ్ అశ్విన్. నిజజీవితంలో సదరు పాత్ర మనస్తత్వం ఏదైనా, జరిగిన సంఘటనలు ఏవైనా అవన్నీ తెర మీదకి వచ్చేసరికి ఎలా ఉంటాయి అనేది వర్కౌట్ చెయ్యాలి. నిజం చెప్పడం సినిమా ఉద్దేశం కాదు. ప్రేక్షకుడికి అనుభూతిని మిగల్చడమే అన్నది ప్రూవ్ చేసిన చిత్రం మహానటి. ఆ క్రమంలో కొన్ని వక్రీకరించినా, కొన్ని మినహాయించినా తప్పు కాదు. 

కానీ ఈ "టైగర్ నాగేశ్వర రావు" బయోపిక్ విషయంలో ఆ ఫార్మాట్ ఫాలో అవ్వలేదు. సినిమా మొదలవడం బాగానే ఉన్నా ఒకానొక సన్నివేశంలో "ఛీ! ఇదా హీరో క్యారెక్టర్. వీడి ఘనకార్యాలు చూస్తూ చివరిదాకా భరించాలా"  అన్నంత అసహ్యం వేస్తుంది. బాల్యంలోనే తండ్రి తల నరికిన పాత్రని హీరో అనుకోమంటే తర్వాత అతనిలో జరిగిన మార్పుని చూపించే క్రమంలో గుండెని పిండాలి. అదేం కనపడదు ఇందులో. 

ఫస్టాఫులో ఒక సీనులో హీరో స్త్రీపాత్రని పక్కకు పిలిస్తే రాలేదని దారుణంగా కొడతాడు. అది చూడగానే హీరో క్యారెక్టర్ తో డిస్కనెక్ట్ ఏర్పడుతుంది. సెకండాఫులో దానికేదో కవరింగ్ ట్విస్ట్ ఇచ్చినా అప్పటికే నలిగిపోయిన ప్రేక్షకుడి మనసుకి ఇస్త్రీ చేసినట్టు అవ్వదు. 

నాగేశ్వరరావు సెక్యూరిటీ కన్నుగప్పి ప్రధాని ఇందిరాగాంధి ఇంట్లో చొరబడడం ఆమె కర్చీఫ్ దొంగతనం చేయడం లాంటివి కథలుగా చలామణీలో ఉండొచ్చు. అందులో సహేతుకత ఎంతున్నా లేకపోయినా తెర మీద చూస్తున్నప్పుడు కన్విన్సింగ్ గా అనిపించాలి. అంతే తప్ప ట్రోలింగ్ చేసే విధంగా తయారవకూడదు కదా!

హిందీవాడైన ఇన్వెస్టిగేషన్ బ్యూరో చీఫ్ (అనుపమ్ ఖేర్) మారువేషంలో స్టూవర్టుపురం చేరి ఆ జనం మధ్య ఉంటుంటాడు. అప్పటి వరకు తెలుగే రానివాడు ఒంగోలు యాసలో మాట్లాడేయడం విడ్డూరమే. 

ఈ కథ ఇద్దరు చెప్పే ఫ్లాష్ బ్యాక్స్ రూపంలో నడుస్తుంది. ఫస్టాఫ్ మురళిశర్మ చెబితే, సెకండఫులో ఫ్లాష్ బ్యాక్ నాజర్ చెప్తాడు. దీనివల్ల ఫస్టాఫులో చనిపోయిన కొన్ని విలన్ పాత్రలు సెకండాఫులో కూడా దర్శనమిస్తాయి. దాంతో కథ ముందుకి వెళ్లడం లేదన్న ఫీలింగుతో, అక్కడక్కడే తిరుగుతూ చిరాకుపెడుతున్నట్టు ఉంటుంది.

అలాగే ఫస్టాఫులో అయిపోయిందనుకున్న లవ్ ట్రాక్ సెకండాఫ్ మధ్యలో సెకండ్ హీరోయిన్ ఎంట్రీతో మళ్లీ మొదలవుతుంది. ఆ మెలోడ్రామా ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించడానికి తప్ప దేనికీ పనికిరాదు. ఇది కచ్చితంగా స్క్రీన్ ప్లే లోపం.  

అప్పటివరకు పీరియడ్ బ్యాక్డ్రాప్ లుక్కులో దొంగలా కనపడే నాగేశ్వరరావు అమ్మాయితో లవ్వులో పడగానే మోడర్న్ ప్యాంట్ షర్టుతో కనపడడమేకాకుండా కాలేజీలో స్టెప్పులేసి డ్యాన్సులు కూడా చేస్తాడు. ఇంతకంటే నాన్-సింక్ మరొకటి ఉండదు. 

ఈ స్టూవర్టుపురం బ్యాక్ డ్రాపులో అక్కడక్కడే నడిచేకథ చూస్తుంటే ఒక దశలో "ఆచార్య"లో పాదఘట్టం ట్రాక్ చూసిన అనుభూతి గుర్తొస్తుంది. 

ఎన్ని లోపాలున్నా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లో పట్టుంటే భరించొచ్చు. కానీ అది దయనీయంగా ఉంది. ఎక్కడా ఉత్కంఠ కలగకుండా జాగ్రత్తపడుతూ కొట్టాడు సంగీతదర్శకుడు. 

రవితేజ నటన ఎప్పటిలాగానే ఉంది తప్ప ఈ పాత్రలో కొత్త మెరుపులేవీ చూపించలేదు. ఫ్లాష్ బ్యాకులో గ్రాఫిక్స్ సాయంతో చూపించిన రవితేజ యంగ్ లుక్ బాగుంది. అయితే అతని క్యారెక్టర్ స్కెచ్చే సరిగ్గా లేక రక్తికట్టించదు. 

సారా పాత్రలో నుపుర్ సనన్ ఇప్పటి రవితేజ అసలు వయసుకి సరిపోయే లుక్కులో ఉంది. అయినా క్యారెక్టర్ పరంగా స్టూవర్టుపురంలో ఈ హిందీ అమ్మాయి ఎందుకుంది అనే డౌటనుమానాలొస్తాయి. నిజంగా నాగేశ్వరరావు జీవితంలో జరిగింది ఇదే అయితే సరే. అలా కాకుండా ఫిక్షన్ అయితే మాత్రం ఇది భయంకరమైన నాన్-సింక్. 

రెండో హీరోయిన్ గాయత్రి భరద్వాజ్ సెకండాఫ్ మధ్యలోంచి వచ్చి చివరి దాకా ఉంటుంది. ఈమెదే కాస్త లెంగ్త్ ఉన్న పాత్ర. పర్వాలేదు బానే చేసింది. 

రేణు దేశాయ్ కి హేమలతా లవణం పాత్ర ఇచ్చారు. ఆమె వల్ల ఒనగూరిన కొత్త ప్రయోజనమైతే ఏమీ లేదు. లాంగ్ బ్రేక్ తర్వాత నటించినట్టు తెలియాలనేమో ఆమె మొదటి సినిమానేమో అనిపించేలా పెద్దగా హావభావాలు పలక్కుండా నటించింది. 

నాజర్, అనుపమ్ ఖేర్, జిషు సేన్ గుప్తా అందరూ ఓకే. 

టెక్నికల్ గా గ్రాఫిక్స్ రిచ్ గా లేకపోయినా ఈ కథకి సరిపోయేలా ఉన్నాయి. కెమెరా తదితర విభాగాలు ఓకే. ప్రధానమైన సమస్యల్లా స్క్రిప్టులోనే ఉంది. 

మంచి నిర్మాత, ఒక పీరియడ్ బ్యాక్ డ్రాప్ స్టోరీ చెప్పే అవకాశమున్నప్పుడు దానిని సద్వినియోగ పరుచుకోలేకపోయాడు దర్శకుడు.

సినిమా ముగిసే సరికి టైగర్ నాగేశ్వరరావు మీద సింపతీ రాదు. ఎందుకంటే తనని తానే ఎరగా వేసుకుని తన ప్రాంతాన్ని సంస్కరించాడు అని రాసుకున్న ట్రాక్ హాస్యాస్పదంగా ఉంది తప్ప కన్విన్సింగ్ గా లేదు. 

నిజంగా జరిగింది అదే అని వాదిస్తే ఆ నిజాన్ని సినిమాగా సరిగ్గా తీయలేదనే చెప్పాల్సొస్తుంది. 

బహుశా హేమలత లవణం పాత్ర హీరోని డామినేట్ చేయకూడదని ఆమె చేసిన గొప్ప పనుల్ని రవితేజ ఇమేజ్ కోసం ఇటు షిఫ్ట్ చేసారేమో అనిపిస్తుంది.  ఏది ఏమైనా ఈ టైగర్ నాగేశ్వరరావు అనుకున్నంత బాక్సాఫీస్ టైగర్ గా అయితే కనిపించడు. కష్టం కనిపిస్తోంది కానీ ఫలితం పాజిటివ్ గా వచ్చే సూచనలు కనిపించడం లేదు. గాండ్రింపులు చేయకుండా మత్తుగా పడుకున్న టైగర్ లాగ ఉంది ఈ చిత్రం. 

బాటం లేవు: గాండ్రించని టైగర్

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?