Advertisement

Advertisement


Home > Movies - Reviews

Leo Review: మూవీ రివ్యూ: లియో

Leo Review: మూవీ రివ్యూ: లియో

చిత్రం: లియో
రేటింగ్: 2.5/5
తారాగణం: విజయ్, సంజయ్ దత్, త్రిష, అర్జున్, గౌతం వాసుదేవ్ మీనన్, మిస్కిన్, మన్సూర్ అలీ ఖన్, ప్రియ అనంద్ తదితరులు
సంభాషణలు: రత్నకుమార్
సంగీతం: అనిరుధ్
కెమెరా: మనోజ్ పరమహంస
ఎడిటర్: ఫిలోమిన్ రాజ్
నిర్మాత: లలిత్ కుమార్
దర్శకత్వం: లోకేష్ కనకరాజ్
విడుదల: అక్టోబర్ 19, 2023

లోకేష్ కనకరాజ్ సినిమాలకి ఒక బ్రాండ్ ఏర్పడింది. "ఖైదీ", "విక్రం" లాంటి సినిమాలు అతనికి ఫ్యాన్ బేస్ ని తెచ్చిపెట్టాయి. ఇది విజయ్ తో తనకి రెండవ సినిమా. ఎలా ఉందో చూద్దాం. 

పార్తిబన్ (విజయ్) హిమాచల్ ప్రదేశ్‌లో తన భార్య (త్రిష) ఇద్దరు పిల్లలతో కలిసి ఒక కాఫీ షాప్ నడుపుకుంటూ జీవిస్తుంటాడు. ఆ షాప్ కి వచ్చిన కొందరు రౌడీలని తన కూతుర్ని కాపాడుకోవడం కోసం కొట్టి చంపేస్తాడు. ఇదిలా ఉండగా సడెన్‌గా ఆంటోనీ దాస్ (సంజయ్ దత్) పార్తిబన్ దగ్గరకొచ్చి తాను అతని తండ్రినని చెప్తాడు. పైగా పార్తిబన్ గా నటించింది చాలు ఇక లియో దాస్ గా బయటికి రా అంటాడు. కానీ పార్తిబన్ అసలు ఆంటోనీ చెబుతున్న గతమేమిటో, అతను తనకి తండ్రి ఎలా అవుతాడో అర్ధం కాక నానా యాతన పడుతుంటాడు. ఇంతకీ పార్తిబన్ కి లియో దాస్ కి లింకేంటి? చివరిదాకా అదే సస్పెన్స్. 

ఈ సినిమా చూస్తున్నంత సేపు కంటికి చాలా ప్లీజింగ్ గా అనిపిస్తుంది. ఆ క్రెడిట్ ని హిమాచల్ లొకేషన్ కి, కెమెరామన్ కి ఇవ్వాలి. ఈ సీరియస్ యాక్షన్ సస్పెన్స్ కి కావాల్సిన మూడ్, యాంబియెన్స్ వాటి వల్ల సెట్టయ్యాయి. 

అయితే కథలో ట్విస్టులున్నా హృదయాన్ని వశం చేసుకోగల ఎమోషనల్ ఎలిమెంట్ లేదు. 

ప్రధమార్ధం "ఎదో ఉందిలే" అనిపించినా ద్వితీయార్ధానికి వచ్చే సరికి ఉత్కంఠ మొదలవుతుంది. ఒకానొక దశలో సంజయ్ దత్ పాత్ర కాస్త సెంటిమెంటల్ గా కనపడి కథ కొత్త మలుపు తిరుగుతోందనిపిస్తుంది. కానీ అలాంటిదేం లేకుండా ఆత్మలేని మరమనిషిలాగ కథనం సాగుతుంది. అలాగని మరీ బోర్ కొట్టదు. మనసుకి హత్తుకోదంతే. 

ఈ సినిమాలో ప్రధానమైన కంప్లైంట్ హీరో పేరు. డబ్బింగ్ కాబట్టి తాను తెలుగువాడినని చెప్పుకోవడం, తెలుగు పోలీస్ కావాలని ఒక దశలో కోరడం అవీ జరుగుతాయి. తెలుగువాడైతే పార్తిబన్ పేరేమిటి? ఆ మాత్రం నేటివిటీ తీసుకురావడానికి కూడా బద్ధకమా లేక తమిళ కావరమా అనిపిస్తుంది. 

అలాగే ఒక చోట "తెలంగాణ" అనే అక్షరాలు తెర మీద వెయ్యాల్సొచ్చినప్పుడు కన్నడ అక్షరాల్లో వేసారు. ఎంత కన్నడ, తెలుగు అక్షరాలు ఒకేలా ఉంటాయనుకున్నా "తె"లో తేడా తెలియదూ! అక్కడ కూడా అశ్రద్ధే. 

ఇక ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది విజయ్ నటన. 45 ఏళ్ల పాత్రలో ఒదిగిపోయాడు. ఇటు 14-15 ఏళ్ల కొడుక్కి తండ్రిగా, అటు ఒక 70 ఏళ్ల తండ్రికి కొడుకుగా కనిపిస్తూ, ఎక్కడా డ్యూయెట్స్ గట్రా లేకుండా సాహసం చేసాడు. విజయ్ పాత్రకి డబ్బింగ్ చెప్పిన ఆర్టిస్ట్‌ని కూడా మెచ్చుకోవాలి. రకరకాల వేరియేషన్స్ ని చక్కగా పలికించాడు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో త్రిషతో ఏడుస్తూ చెప్పే డయాలాగ్స్ బాగా పలికాయి. 

హీరోయిన్ త్రిష కంటికింపుగా తెరకి నిండుగా కనిపించింది. సినిమా మొత్తమొక డీసెంట్ గృహిణిగానే కనిపించింది. 

సంజయ్ దత్ విలనీ కౄరంగా ఉంది.

అర్జున్ సర్జా పాత్రని మాత్రం సరిగ్గా మలచలేదు.

గౌతం వాసుదేవ్ మీనన్ పాజిటివ్ పాత్రలో సటిల్ గా సింగిల్ ఎక్స్ప్రెషన్ తో లాగించేసాడు.

ఎందుకు నటించాడో తెలీనంత అతి చిన్న పాత్రలో బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కాశ్యప్ కనిపించాడు. అది కూడా ఇలా కనిపించి అలా చచ్చిపోయే ఒక రౌడీ పాత్రలో!

టెక్నికల్ గా అనిరుధ్ సంగీతాన్ని మెచ్చుకోవాలి. అలాగే పైన చెప్పుకున్నట్టు కెమెరా పనితనం ఈ చిత్రానికి ప్లస్ అయ్యింది. యాక్షన్ ఎపిసోడ్స్, గ్రాఫిక్స్ అన్నీ హై క్లాస్ లోనే ఉన్నాయి. 

ఇందులో ఒక హైనా పాత్ర కూడా ఉంది. నిజంగా ఏ జూ నుంచో తెచ్చిన హైనాతో నటింపజేసారా అన్నంత కన్విన్సింగ్ గా ఉన్నాయి కొన్ని గ్రాఫిక్స్. 

కథనం విషయానికొస్తే.. ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ఏవిటో, అసలా కుటుంబంలోని సంబంధాలేవిటో సరిగ్గా టచ్ చేయకుండా పైపైన చూపించి మిగతాది ప్రేక్షకుల్ని ఊహించుకోమన్నట్టు వదిలేసాడు. 

ఇలాంటి లోటుపాట్లు ఉన్నప్పటికీ ఇది యూత్ కి నచ్చొచ్చు. ఎందుకంటే కథ, కథనాల కంటే మొమెంట్స్ మీద నడిచే సినిమా ఇది. ఒక్కో సారి ఒక్కో పాత్ర తెర మీదకి రావడం, అలాగే లోకేష్ కనకరాజ్ గత చిత్రాల్లోంచి కూడా కొన్ని పాత్రలు వచ్చి ఇందులోకి దూరడం వంటివి ఆ సినిమాల్ని ఫాలో అయ్యే యువతకి సరదాగా అనిపిస్తాయి. 

కంటెంట్ పరంగా "విక్రం", "ఖైదీ" స్థాయిలో లేకపోయినా "లియో" కూడా విజయ్ స్టార్డం మీద ఒక వర్గం ప్రేక్షకులకి పట్టుకోవచ్చు. అందరికీ మాత్రం కాదు! చాలావరకు లోకేష్ తీసిన మునుపటి చిత్రాల మాదిరిగానే ఉంది. అంటే అదే అరవ దోశని మాడ్చే వరకు అటు ఇటు తిప్పడానికి డిసైడైనట్టున్నాడు. 

బాటంలైన్: తిప్పి వేసిన అదే దోశ

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?