తెలుగువాళ్లు గుంపుగా ఉంటే గొర్రెల్లాగానే ప్రవర్తిస్తారా?
అమెరికా వెళ్లినా అర గ్రాము ఆలోచన కూడా ఉండదా?
కక్కుర్తి, భయం, ఆత్రం, స్వార్థం..ఈ దిక్కుమాలిన గుణాలన్నీ తెలుగువారి ఆస్తులా?
ఇండియాలో పెట్రోల్ మర్నాడు నుంచి రూపాయి పెరుగుతుందంటే ముందు రోజు బైకులేసుకుని కిలోమీటర్ లైను కట్టే జాతి మనది. ఇంతా చేసి ఖాళీ ట్యాంకులైనా కూడా అందులో పట్టేది గరిష్టంగా 7 లీటర్లు. అంటే ఏడు రూపాయలు ఆదా చేయడానికి ఏడుస్తూ లైన్లో నిలబడుతున్నారంటే ఎమనాలి? నిజానికి ఇది ఆలోచనతో చేసే పని కాదు. వార్తల్లో హడావిడి వల్ల, నలుగురు బయలుదేరతారు..వాళ్లని చూసి మిగిలిన జనం లైన్లు కడతారు. అందుకే మనవాళ్లు ఒట్టి గొర్రెలోయ్ అనాలనిపిస్తూ ఉంటుంది చాలా సార్లు.
అయితే ఈ జాడ్యం అమెరికా వెళ్లినా పోవట్లేదు. అదే మన దౌర్భాగ్యం.
తాజాగా అమెరికాలో నాన్-బాస్మతి రకాల బియ్యానికి కొదవొచ్చింది. ఎందుకంటే ఇండియా అక్కడికి ఎగుమతి తాత్కాలికంగా ఆపింది. వరదల వల్ల పంటలకి నష్టం వాటిల్లడం వల్ల దిగుబడి కాస్తంత తగ్గింది కనుక సరిగ్గా ఎన్నికలు కొన్ని నెలల్లో ఉండగా ఎక్కడ రేట్లు పెరుతాయో అని బెదిరి డుమెస్టిక్ లెవెల్లో స్టాక్ తగ్గకుండా ఉండే ఆలోచన చేసింది భారత ప్రభుత్వం. అందులో భాగంగా కొన్ని రకాల బియ్యాల అంతర్జాతీయ ఎగుమతుల్ని ఆపేసింది.
అంతే ఈ వార్తతో అమెరికాలో తెలుగువాళ్లు కొందరు ప్రళయం వచ్చినట్టు ఫీలైపోతున్నారు.
తెలుగువాళ్లు ఎక్కువగా తినేది సోనామసూరి బియ్యం. దాని దిగుమతి ఆగిపోయింది కనుక షాపుల్లో ఉన్న స్టాకుని తామే కొనేసుకుని ఉంచుకోవాలని ఎవడి ఆత్రం వాడిది. కాస్ట్ కో దగ్గర, ఇతర ఇండియన్ స్టోర్స్ దగ్గర సుదీర్ఘమైన లైన్లు కట్టి బియ్యం కొనుక్కున్నారు. షాపుల వాళ్లు మనిషికొక బ్యాగ్ (10 కేజీలు) మాత్రమే ఇస్తామనగానే కొందరు పెళ్లాంపిల్లల్ని వెంట బెట్టుకుని లైన్లో నిలబడ్డారు.
“అన్నేసి బ్యాగులు దేనికి?” అనడగితే ఒకతను చెప్పిన సమాధానం, “ఉంటే వాడుకుంటాం. ఒక వేళ డిమాండ్ మరీ పెరిగితే బ్లాకులో అమ్ముకోవచ్చు కదా” అని చెప్పాడు.
ఎంత అసహ్యంగా ఉందో చూడండి కొందరు తెలుగు ఎన్నారైల మానసిక స్థితి.
అయినా దొరకనిది ఒక్క సోనా మసూరి రకమే కదా! బాస్మతి, థాయ్ రైస్, జాస్మిన్ రైస్ వగైరాలు మార్కెట్లో పుష్కలంగా ఉన్నాయి కదా. అంతే కాకుండా గోధుమపిండి, ఓట్స్, కినెవా రైస్ లాంటి ప్రత్యామ్నాయాలున్నాయి కదా!
అసలు అమెరికాకి బయలుదేరుతున్నప్పుడే ఆ దేశంలో ఏది దొరికితే అది తిని బ్రతకాడానికి సిద్ధంగా ఉండాలి. అక్కడికి వెళ్లినా సోనామసూరి లేకపోతే ముద్దదిగదు అనే వాళ్లని చూస్తే జుగుప్స కలుగుతుంది.
ఇదిలా ఉంటే కొంతమంది తెలుగు ఎన్నారైలు మరీ దారుణం. ప్రస్తుతం బియ్యానికి కరువొచ్చింది…కనుక అందరూ ప్రత్యామ్నాయంగా చపాతీలు చేసుకోవడానికి గోధుమపిండి మీద పడతారు అని ఊహించి కేజీలకు కేజీలు గోధుమ పిండి కొనేసి షాపుల్లో స్టాకంతా అవ్వగొట్టేస్తున్నారు. ఇంకొందరైతే ఇంకా ఆలోచించి కందిపప్పు, మినప్పప్పు కూడా భారీగా కొనేసి నిలవ ఉంచుకుంటున్నారు కొంపల్లో.
మరీ ఇంత లోభితనమా?
అయినా అమెరికా పక్కనే మెక్సికో ఉంది. అక్కడనుంచి బోలెడంత బియ్యం అమెరికాకి ఎగుమతౌతుంది. అమెరికాలోని “చిపోట్లే” లాంటి చాలా మెక్సికన్ రెస్టారెంట్స్ లో వాడే రైస్ మెక్సికోదే. అదన్నా కొనుక్కు తినొచ్చు కదా!
అంతెందుకు భారతదేశం అంతర్జాతీయ ఎగుమతులు ఆపింది ఒక్క నాన్-బాస్మతీ బియ్యపు రకాలే. అంటే బాస్మతి దొరుకుతున్నట్టే కదా! ఆ బియ్యాన్ని మనవాళ్లు ఇష్టంగా బిర్యానీ వండుకుని తినేదే! చాలామంది తెలుగు ఇళ్లల్లో బాస్మతి అన్నంగా కూడా తింటారు. ఈ ప్రత్యామ్నాయం ఉన్నా కూడా సోనామసూరి మీద కక్కుర్తి ప్రదర్శన చూపిస్తున్న తెలుగు ఎన్నారైలని ఛీ అని అసహ్యించుకోకుండా ఉండడం కష్టం.
అదేంటో అమెరికాకి వెళ్లింది బియ్యం కొనుక్కుని వండుకు తినడానికే అన్నట్టు పనులాపేసుకుని ఇంటిల్లిపాదీ లైన్లో నిలబడ్డారంటే వ్యక్తిత్వవికాస స్థాయి ఎక్కడుందో ఆలోచించండి.
చాలామంది పొట్టలు తగ్గడానికి బియ్యాన్ని బలవంతంగా మానేసి ప్రత్యామ్నాయ ధాన్యాలు తింటుంటారు. ఒకరకంగా ప్రస్తుత పరిస్థితిని అలా అనుకూలంగా మార్చుకోవచ్చు. అన్నమే అని కాకుండా రాగులో, కినెవానో, ఓట్సో తిని కొన్నాళ్లు కాలక్షేపం చేస్తే బొజ్జలన్నా తగ్గుతాయి.
అలా పాజిటివ్ గా తీసుకుని ముందుకెళ్లాలి కానీ షాపులు ముందు లైన్లు కట్టడం, నాలుగు బ్యాగులు కొనేసుకుని ప్రపంచాన్ని జయించినట్టు ఫీలవ్వడం కాదు.
ఈ నాన్-బాస్మతి రకాల్లో పొన్ని రైస్ కూడా ఉంది. అది కూడా ఇండియానుంచి ఎగుమతి ఆగిపోయింది. దానిని తమిళులు ఎక్కువగా తింటారు. అయినా వాళ్లు లేకితనం చూపిస్తూ షాపుల ముందు పొన్ని రైస్ కోసం క్యూలు కట్టట్లేదు.
కానీ డల్లాస్ లాంటి తెలుగువారి సాంద్రత ఎక్కువగా ఉన్న సిటీల్లో “బియ్యమో రామచంద్రా!” అని షాపుల ముందు మన తెలుగు బ్యాచ్ నిలబడడం చూస్తే నవ్వుతో పాటూ చిరాకు కూడా వస్తోంది.
హరగోపాల్ సూరపనేని