భాస్కరరెడ్డికి కూడా ఇదే వర్తిస్తుంది కదా!?

ఎంపీ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. కడప మాజీ ఎంపీ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డికి కస్టోడియల్ విచారణ అవసరం లేదని తెలంగాణ హైకోర్టు…

ఎంపీ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. కడప మాజీ ఎంపీ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డికి కస్టోడియల్ విచారణ అవసరం లేదని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. 

జూన్ నెలాఖరు వరకు ప్రతి శనివారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు ఆయన సీబీఐ విచారణకు హాజరు కావాల్సి ఉంటుందని, దేశం విడిచి వెళ్లడానికి వీల్లేదని హైకోర్టు తీర్పులో పేర్కొంది.

ఇక్కడి వరకు అంతా స్పష్టంగానే ఉంది. మరి అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర రెడ్డికి మాత్రం కస్టోడియల్ విచారణ ఎందుకు? అనే ప్రశ్న ఇప్పుడు ఉత్పన్నం అవుతోంది. ఆయనకు కూడా హైకోర్టు బెయిల్ మంజూరు చేయాలి కదా అనే వాదన వస్తోంది. ఎందుకంటే.. వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి ఎంపీ అవినాష్, ఆయన తండ్రి భాస్కర రెడ్డి ఇద్దరూ ఒకే రకమైన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

హత్య చేసిన వ్యక్తులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నవారు వేరు. ఎర్ర గంగిరెడ్డి, శివశంకర్ రెడ్డి, దస్తగిరి తదితరులు ఉన్నారు. వాచ్ మెన్ రంగయ్య వాంగ్మూలం ద్వారా సీబీఐ ధ్రువీకరించుకున్న పేర్లు కూడా ఇవి మాత్రమే. ఆ తర్వాతి విచారణలో తమకు తెలిసివచ్చిందని అంటూ అవినాష్ రెడ్డి, భాస్కర రెడ్డి పేర్లను కూడా సీబీఐ ఛార్జిషీటుల్లో కలిపింది. 

ఇంతా కలిపి వివేకా హత్యలో ఈ తండ్రీ కొడుకుల పాత్ర ఉన్నదని సీబీఐ అనడం లేదు. హత్యకు సంబంధించిన సమాచారం వారికి ముందుగా తెలుసునని, హత్యా సమయానికి ముందు వెనుక సమయాల్లో.. అవినాష్ ఇంటి పరిసరాల్లో నిందితులు ఉన్నారని మాత్రమే అంటున్నారు. కేవలం ఇలాంటి మాటల వల్ల హత్యలో వీరి పాత్ర ఉందని చెప్పడం హాస్యాస్పదం అవుతుంది.

అదే సమయంలో.. వీరిని విచారించడం ద్వారా అదనపు వివరాలు తెలుస్తాయని సీబీఐ అనుకోవడం తప్పేమీ కాకపోవచ్చు. అందుకు అరెస్టు చేసి కస్టోడియల్ విచారణ ద్వారా మాత్రమే తెలుసుకోగలమని వాదిస్తే మాత్రం అనుమానించాలి. అవినాష్ కుటుంబం పట్ల ఇప్పటికే సీబీఐ ఏదో కక్షపూరితంగా వ్యవహరిస్తున్నదనే ఆరోపణలు ఎదుర్కొంటోంది. 

అవినాష్ కస్టోడియల్ విచారణ అవసరం లేదని హైకోర్టు భావించిన నేపథ్యంలో, అదే పరిస్థితి భాస్కర రెడ్డికి కూడా వర్తిస్తుంది. ఈ తీర్పును ఉదాహరిస్తూ భాస్కరరెడ్డికి కూడా బెయిలు తీసుకోవడానికి వారి న్యాయవాదులు ప్రయత్నాలు మొదలు పెట్టినట్టుగా తెలుస్తోంది. బెయిలు రావడం కూడా తథ్యమేనని న్యాయనిపుణులు అంచనా వేస్తున్నారు. 

విచారణ చేసి నిజాలు తెలుసుకోవడం కంటె ఎక్కువగా ‘అరెస్టు’ చేయడం గురించే సీబీఐ ఎక్కువ ఉత్సాహం చూపించిందన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.