ఇటీవలే పవన్ గొప్పా, పాల్ గొప్పా అనే ఆర్టికల్ గ్రేట్ ఆంధ్రలో వచ్చింది. కామెంట్స్ లో అందరూ పవనే గొప్ప అని గింజుకున్నారు. కానీ వారంతా నోరెళ్లబెట్టాల్సిన విషయం బయటకొచ్చింది. పవన్ గుట్టును కేఏ పాల్ బయటపెట్టారు. బీజేపీ వచ్చి పవన్ తో పొత్తు పెట్టుకోలేదు. పవన్ వెళ్లి బీజేపీతో పొత్తు పెట్టుకున్నారట. ఈ రెండింటి మధ్య చాలా తేడా ఉంది.
బీజేపీ వచ్చి పవన్ తో పొత్తు పెట్టుకుంటే, పవన్ గ్రేట్. పవన్ ఏది చెబితే అది నడుస్తుంది. కానీ అలా జరగడం లేదేంటబ్బా.. ప్రతిసారి పవన్ రాజీ పడుతున్నారు, ఆఖరి నిమిషంలో అస్త్రాలు బీజేపీకి అందిస్తున్నారనే అనుమానం అందరిలో ఉంది.
ఎన్నికల టైమ్ లో బీజేపీకి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఏదో తేడా కొడుతోంది కదా? అనుకున్నారంతా. ఇన్నాళ్లకు ఆ తేడా ఏంటో కేఏ పాల్ చెప్పేశారు. మహాప్రభో.. నాతో పొత్తు పెట్టుకోండంటూ స్వయంగా పవన్ కల్యాణ్, బీజేపీ వెంటపడి మరీ చంక ఎక్కారు. అదీ సంగతి.
అక్కడ, ఇక్కడ కాదు.. అన్నిచోట్లా తగ్గాల్సిందే..
ఏరికోరి బీజేపీ దగ్గరకెళ్లి బతిమిలాడుకుని పొత్తు పెట్టుకున్నారు కాబట్టి.. బీజేపీ కండిషన్స్ అన్నిటికీ పవన్ తలూపాల్సిందే. ఆ విషయం ముందుగానే ఫిక్స్ అయింది. పాపం అది తెలియని జనసైనికులంతా.. తమతో జాతీయ పార్టీ పొత్తు పెట్టుకుందని సంబరపడ్డారు. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసినవాడు పవన్ అంటూ చంకలు గుద్దుకుంటున్నారే కానీ.. అన్ని చోట్లా పవన్ తగ్గుతున్నాడేంటా అని అనుకోలేదు.
తిరుపతిలో పవన్ ఎందుకు తగ్గారో ఇప్పుడు జనసైనికులకు ఓ క్లారిటీ వస్తుంది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఆఖరి నిమిషంలో పవన్ ఎందుకు అస్త్ర సన్యాసం చేశారో ఇప్పుడు అందరికీ అర్థమౌతోంది. అక్కడ పవన్ మాట చెల్లదు. బీజేపీ చెప్పినదానికి పవన్ తలాడించాల్సిందే.
చూస్తుంటే.. సుజనా చౌదరి, సీఎం రమేష్ లాంటోళ్లను బీజేపీలోకి అధికారికంగా పంపించిన చంద్రబాబే.. బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని పవన్ కు సూచించి ఉంటారనే అనుమానం కూడా మొదలవుతోంది. లేదంటే.. ఓట్లు చీల్చం, పొత్తు గురించి ఆలోచిస్తాం అని ఆదికి ముందు పవన్ ప్రకటించడం ఏంటి? దానికి టీడీపీ చంకలు గుద్దుకోవడం ఏంటి? అంతా స్క్రిప్ట్.
పొత్తు కాదు అంతా చిత్తే..
పవన్ కల్యాణ్ బీజేపీతో పొత్తులో లేరు, తమ మిత్రపక్షం అని చెప్పుకోడానికి పవన్ కి ఓ పర్మిషన్ ఇచ్చారంతే. దానికి బదులుగా పవన్ కల్యాణ్ ని తమ ఇష్టం వచ్చినట్టు ఉప ఎన్నికల ప్రచారాలకు తిప్పుకుంటోంది బీజేపీ. ఈ విషయం జనసైనికులకు ఇన్నాళ్లూ ఎక్కలేదు.
ఇప్పుడు కేఏపాల్ ఢిల్లీ లెవల్ లో పరువు తీసేశారు. ఆయన కోట్ చేసింది అమిత్ షా మాటలు కాబట్టి.. ఇంకా జనసైనికులెవరూ దానిపై రియాక్ట్ కాలేదు. పవన్ కు కూడా రియాక్ట్ అయ్యేంత ధైర్యం లేదు.
కనీసం పాల్ మాటలు పచ్చి అబద్ధం అని కూడా చెప్పలేరు పవన్ కల్యాణ్. ఒకవేళ చెబితే ఇంకెవరైనా బీజేపీ పెద్దలు దానిపై క్లారిటీ ఇస్తే అసలుకే మోసం వస్తుందనుకున్నారేమో సైలెంట్ అయ్యారు.
పవన్ ను చంద్రబాబుకి దత్తపుత్రుడు అంటూ అభివర్ణిస్తుంటే గింజుకుంటున్న కొంతమంది.. “బీజేపీ వద్దంటున్నా చంక ఎక్కిన బిడ్డ” అనే కామెంట్ కి మాత్రం కిమ్మనకుండా ఉండటం విచిత్రమే.