తెలంగాణకు వస్తున్న కేంద్రహోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్‌షాపై సీఎం కేసీఆర్ తనయ, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రశ్నల వర్షం కురిపించారు. ‘ప్రజల గోస- బీజేపీ భరోసా’ పేరిట తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర రెండో దశ శనివారంతో ముగియనున్నది. ఈ సందర్భంగా తుక్కుగూడలో నిర్వహించనున్న బహిరంగ సభకు ముఖ్య అతిథిగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా రానున్నారు.
రాష్ట్రానికి వస్తున్న అమిత్‌షాపై కల్వకుంట్ల కవిత ట్విట్టర్ వేదికగా ప్రశ్నలు సంధించారు. తెలంగాణపై బీజేపీ ఏలుబడిలోని కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు వివక్ష అనేది ప్రశ్నల సారాంశం. అనేక అంశాలపై ఆమె నిలదీయడం చర్చనీయాంశమైంది. ఇంతకూ కవిత సంధిస్తున్న ప్రశ్నల్లో ముఖ్యమైన అంశాలు ఏంటంటే…
3 వేల కోట్లకు పైగా ఉన్న ఫైనాన్స్ కమీషన్ గ్రాంట్ల బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారు? బ్యాక్‌వర్డ్ రీజియన్ గ్రాంట్ 1350 కోట్లు, అలాగే రూ. 2247 కోట్ల జీఎస్టీ పరిహారం సంగతేమిటి?, ఆకాశాన్ని తాకుతున్న ద్రవ్యోల్బనానికి మీ సమాధానం ఏమిటి?- బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పెరిగిన నిరుద్యోగం, మతపరమైన అల్లర్లపై మీ సమాధానం ఏమిటి..? అని కవిత ప్రశ్నలు సంధించారు.
గత 8 సంవత్సరాల్లో తెలంగాణకు ఒక్క IIT, IIM, IISER, IIIT, NID, మెడికల్ కాలేజీ నవోదయ పాఠశాలలు ఇవ్వడంలో కేంద్ర ప్రభుత్వం ఎందుకు విఫలమైందో తెలంగాణ బిడ్డలకు వివరించండి. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథకు 24,000 కోట్ల నిధులు ఇవ్వాలని నీతి అయోగ్ సిఫార్సును కేంద్ర ప్రభుత్వం ఎందుకు విస్మరించిందో చెప్పాలని కవిత ట్విట్టర్ వేదికగా నిలదీశారు. ఇవే కాకుండా మరిన్ని అంశాలపై ఆమె ప్రశ్నించడంపై బీజేపీ స్పందన ఎలా వుండనుందో మరి!