ఇవాళ వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు పుట్టిన రోజు. పుట్టిన రోజంటే ఎవరైనా తీపి జ్ఞాపకాలు నెమరు వేసుకుంటారు. రఘురామ కూడా గత 58 పుట్టిన రోజులు ఎంతో సంతోషంగా జరుపుకున్నారు. ఈ విషయాన్ని ఆయనే చెప్పారు. కానీ 59వ పుట్టిన రోజు మాత్రం పీడకలలా జరిగిపోయింది. బతికినంత కాలం 59వ పుట్టిన రోజు జరిగిన పీడలాంటి సెలబ్రేషన్ ఆయన్ని నీడలా వెంటాడుతూనే వుంటుంది.
ఇవాళ 60వ పుట్టిన రోజు. పుట్టిన రోజును పురస్కరించుకుని ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. సరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజు, అసలేం జరిగిందో ఆయన ఆవేదనతో చెప్పుకొచ్చారు. కనీసం లేచి నిలబడదామన్నా అవకాశం లేనంతగా చితక్కొట్టినట్టు చెప్పుకొచ్చారు. అన్నట్టు ఆయన్ను ఎందుకు కొట్టారో ఒకసారి గుర్తు చేసుకుందాం. అప్పట్టో ఆయన ప్రతిరోజూ తనకెంతో ఇష్టుడైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై ప్రశంసలు కురిపించే వారు.
ఎంపీ టికెట్ ఇచ్చి, గెలిపించి అత్యున్నత చట్ట సభకు పంపిన పార్టీ అధినేతపై విమర్శలు ఎక్కువ కావడంతో, సరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజు ఏపీ సీఐడీ అధికారులు రఘురామను అదుపులోకి తీసుకున్నారు. విజయవాడకు తీసుకెళ్లి సీఎంపై దూషణలకు దిగినందుకు తమదైన సత్కారం చేశారు. ఏపీ సీఐడీ సత్కారానికి తట్టుకోలేక అమ్మా, అబ్బా అంటూ రఘురామ దిక్కులు పిక్కటిల్లేలా కేకలు వేశారు. అదీ నాటి సంగతి. నాటి ఘటనపై రఘురామ ఇవాళ ఏమన్నారో ఆయన మాటల్లోనే…
“నా గుండెలపై కూచుని విపరీతంగా కొట్టారు. నా సెల్‌ఫోన్ కోసం వెతికి మళ్లీ నన్ను కొట్టారు. మొత్తం ఐదుసార్లు నన్ను తీవ్రంగా కొట్టారు. సీఎం జగన్, సునీల్ ఇద్దరూ అద్భుత కళాకారులు. ఓ కానిస్టేబుల్ వచ్చి ఏం జరిగింది? ఎవరు కొట్టారని అమాయకంగా అడిగాడు. హెడ్‌కానిస్టేబుల్ వచ్చి నన్ను మంచంపై పడుకోబెట్టాడు” అని ఆయన జ్ఞాపకాలను కళ్లకు కట్టారు. పుట్టిన రోజు చేదు అనుభవం పగవాడికి కూడా వద్దనేలా రఘురామ ఆవేదన విన్న వాళ్లెవరైనా కోరుకుంటారు.
కళ ఒకరబ్బని సొత్తు కాదు కదా రఘురామ. మనం ఎదుటి వాళ్లకు ఏమిస్తామో, అటువైపు నుంచి ప్రతిగా అదే ఇంకో రూపంలో వస్తుందని తెలుసుకుని మెలిగి వుంటే ఈ రోజు ఏడ్వాల్సిన పరిస్థితి వచ్చేది కాదు. అయినా ఆ రోజు ఏపీ సీఐడీ చితక్కొట్టకపోతే, ఇవాళ సొంత ప్రభుత్వ ఫెయిల్యూర్స్‌పై గళం ఎత్తే అవకాశం ఉండేది కాదు.
ప్రజల తరపున మీలా మాట్లాడే నాయకుడు మరొకరు లేరు. అంతా మీ మంచికే జరిగిందనుకుని, భవిష్యత్‌పై దృష్టి పెట్టాల్సిన ఆవశ్యకతను ఈ పుట్టిన రోజు గుర్తు చేస్తోంది. రఘురామకు పుట్టిన రోజు శుభాకాంక్షలు.
సొదుం రమణ