టీడీపీ హయాంలో రెచ్చిపోయిన ఒక్కొక్కరి కథ తేల్చే పనిలో జగన్ ప్రభుత్వం ఉన్నట్టు కనిపిస్తోంది. టీడీపీ హయాంలో ఇష్టానుసారం దోచుకున్నారనే బలమైన ఆరోపణలు ఎదుర్కొన్న వారిలో మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఉన్నారు.
ఈయనకు రాజధాని అమరావతిలో భారీగా భూములున్నాయనే విమర్శ ఉంది. బినామీ పేర్లతో భూములు కొల్లగొట్టినట్టు ప్రత్యర్థులు ఆరోపిస్తున్న సంగతి విధితమే.
ఈ నేపథ్యంలో తాజాగా ప్రత్తిపాటి పుల్లారావుపై కేసు నమోదు కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. మున్సిపల్ అధికారిణిపై దాడి ఘటనలో పోలీసులు ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు. చిలకలూరిపేటలో టీడీపీ హయాంలో పాత మంచినీటి చెరువు కట్టపక్కన ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం పేరుతో వాటర్ ప్లాంట్‌ను నాటి మంత్రి పత్తిపాటి పుల్లారావు ప్రారంభించారు.
ఈ ప్లాంట్ గత మూడేళ్లుగా మనుగడలో లేదు. కానీ దీనిని తిరిగి ప్రారంభిస్తున్నట్లు ప్రచారం చేశారు. పురపాలక సంఘానికి చెందిన స్థలంలో ఎవరికీ తెలియకుండా రెండు బోర్లు వేశారు. ఈ విషయం తెలిసి మున్సిపల్ అధికారులు సీరియస్‌గా స్పందించారు.
బోర్లకు అనుమతులు ఇవ్వలేదని, ఎలాంటి ప్రారంభాలు చేపట్ట వద్దని నోటీసులు ఇచ్చారు. వీటిని లెక్క చేయకుండా పుల్లారావు తన అనుచరులతో ప్లాంటు వద్దకు వెళ్లి గొడవ సృష్టించారు.
ఈ సందర్భంగా మునిసిపల్ టౌన్ ప్లానింగ్ సూపర్‌వైజర్ (టీపీఎస్) కోడిరెక్క సునీతను పుల్లారావు, ఆయన అనుచరులు తోసేసి ఆమెపై దాడికి పాల్పడినట్టు పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో మాజీ మంత్రితో పాటు మరికొందరిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద కేసు నమోదు చేశారు. పుల్లారావుపై కేసు నమోదుకే పరిమితమవుతారా లేక జైల్లో వేస్తారా? అనేది చర్చనీయాంశమైంది.