ష‌ర్మిల‌ను రాంగ్ రూట్‌లో న‌డిపిన ఆవేశం!

వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి త‌న‌య వైఎస్ ష‌ర్మిలను ఆవేశ‌మే రాంగ్ రూట్‌లో ప‌య‌నింప‌జేసిందా? అంటే… ఔన‌నే స‌మాధానం వ‌స్తోంది. త‌న రాజ‌కీయ క్షేత్రంగా తెలంగాణ‌ను ఎంచుకోవ‌డ‌మే ఆమె వేసిన మొద‌టి త‌ప్ప‌ట‌డుగు. పోగొట్టుకున్న చోటే వెతుక్కుంటే…

వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి త‌న‌య వైఎస్ ష‌ర్మిలను ఆవేశ‌మే రాంగ్ రూట్‌లో ప‌య‌నింప‌జేసిందా? అంటే… ఔన‌నే స‌మాధానం వ‌స్తోంది. త‌న రాజ‌కీయ క్షేత్రంగా తెలంగాణ‌ను ఎంచుకోవ‌డ‌మే ఆమె వేసిన మొద‌టి త‌ప్ప‌ట‌డుగు. పోగొట్టుకున్న చోటే వెతుక్కుంటే వ‌స్తువైనా, భ‌విష్య‌త్ అయినా దొరుకుతుంది. కానీ ఆమె అలా చేయ‌లేదు. త‌న మూలాలు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఉన్నాయ‌నే సంగ‌తి ఆమెకు తెలియంది కాదు.

అయితే అన్న వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిపై అపార‌మైన అభిమాన‌మే ఆమెను రాజ‌కీయంగా తెలంగాణ బాట ప‌ట్టించింది. స‌హ‌జంగా అన్ని కుటుంబాల్లో మాదిరిగానే అన్న‌తో ష‌ర్మిలకు విభేదాలు వ‌చ్చాయి. అలాగ‌ని అన్న‌కు రాజ‌కీయంగా న‌ష్టం తీసుకొచ్చే ఉద్దేశం ఆమెలో ఒక్క శాతం కూడా లేదు. వైఎస్ జ‌గ‌న్ అరెస్ట‌యి జైల్లో ఉన్న‌ప్పుడు, అన్న వ‌దిలిన బాణం అంటూ ప్ర‌జాక్షేత్రంలోకి ష‌ర్మిల వెళ్లారు. గ‌తంలో ఏ మ‌హిళా చేయ‌ని సాహ‌సాన్ని ఆమె చేశారు.

అన్న రాజ‌కీయ భ‌విష్య‌త్ కోసం సుదీర్ఘ పాద‌యాత్ర చేశారు. అలాగే గ‌త ఎన్నిక‌ల్లో బైబై బాబు అంటూ ఆంధ్ర‌ప్ర‌దేశ్ న‌లుమూల‌లా దిక్కులన్నీ మార్మోగేలా ప్ర‌చారాన్ని హోరెత్తించారు. ఏ విష‌య‌మైనా అద్భుతంగా ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లి వాక్ప‌టిమ ఆమె సొంతం. అందుకే ఏపీ ప్ర‌జానీకం గుండెల్లో ష‌ర్మిల‌కు ప్ర‌త్యేక స్థానం వుంది. వైసీపీ శ్రేణుల్ని ఆప్యాయంగా ప‌ల‌క‌రిస్తార‌నే పేరు ఆమెకు వుంది. కానీ అన్న‌పై ఒక వైపు ప్రేమ‌, మ‌రోవైపు కోపం…వెర‌సి ఆవేశంలో తెలంగాణ‌లో రాజ‌కీయ కార్య‌క‌లాపాలు ప్రారంభించారు.

ఏపీ విభ‌జ‌న‌కు దారి తీసిన ప్ర‌త్యేక ప‌రిస్థితుల‌ను ఆమె అర్థం చేసుకోలేక‌పోయారు. తెలంగాణ‌లోనే త‌న చావైనా, బ‌తుకైనా అని ఆమె బ‌లంగా చెప్పారు. కానీ అంత‌కు మించి తెలంగాణ‌లో సెంటిమెంట్ బ‌లంగా వుంద‌నే సంగ‌తి క్ర‌మ‌క్ర‌మంగా ఆమెకు తెలిసొచ్చింది. వైఎస్సార్‌టీపీలో చేరిక‌లు అస‌లే లేవు. త‌న ఫార్టీకి భ‌విష్య‌త్ లేద‌ని ఆమెకు నెమ్మ‌దిగా అవ‌గ‌త‌మైంది. కాంగ్రెస్‌లో త‌న పార్టీని విలీనం చేసేందుకు ప్ర‌య‌త్నాలు కొలిక్కి వ‌చ్చిన‌ట్టే వ‌చ్చి ఆగిపోయాయి.

దీంతో మ‌ళ్లీ ఆమె రాజ‌కీయ భ‌విష్య‌త్ అయోమ‌యంలో ప‌డింది. ఆమెలో మ‌ళ్లీ రోషం పుట్టుకొచ్చింది. రాష్ట్రంలోని 119 స్థానాల్లో పోటీ చేస్తాన‌ని ప్ర‌క‌టించారు. త‌న‌తో పాటు అవ‌స‌ర‌మైతే త‌ల్లి విజ‌య‌మ్మ‌, భ‌ర్త అనిల్ కూడా పోటీ చేస్తార‌ని ఆమె ప్ర‌క‌టించారు. కానీ అభ్య‌ర్థుల ఎంపిక‌పై ఆమె క‌స‌ర‌త్తు చేయ‌లేదు. దీంతో ఆమె పోటీపై అనుమానాలు త‌లెత్తాయి.

ఇవాళ నామినేష‌న్ల ప్ర‌క్రియ మొద‌లైంది. మీడియా ముందుకొచ్చిన ష‌ర్మిల ఎన్నిక‌ల బ‌రి నుంచి త‌ప్పుకోడానికి కార‌ణాల‌ను వివ‌రించారు. ఆవేశంలో తెలంగాణ‌కు వ‌చ్చి, రాజ‌కీయంగా గ‌మ్యం, గ‌మ‌నం తెలియ‌క‌… చివ‌రికి పోటీ నుంచి విర‌మించ‌డ‌మే ఉత్త‌మ‌మ‌ని ఆమె నిర్ణ‌యం తీసుకోవ‌డం గ‌మ‌నార్హం. బ‌హుశా తెలంగాణ‌లో కేడ‌ర్ క‌లిగిన టీడీపీనే ఎన్నిక‌ల బ‌రి నుంచి త‌ప్పుకోవ‌డం, గంద‌ర‌గోళంలో ఉన్న ఆమెకు ఒక మార్గాన్ని చూపించిన‌ట్టుగా వుంది. 

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను చాలా ఏళ్లు పాలించిన టీడీపీకి లేని పౌరుషం, త‌న‌కు మాత్రం ఎందుక‌నే భావ‌న‌కు ఆమె వ‌చ్చిన‌ట్టుగా తెలుస్తోంది. రాజ‌కీయాల్లో ఆవేశం ప‌నికి రాద‌ని  తెలియ‌డానికి అనేక చేదు అనుభ‌వాలను ఆమె రుచి చూడాల్సి వ‌చ్చింది. ఇప్ప‌టికైనా ఆవేశంతో కాకుండా ఆలోచ‌న‌తో ముంద‌డుగు వేయాల్సిన అవ‌స‌రం వుంది.