నిన్న ఏం ఒరగబెట్టామన్నది కాదు. ఇప్పుడు ఏం చేస్తామన్నది కీలకం..ఎవరికి? ఓటర్లకు. ‘మాకేంటీ’ అనడం కామన్ ఎన్నికలు వస్తే. ఓటు వేయడానికే రెండు వేల నోటు చేతులో పడాల్సిందే. అలాంటి జనాల ముందుకు వచ్చి మీకు అప్పుడెప్పుడొ అది చేసాను..ఇది చేసాను…అంటే సరిపోదు. ఇప్పుడేంటీ? అంటారు. సరే ఓట్ల టైమ్ వచ్చినపుడు నోట్లు ఎలాగూ ఇస్తారు. కానీ అసలు ముందుగా కాస్తయినా జనం మొగ్గు చూపాలంటే ఏం చేయాలి? గెలిస్తే ఏం చేస్తామో చెప్పాలి.
తెలుగుదేశం పార్టీ, జనసేన, వాటి అధినేతలు చంద్రబాబు, పవన్ అంతా కూడా తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామో చెప్పడం లేదు. ముందుగా జగన్ ను గద్దె దింపేయమంటున్నారు. జనాల అక్కౌంట్లలో నేరుగా అయిదేళ్లకు కలిపి లక్షలకు లక్షలు ఇస్తున్న జగన్ ను దింపేయమంటారు సరే. మరి మీరు వస్తే అలాగే ఇస్తారా? లేక అదనంగా ఇస్తారా? అన్న క్లారిటీ లేదు కదా? స్కీములు ఆపము అని ఓ సారి అనడం అయితే అన్నారు. కానీ వంద సార్లు జనాల నెత్తి మీద అప్పు భారం అనీ, రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని టముకేస్తున్నారు.
అలా అన్న వాళ్లు రేపు అదే సాకు చెప్పి, స్కీములు ఆపరు అని గ్యారంటీ వుందా? అధికారంలోకి రాకుండానే రాష్ట్రం గుల్లయిపోయింది అంటున్న వాళ్లు రేపు అధికారంలోకి వస్తే స్కీములు వుంచుతారా? అన్న అపనమ్మకం ఓటర్లను వెంటాడుతూనే వుంటుంది. వీటి మీద పక్కా క్లారిటీ ఇవ్వాల్సి వుంది. ఇదేం ఖర్మ..ఇదేం ఖర్మ అనడం కాదు. అధికారంలోకి వస్తే ఆ ఖర్మ ఎలా పోతుందో చెప్పాలి కదా.
ఎంతసేపూ ఫోన్ కనిపెట్టా, వ్యాక్సీన్ కనిపెట్టా అంటూ సోత్కర్షలు తప్ప 2019లో జనం తనను ఇంటికి ఎందుకు పంపారు. 2024లో మళ్లీ ఎందుకు తీసుకురావాలి అన్నది చెప్పాలి కదా? వ్యాక్సీన్, ఫోన్ కనిపెట్టి, ఎంతో అభివృద్ది చేసేస్తే జనం ఎందుకు 2019లో ఓడించారు అన్నది చూసుకోవాలి కదా?
వాలంటీర్లను కొనసాగిస్తారా? పీకేస్తారా? ఇప్పుడు ఇచ్చిన ఇళ్లు వుంచుతారా? రద్దు చేస్తారా? ఇలా పక్కా క్లారిటీ ఇవ్వాలి కదా. అదంతా మేనిఫెస్టోలో చూసుకుంటాం అంటే ఆ వేళకు జగన్ మరో నవరత్నాలతో రెడీ అయిపోతారు. ఒక సారి అప్పో సొప్పో చేసి అమలు చేసాడు కనుక జనం జగన్ ను నమ్మడానికే ఎక్కువ అవకాశం వుంది.
ఇప్పుడు ఇచ్చిన ఇళ్ల వాళ్లందరికీ రెండో అంతస్తు వేసుకోవడానికి తలా రెండు లక్షలో మూడు లక్షలో ఇస్తా అని జగన్ వాగ్దానం చేస్తే పరిస్థితి ఏమిటి? వాలంటీర్లకు జీతాలు డబుల్ చేస్తా అంటే వ్యవహారం ఎలా వుంటుంది? జగన్ ఆలోచనా విధానం ఇలాగే వుంటుంది. కానీ చంద్రబాబు మాత్రం మా తాతల మూతుల నేతులు వాసన చూసుకోండి..మురిసిపోండి అంటున్నారు. దాని వల్ల ఫలితం వుంటుందా?