ఆ ఎమ్మెల్యే చిత్తశుద్ధిని ఇక్కడ ప్రస్తావించుకోవాల్సి ఉంది. అందరూ బైక్స్ మీద ఇతర వాహనాల మీద గడప గడపకు వెళ్తున్నారు. అది మైదాన ప్రాంతం అయితే బాగానే ఉంటుంది. మరి కొండ ప్రాంతాలకు ఎలా వెళ్తారు. అక్కడ గడపలను ఎలా తొక్కుతారు. వారికి ఎలా ఊరటనిస్తారు. వారి సమస్యలు ఎలా వింటారు.
మనసు ఉండాలి. గట్టి సంకల్పం ఉండాలి అపుడు కొండలు కూడా ఎక్కి వెళ్లవచ్చు. ఇపుడు ఆ పనే చేశారు. అనకాపల్లి జిల్లా ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ. ఆయన రోలుగుంట మండలం శివారు ఏజెన్సీ అర్ల పంచాయతీకి చెందిన లోసంగి, పీతురు గడ్డ,పెద గరువు, గుర్రాల బైల, గదభ పాలెం గ్రామాల్లో గడపగడపకు కార్యక్రమంలో పాల్గొన్నారు
అయితే ఇవన్నీ కొండ ప్రాంతాలు. దీంతో ఎమ్మెల్యే ఏకంగా గుర్రమెక్కేశారు. అలా గుర్రంపై లోసంగి వెళ్లి ఇంటింటికి వెళ్లి ప్రజలు సమస్యలు అడిగి తెలుసుకున్నారు. నాలుగు కిలోమీటర్ల దూరం గుర్రం మీద ప్రయాణించి కొండ ఎక్కి ఆ ప్రాంత ప్రజలను సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అక్కడ ప్రజలు రోడ్డు నిర్మాణం చేపట్టాలని కోరారు.
దీంతో ఎమ్మెల్యే వారికి మంచి హామీ కూడా ఇచ్చారు. త్వరలో రోడ్డు కొండపై నిర్మాణం చేపడతామని ధర్మశ్రీ చెప్పారు. ఇక గుర్రం మీద తామున్న కొండ దగ్గరకు వచ్చిన ఎమ్మెల్యేను చూసి యువత ఘనంగా స్వాగతం పలికారు. అలా గుర్రం మీద కొండలు గుట్టలు ఎక్కి మరీ గడపను తొక్కుతున్న ధర్మశ్రీ మంచి మార్కులే కొట్టేస్తున్నారు. గిరిజనం కూడా మా ఎమ్మెల్యే మా గూడెం వచ్చారని సంబరపడుతున్నారు.