గత నెల చివరి వారంలో తెలుగు రాష్ట్రాల్లోనే కాదు జాతీయ స్థాయిలోనూ ఉవ్వెత్తున ఎగసిన సంచలనం చప్పబడిపోయిందేం ..? మళ్ళీ దాన్ని గురించి ఎలాంటి వార్తలు రావడంలేదు. ఇంతకూ ఆ సంచలనం ఏమిటంటారా? టీడీపీ -బీజేపీ మళ్ళీ పొత్తు పెట్టుకుంటాయని జాతీయ స్థాయిలో వార్తలు గుప్పుమన్నాయి. టీవీ చానెళ్ళలోనూ డిబేట్లు జరిగాయి. 2014 సీన్ రిపీట్ కాబోతుందని.. టీడీపీ మళ్లీ బీజేపీతో దోస్తీ చేయబోతుందనే ప్రచారం సాగింది. ఏపీలో ప్రస్తుతం బీజేపీ, జనసేన పొత్తులో ఉన్నాయి. దీంతో బీజేపీ,జనసేన, టీడీపీ కలిసే పోటీ చేస్తాయనే చర్చలు సాగాయి. జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ కూడా పొత్తులు ఖాయమనేలా వరుసగా ప్రకటనలు చేశారు. టీడీపీ చీఫ్ చంద్రబాబు కూడా తాము త్యాగాలను సిద్ధమనే సంకేతం ఇచ్చారు.
టీడీపీ నేతలైతే పొత్తులు ఖాయమయ్యానే అర్ధం వచ్చేలా మాట్లాడారు. ఏపీలో రాజకీయాల్లో కీలక పరిణామం జరగబోతోందని.. ఎన్డీఏ కూటమిలోకి తిరిగి తెలుగుదేశం పార్టీ ఎంట్రీ ఇవ్వబోతుందనే ప్రచారం ఢిల్లీలో జోరుగా సాగింది. ఎన్డీఏ కూటమిలోకి మళ్లీ టీడీపీ చేరబోతుందని ఓ జాతీయ మీడియాలో కథనం వచ్చింది. వచ్చే దసరా లేదా దీపావళి నాటికి బీజేపీ కూటమిలోకి తెలుగుదేశం పార్టీ చేరుతుందన్నది ఆ కథనం సారాంశం. ప్రముఖ ఆంగ్ల పత్రిక ది ఇండియన్ఎక్స్ ప్రెస్ ఢిల్లీ ఎడిషన్ లో కూమీకపూర్ అనే కాలమిస్ట్ ఈ కథనం రాశారు. బీజేపీ అగ్రనేతలకు కమీకపూర్ చాలా దగ్గరి మనిషి అని పేరుంది. అందుకే కమీకపూర్ రాసిన కథనం దేశ రాజకీయాల్లో సంచలనంగా మారింది.
ఆ తరువాత బీజేపీకి అనుకూల మీడియాగా పేరుపొందిన రిపబ్లిక్ టీవీ కూడా ఇదే విషయం చెప్పింది. వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వకుండా చూస్తామని జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ పదేపదే చెప్పడంతో, టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ పర్యటనలతో పొత్తుల దిశగా అడుగులు పడుతున్నాయనే వార్తలు వచ్చాయి. ప్రధానమంత్రి నరేంద్రమోడీతో చంద్రబాబు ఏకాంతంగా మాట్లాడారు. ఆ తర్వాత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో నారా లోకేష్ మంతనాలు సాగించారని తెలిసింది. ఈ నేపథ్యంలోనే టీడీపీ తిరిగి ఎన్డీఏ కూటమిలోకి ఎంట్రీ ఇవ్వబోతుందంటూ జాతీయ మీడియాలో కథనాలు రావడంతో… ఏపీలో టీడీపీ, బీజేపీ పొత్తు దాదాపుగా ఖరారైందని.. త్వరలోనే అధికారిక ప్రకటన రాబోతుందనే చర్చ జరిగింది.
ఆగస్టు ఆరోతేదీన చంద్రబాబు మోదీ తో భేటీ అయ్యారు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్ కమిటీ సమావేశంలో చంద్రబాబుతో మోడీ కరచాలనం చేశారు. ఐదు నిమిషాలు మాట్లాడారు. ఢిల్లీ రావాలని ఆహ్వానించారు. ఎప్పుడు వచ్చినా పీఎంవోకు చెబితే చాలు అపాయింట్‌మెంట్ ఇస్తారని మోదీ అన్నట్లు వార్తలు వచ్చాయి. తాను కూడా చాలా విషయాలు మాట్లాడాలనుకుంటున్నట్లు చంద్రబాబు మోదీతో అన్నట్లు ప్రచారమూ సాగింది దీంతో చంద్రబాబు, మోదీ భేటీ త్వరలో జరగనుందని అందరూ భావించారు. దీనికి తోడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా వచ్చి ఈనాడు సంస్థల అధినేత రామోజీరావును కలవడం, ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తో భేటీ కావడం రాజకీయంగా చర్చనీయాంశమైంది.
నారా లోకేష్ కూడా ఢిల్లీలో అమిత్ షాను కలిశారని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. బీజేపీతో పొత్తు కుదిరినట్లేనని టీడీపీ అనుకూల మీడియాలో కూడా వార్తలు వచ్చాయి. జాతీయ మీడియాలో కూడా కథనాలు ప్రచురితమయ్యాయి. అయితే ఇంతవరకూ చంద్రబాబు హస్తిన పర్యటనకు బయలుదేరకపోవడం కూడా పార్టీలో చర్చనీయాంశంగా మారింది. నిజానికి చంద్రబాబుకు ఏ మాత్రం అవకాశం ఉన్నా మోదీతో భేటీకి సిద్ధపడతారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఆయన పార్టీ ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వంలో కేసుల సమస్యను ఎదుర్కొంటోంది. దాని నుంచి బయటపడాలంటే కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరం. అందుకే నిజంగా మోదీ ఢిల్లీకి ఆహ్వానం పలికి ఉంటే పది రోజుల తర్వాతనైనా ఆయన ఢిల్లీ బయలుదేరి వెళ్లేవారు. బీజేపీ నేతలకు కూడా టీడీపీతో పొత్తు పెట్టుకోవాలని గట్టిగా భావిస్తే అటు నుంచి అయినా ఆహ్వానం అందేది.
కానీ అటు నుంచి పిలుపులు లేవు. ఇటు నుంచి ప్రయత్నాలు లేవు. ఆయన ఢిల్లీ ప్రయాణం కోసం తెలుగుదేశం పార్టీ నేతలు ఎదురు చూస్తున్నా ఫలితం లేకుండా ఉంది. చంద్రబాబు కూడా పొత్తులు గురించి ఆలోచించకుండా ముందు పార్టీ బలోపేతంపైనే దృష్టి సారించాలని పార్టీ నేతలకు పదే పదే పిలుపునిస్తున్నారు. దీన్ని బట్టి చంద్రబాబు హస్తిన ప్రయాణం ఇప్పట్లో జరుగుతుందా? లేదా? అన్న చర్చ పార్టీలో చర్చ జరుగుతోంది. అసలు బీజేపీతో పొత్తు కుదురుతుందా? మోదీ షేక్ హ్యాండ్ కు ఫలితం దక్కదా అన్న నిరాశ తెలుగు తమ్ముళ్లలో స్పష్టంగా కనపడుతుంది. ఈమధ్య తెలుగుదేశం పార్టీ, బీజేపీ పొత్తుకు సంబంధించి కమలం పార్టీ సీనియర్ నేత సంచలన వ్యాఖ్యలు చేశారు.
కుటుంబ, వారసత్వ పార్టీలతో కలిసే ప్రసక్తేలేదని చెప్పారు ఏపీ బీజేపీ ఇంచార్జ్ సునీల్ దేవధర్. ప్రస్తుతం తాము ఏపీలో జనసేన పార్టీతో పొత్తులో ఉన్నామని.. వచ్చే ఎన్నికల్లోనూ ఆ పార్టీతోనే కలిసి పోటీ చేస్తామని చెప్పారు. అవినీతి పార్టీలైన వైసీపీ, టీడీపీకి దూరంగా ఉంటామన్నారు సునీల్ దేవధర్. అయితే సునీల్ దేవధర్ కు విషయంలో టీడీపీ నేతలు మరో వాదన చేస్తున్నారు. మొదటి నుంచి సునీల్ టీడీపీకి, చంద్రబాబుకు వ్యతిరేకంగా పని చేస్తున్నారని.. వైసీపీ డైరెక్షన్ లోనే ఆయన వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు.
పొత్తుల విషయం బీజేపీ హైకమాండ్ చూసుకుంటుందని.. ప్రధాని నరేంద్ర మోడీ, హోంశాఖ మంత్రి అమిత్ షాలే నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నారు. చంద్రబాబుతో మాట్లాడిన విషయాలు సునీల్ కు తెలిసి ఉండకపోవచ్చన్నారు. ఇదిలా ఉండగా ఎన్డీఏలోకి టీడీపీ చేరే విషయంపై చంద్రబాబు మాట్లాడుతూ ఆ ప్రచారం చేసే వారే జవాబు చెప్పాలన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే గతంలో ఎన్డీయే నుంచి బయటకు వచ్చామని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోణంలోనే కేంద్ర రాజకీయాలను చూస్తామన్నారు. ఈ పొత్తుల కథ ఎలాంటి మలుపు తిరుగుతుందో చెప్పలేం.