Advertisement

Advertisement


Home > Politics - National

ఈయనొక్కడే కాదు ...ఇంకొకాయనా ఊగుతున్నాడు

ఈయనొక్కడే కాదు ...ఇంకొకాయనా ఊగుతున్నాడు

తెలంగాణా సీఎం జాతీయ రాజకీయాల్లోకి వెళ్లిపోవాలని ఊగిపోతున్నారు. అసలు కిందా మీదా నిలవడంలేదు. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లిపోవాలని, మోడీ ప్రభుత్వాన్ని దించేయాలని, దేశాన్ని రక్షించి పారేయాలని పగలు రాత్రి కలవరిస్తున్నారు. ఆయనకు ఇప్పుడు తెలంగాణా కంటే దేశం ఎక్కువైపోయింది. 

తెలంగాణా బాగుపడిపోయిందని పూర్తి సంతృప్తిగా ఉన్నారు. కానీ దేశమే పాడైపోతోందని యమ బాధపడిపోతున్నారు. నిజామాబాద్ సభలోనూ జాతీయ రాజకీయాల్లోకి వెళతానని చెప్పారు. అంతేకాకుండా నిజామాబాద్ నుంచే జాతీయ రాజకీయాల్లోకి వెళతానన్నారు. 

దేశవ్యాప్తంగా రైతులకు ఉచిత కరెంటు ఇస్తాను అన్నారు. వచ్చే ఎన్నికల్లో రాబోయేది మన ప్రభుత్వమే అన్నారు. ఆలూ లేదు చూలూ లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్లుగా కేసీఆర్ ఆవేశంతో ఊగిపోతున్నారు. సరే ... ఆయనేం చేస్తాడో మనకు తెలియదు. కానీ ఆయన కల సాకారం కావడం అంత సులభం కాదు. 

క్షేత్రస్ధాయిలో పరిస్ధితులను జాగ్రత్తగా గమనిస్తే నాన్ ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడేందుకు 90 శాతం అవకాశమైతే లేదు. ఎందుకంటే నాన్ ఎన్డీయే పార్టీలన్నీ ఏకతాటిపైకి రావటం సాధ్యం కాదని ఎప్పుడో తేలిపోయింది. నాన్ ఎన్డీయే పార్టీలంటే ముందు కాంగ్రెస్ పార్టీనే తీసుకోవాలి. ఇప్పటికే యూపీఏ కూటమికి కాంగ్రెస్ నేతృత్వం వహిస్తోంది.

కాంగ్రెస్ నేతృత్వంలో పనిచేయటానికి మమతా బెనర్జీ, కేసీయార్ లాంటి వాళ్ళు ఇష్టపడటంలేదు. కాంగ్రెస్ లాంటి జాతీయ పార్టీ అండలేకుండా ఎన్డీయేని ఎదుర్కోవటం నాన్ ఎన్డీయే పార్టీలకు సాధ్యం కాదు. అందరికీ తెలిసిన ఈ విషయాన్ని అంగీకరించటానికి మమత, కేసీయార్ ఇష్టపడటంలేదు. మరలాంటపుడు ఎన్డీయేని గద్దె దించటం ఎలా సాధ్యం? ఒక వైపేమో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే బాహుబలిలాగ కనబడుతోంది. 

వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావటానికి ఎన్డీయేకే అవకాశముంది. వాస్తవాలు ఇలాగుంటే కేసీయార్ మాత్రం దేశవ్యాప్తంగా రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చేస్తామంటు హామీలు గుప్పించేస్తున్నారు. బీజేపీకి వ్యతిరేకంగా పోరాటాలు చేయాలని, ఎన్డీయేని గద్దె దింపేయాలని కేసీయార్ పిలుపివ్వటంలో తప్పేలేదు.

కానీ అసలు కేసీయార్ ఏ పార్టీలతో కలుసుంటారు? కేసీయార్ తో కలవటానికి ఎన్నిపార్టీలు సిద్ధంగా ఉన్నాయన్నదే అసలు పాయింట్. ఎందుకంటే కేసీయార్ క్రెడిబులిటి ఏమిటో జాతీయపార్టీలన్నింటికీ తెలుసు. అందుకనే ఈ సీఎంతో చేతులు కలపటానికి ఎవరు సిద్ధంగా లేరు. 

ఇంతోటి దానికి పెద్ద పెద్ద హామీలే గుప్పించేయటం ఓవర్ యాక్షన్ లాగే ఉంది. ఇక కేసీఆర్ సంగతి ఇలా ఉంటే...ఆయన మాదిరిగానే జాతీయ నాయకుడిగా ఎదగాలని, ప్రతిపక్షాలను బీజేపీకి వ్యతిరేకంగా కూడగట్టాలని రీసెంట్ గా ప్రయత్నాలు ప్రారంభించాడు బీహార్ సీఎం నితీష్ కుమార్.

ఆయన మొన్నమొన్నటివరకు బీజేపీతో భుజం మీద చేయి వేసుకొని తిరిగాడు. కానీ ఉన్నట్లుండి ఆర్జేడీని చంకన పెట్టుకున్నాడు. బీజేపీని వ్యతిరేకిస్తున్నాడు. విపక్షాలను ఏకతాటిపైకి తేవడానికి ప్రయత్నాలు మొదలు పెట్టారు. రీసెంట్ గా రాహుల్ గాంధీని కలిసి చర్చలు జరిపారు. 

శరద్ పవార్ ను, హెచ్ డీ కుమారా స్వామిని కలిసే అవకాశం కూడా ఉంది. అఖిలేష్ యాదవ్ తో , వామపక్షాలతో కూడా చర్చలు జరపబోతున్నారు. ఉద్దవ్ థాకరేను, అరవింద్ కేజ్రీవాల్ ను కూడా కలవబోతున్నారు. కాబట్టి కేసీఆర్ ఒక్కడే తోపు కాదని అర్ధమవుతోంది కదా. నితీష్ ప్రధాని కావడానికి అన్ని అర్హతలూ ఉన్నాయని కొందరు ఉత్తరాది నాయకులు అంటున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?