టీడీపీలో విచిత్రమైన పరిస్థితి. టీడీపీలో నారా లోకేశ్ పెత్తనం పెరుగుతున్న నేపథ్యంలో ఆ పార్టీలో రెండు వర్గాలు ఏర్పడ్డాయి. ఒకటి చంద్రబాబు వర్గం, రెండోది లోకేశ్ వర్గం. చంద్రబాబు, లోకేశ్ వైఖరులు భిన్నంగా ఉన్నాయి. చంద్రబాబు ఆవేశంలో లేదా ఆగ్రహంతోనో పార్టీ నేతల్ని ఒక మాట తిట్టినా, వెంటనే మళ్లీ దగ్గరికి తీసుకుంటున్నట్టు ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. కానీ లోకేశ్ మాత్రం తాను అనుకున్నదే జరగాలనే పట్టుదలతో ముందుకు పోతున్నారని సమాచారం.
టీడీపీలో ఎవరెవరు ఎలాంటి వారో చంద్రబాబుకు బాగా తెలుసు. పార్టీ కోసం నిజంగా కష్టపడుతున్నదెవరు? నటిస్తున్నదెవరో బాబుకు తెలిసినంతగా లోకేశ్‌కు తెలియదని టీడీపీ నాయకులు చెబుతున్నారు. అయితే లోకేశ్ వద్ద షో చేస్తూ, రాజకీయ పబ్బం గడుపుకునేవాళ్ల సంఖ్య క్రమంగా పెరుడుతోంది. ఈ పరిణామాలపై టీడీపీలో అసంతృప్తి నెలకుంది. క్షేత్రస్థాయిలో ప్రజాదరణ లేని నాయకులను పక్కన పెట్టాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారు. అయితే ప్రజాదరణతో సంబంధం లేకుండా కేవలం తమకు నమ్మకస్తుడిగా ఉన్నారనే కారణంతో ఆదరించాలనేది లోకేశ్ వాదనగా వుంది.
ఉదాహరణకు టీడీపీలో కొందరు నాయకులు కేవలం షోలతో టికెట్ దక్కించుకోవాలని తెగ తాపత్రయ పడుతున్నారని నాయకులు చెబుతున్నారు. వంగలపూడి అనిత, భూమా అఖిలప్రియ, యనమల రామకృష్ణుడు, జీ.ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, సీఎం సురేష్‌నాయుడు (ప్రొద్దుటూరు), కావలి గ్రీష్మ, పట్టాభి, ఆనం వెంకటరమణారెడ్డి, రాజేష్, అనూష తదితరులున్నారు. నిత్యం టీవీల్లో కనిపించే నేతలే గొప్ప లీడర్స్‌గా లోకేశ్ పరిగణిస్తున్నారనే చర్చకు తెరలేచింది.
వీరిలో యనమల రామకృష్ణుడి కుటుంబం ఒక్కటే మినహాయింపు. ఎందుకంటే ఎన్టీఆర్‌ను గద్దె దించే సమయంలో స్పీకర్ హోదాలో చంద్రబాబుకు యనమల మద్దతుగా నిలిచారు. దీంతో యనమలపై క్షేత్రస్థాయిలో అభిప్రాయంతో సంబంధం లేకుండా చంద్రబాబు ఆదరించాలనే నిర్ణయానికి వచ్చారు. కానీ లోకేశ్ మనస్తత్వం అలాంటిది కాదు. తమ వెంట నడిచే వారికి క్షేత్రస్థాయిలో ప్రజాదరణ, గెలుపోటములతో సంబంధం లేకుండా టికెట్స్ ఇవ్వాలని పట్టు పడుతున్నట్టు ఆ పార్టీలో అంతర్గత చర్చ జరుగుతోంది.
లోకేశ్ చెబుతున్న వారికల్లా టికెట్లు ఇస్తే, మరోసారి టీడీపీకి ఘోర పరాజయం తప్పదని బాబుకు కొందరు సీనియర్ నేతలు తేల్చి చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది. తమకు టికెట్లు ఇచ్చే ఆలోచనలో చంద్రబాబు లేరనే సంగతి గ్రహించిన నేతలు, లోకేశ్‌ను నమ్ముకుంటున్నారని తెలిసింది. తనతో బాగుంటే చాలనే ఆలోచనతో కొందరికి లోకేశ్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని సమాచారం. దీంతో టికెట్ల విషయంలో హామీల్లాంటివి ఇవ్వొద్దని లోకేశ్‌కు చంద్రబాబు గట్టిగా క్లాస్ తీసుకున్నారని తెలిసింది. పాదయాత్ర మొదలు పెట్టిన కొత్తలో కొన్నిచోట్ల లోకేశ్ నేరుగా అభ్యర్థులనే ప్రకటించారు. లోకేశ్ తీరుపై చంద్రబాబుకు ఫిర్యాదులు వెళ్లడం, యువ నాయకుడికి టీడీపీ జాతీయ అధ్యక్షుడు హితవు చెప్పడంతో వెనక్కి తగ్గినట్టు సమాచారం.
క్షేత్రస్థాయిలో వర్కౌట్ చేసుకుంటే టికెట్ వస్తుందో రాదో తెలియదని, లోకేశ్‌ను నమ్ముకుంటే అన్నీ సక్రమంగా జరుగుతాయనే భావన టీడీపీలో క్రమంగా పెరుగుతోంది. ఇది పార్టీకి నష్టం తీసుకొస్తుందనే ఆందోళన సీనియర్ నేతల్లో కనిపిస్తోంది. ప్రజలతో సంబంధం లేకుండా సులువుగా టికెట్ దక్కించుకుని, చట్టసభల్లో అడుగు పెట్టాలనే వారికి లోకేశ్ అపాయింట్మెంట్ ఈజీగా దక్కుతోందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
ఉదాహరణకు చిలకలూరిపేటలో మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావును కాదని రియల్టర్ భాష్యం ప్రవీణ్ దూకుడు ప్రదర్శించారు. ఇటీవల పార్టీ కార్యకలాపాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆయనపై వేటు వేశారు. లోకేశ్ ముఖ్య అనుచరుడిగా ప్రవీణ్ ముద్రపడ్డారు. ఇలా ప్రతి నియోజకవర్గంలో బాబు, లోకేశ్ వర్గాలున్నాయి. లోకేశ్‌దే భవిష్యత్ కావడంతో సీనియర్లు సైతం ఆ యువనాయకుడికి ఇష్టంతో సంబంధం లేకుండా జై కొడుతున్నారు.
నెమ్మదిగా లోకేశ్ వర్గమే పైచేయి సాధిస్తోంది. కానీ లోకేశ్ తీరు మాత్రం టీడీపీకి డ్యామేజీ కలిగించేలా వుందన్న అభిప్రాయం మాత్రం టీడీపీలో బలంగా వుంది. రానున్న రోజుల్లో టీడీపీ అభ్యర్థుల ఎంపికలో లోకేశ్ జోక్యం ఎక్కువగా వుంటుందనడంలో సందేహం లేదు. అయితే కుమారుడి అభిప్రాయాల్ని కాదని చంద్రబాబు ఎంత వరకు బలమైన లీడర్స్‌ను బరిలో దింపుతారనేది పెద్ద ప్రశ్నగా మిగిలింది.