ఆంధ్రలో ఏం జరుగుతోంది అని ప్రశ్నించుకుంటే, తెలుగుదేశం అనుకుల పత్రికలు చదివితే రేపు లేదు ఎల్లుండే చంద్రబాబు ప్రభుత్వం రావడం పక్కా అనిపిస్తుంది.
కానీ గ్రామాల్లో తిరుగుతుంటే రూపురేఖలు మారిన స్కూళ్లు, ఆసుపత్రులు, ఎవరు ఎంతలా ఎన్ని వార్తలు, వ్యాసాలు వండి వార్చినా, ఊళ్లకు ఊళ్లు కొత్తగా మొలుచుకువస్తున్నట్లు కనిపిస్తున్న జగనన్న కాలనీలు, సరే, డబ్బులు నేరుగా ఖాతాలో పడడం వంటివి కనిపిస్తూనే వున్నాయి.
ఎంత కిందా మీదా పడుతున్నా గ్రామీణ ఓటరు మనసు ఇంకా మారలేదు. కేవలం జనసేన ను పవన్ కారణంగానో, పవన్ కులం కారణంగానో అభిమానించే కుర్ర ఓటర్లు మాత్రం వేరేగా కనిపిస్తున్నారు.
ఇక పట్టణాల్లో దిగువ మధ్య తరగతి, సామాన్యుల ఆలోచనలు వేరుగా వున్నాయి. చదువుకున్న కుర్రకారు ఆలోచనలు జనసేన దిశగా వున్నాయి. ఎన్నికలు వచ్చే వరకు యాంటీ జగన్ అనే వాతావారణాన్ని మెయింటెయిన్ చేయాల్సి వుంది. దాని కోసం రాసిందే రాసి..రాసి..రాసి కిందా మీదా అవుతున్నారు.
ఓ రోజు బిసిలకు వ్యతిరేకి అని అర్థం వచ్చేలా, మరో రోజు ఎస్సీలకు ఏమీ చేయడం లేదు అని అర్థం వచ్చేలా, ఇంకో రోజు రోడ్లు, మరోసారి పంటలు. ఇలా మార్చి మార్చి అవే స్టోరీలు ఇంకా మార్చి వరకు రాయాల్సి వుంది. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే ఒకటికి పదిసార్లు అవే చదవడం వల్ల ప్రభావం పలుచనైపోతూ వుంటుంది.
అలా అని ఆంధ్రలో జగన్ కు ఫికర్ లేదు. అస్సలు ఏవీ పట్టించుకోనక్కరలేదు అని చెప్పడం లేదు. జగన్ జాగ్రత్త పడాల్సి వుంది. పడుతున్నారు కూడా. ఇప్పుడు ఈ షార్ట్ స్పాన్ లో చకచకా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇది మరి కాస్త ముందుగా మొదలుపెట్టి వుంటే బాగుండేది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. కానీ అలా అని ఇప్పటికే ఎల్లో మీడియా రాతల వల్ల, గ్లోబెల్ ప్రచారం వల్ల పొల్యూట్ అయిపోయిన మైండ్ లు అంత సులువుగా మారిపోవు. దీనికి జగన్ రంగంలోకి దిగడం ఒకటే మార్గం. జగన్ కు ఆ మాటల మంత్రం తెలుసు.
అయినా కూడా… ఆంధ్ర ట్రెండ్ ఇప్పటికి అయితే ఇంకా అంతుపట్టని వైనమే. డిసెంబర్ లో తెలంగాణ ఫలితాలు రావాలి. జనం ఎలా ఆలోచిస్తున్నారు అన్నది ఓ క్లారిటీ వస్తుంది. అప్పుడు జగన్ ఎన్నికల వ్యూహాలు దానికి అనుగుణంగా రచించుకునే అవకాశం వుంటుంది. అంత వరకు రోజూ ఇటు నుంచి అటు నుంచి తిట్లు, విమర్శలు, వండి వార్చుకునే వ్యాసాలు అన్నీ అలా సాగుతూనే వుంటాయి.
ఇదంతా జనాలకు జస్ట్ ఓ ఎంటర్ టైన్ మెంట్. ఓటు వేయడానికి జడ్జిమెంట్ కాదు. అది రావడానికి ఇంకా చాలా టైమ్ వుంది.