తెలుగుదేశం పార్టీకి గంట మోగించండి

లోకేష్ బాబు ఓ కొత్త పిలుపు ఇచ్చారు. ఢిల్లీలో వుండి వుండి.. మోడీగారి ఐడియాను కాపీ కొడుతూ ఈ పిలుపు ఇచ్చారు. జనాలు ఇళ్లలో కానీ, రోడ్ల మీద కానీ ఎక్కడ వుంటే అక్కడి…

లోకేష్ బాబు ఓ కొత్త పిలుపు ఇచ్చారు. ఢిల్లీలో వుండి వుండి.. మోడీగారి ఐడియాను కాపీ కొడుతూ ఈ పిలుపు ఇచ్చారు. జనాలు ఇళ్లలో కానీ, రోడ్ల మీద కానీ ఎక్కడ వుంటే అక్కడి నుంచి ఏదో ఒక సౌండ్ చేయాలట. అయిదు నిమిషాల పాటు. అది గంట కావచ్చు, గరిటె చప్పుడు కావచ్చు. పళ్లెం చప్పుడు కావచ్చు, బండి హారన్ కావచ్చు. ఆఖరికి ఈల వేసినా ఓకె అంటే. ఈ విధంగా ఏం సాధించాలి అనుకుంటున్నట్లు.

జనం అంతా మూకమ్ముడిగా ఈ కార్యక్రమంలో పాల్గొంటే తెలుగుదేశం పార్టీ వైపే జనాలు అంతా వున్నట్లు అని భ్రమల్లో మునిగి తేలడానికి తప్ప దేనికి పనికి వస్తుంది. జనం చాలా తెలివి మీరారు. అంత సులువుగా బయటపడడం లేదు. ఎవరు వెళ్తే వారికే జై కొడుతున్నారు. 

జగన్ వస్తే ఓకె అంటున్నారు. పవన్ వస్తే సై అంటున్నారు. బాబు, చినబాబు వచ్చినా బారులు తీరుతున్నారు. అదే విధంగా అంతా గంట కొట్టేసినంత మాత్రాన జనం అంతా తెలుగుదేశం వైపు వున్నట్లు కాదు. కొట్టనంత మాత్రాన వైకాపా వైపు వున్నట్లు కాదు.

అసలు ఈ పిలుపే సరైనది కాదు. అయిదు నిమిషాల పాటు నానా శబ్దాలు చేస్తారు ఒకరు. పక్కింటి వాడికి అది నచ్చకపోవచ్చు. లేదా వాడు వైకాపా అభిమాని కావచ్చు. దాంతో గొడవలు రేగుతాయి. కేసులు, అరెస్ట్ లు, గ్రామాల్లో తగాదాలు. అవసరమా? ఇలాంటి పిలుపు.

అసలు ఇలాంటి పిలుపు వల్ల లోకేష్ చెప్పేది ఏముంది? న్యాయ వ్యవస్థలో న్యాయం జరగడం లేదు తమకు అనా? నిజంగా బాబు నిర్దోషి అయితే ఆ విషయం న్యాయస్థానంలో తేలుతుంది కదా. ఈ లోగా ఈ తంతగం అంతా ఎందుకు? అంటే లోపల వున్న బాబు నిర్దోషి అని తెగ టముకు వేసి, ఆ ప్రభావం న్యాయస్థానాల మీదకు తేవాలనా?

అసలు తను ఢిల్లీలో కూర్చుని, అరెస్ట్ ను తప్పించుకునేందుకు నానా పాట్లు పడుతున్నారన్న కలర్ జనాల్లోకి ఇప్పటికే వెళ్లిపోయింది. ఇప్పుడు ఇలాంటి పిలుపు ఇవ్వడం ద్వారా తనేదో రాజకీయ ప్రణాళికల్లో బిజీగా వున్నాననే కలర్ తప్ప మరేం ప్రయోజనం వుంటుంది ఈ పిలుపు వల్ల అని అనుకోవాల్సిందే.