Advertisement

Advertisement


Home > Movies - Reviews

Peddha Kapu 1 Review: మూవీ రివ్యూ: పెదకాపు-1

Peddha Kapu 1 Review: మూవీ రివ్యూ: పెదకాపు-1

చిత్రం: పెదకాపు-1
రేటింగ్: 2/5
తారాగణం:
విరాట్ కర్ణ, ప్రగతి శ్రీవస్తవ, రావు రమేష్, నాగ బాబు, అనసూయ భరద్వాజ్, తనికెళ్ల భరణి, రాజీవ్ కనకాల, ఈశ్వరి రావు, ఆడుకాలం రవి తదితరులు
సంగీతం: మిక్కీ జె మేయర్
ఎడిటర్: మార్తాండ్ కె వెంకటేష్
నిర్మాత: మిర్యాల రవీందర్ రెడ్డి
దర్శకత్వం: శ్రీకాంత్ అడ్డాల
విడుదల: సెప్టెంబర్ 29, 2023

శ్రీకాంత్ అడ్డాల అనగానే ఒకప్పటి అతని సాఫ్ట్ చిత్రాలు గుర్తుకొస్తాయి. "కొత్త బంగారు లోకం" తో మొదలుపెట్టి "సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు" తీసి ఆ తర్వాత "ముకుంద" "బ్రహ్మోత్సవం" తీసి చాలా గ్యాప్ తర్వాత "నారప్ప" అనే రీమేక్ తీసి తన ట్రెండ్ మార్చాడు. ఇప్పుడు అదే ట్రేండ్ ని కొనసాగిస్తూ "పెదకాపు" పేరుతో ఈ హింసాత్మక పీరియడ్ బ్యాక్డ్రాప్ చిత్రాన్ని మనముందుంచాడు. 

ఇది 1962 లో మొదలై 1980ల్లో సాగే కథ. సత్య రంగయ్య (రావు రమేష్), బయ్యన్న (నరేన్) గోదావరి జిల్లాలోని ఒక ప్రాంతాన్ని రాజకీయంగా ఏలుతుంటారు. అక్కడ 1983లో తెదేపా కొత్త పార్టీగా ఎంటరవుతుంది. ఆ తర్వాత ఏర్పడ్డ సంఘర్షణే ఈ కథ.

ఫ్లాష్ బ్యాకులో అక్కమ్మ (అనసూయ) ఎన్నికల్లో నిలబడాలనుకుంటే క్రూరుడైన సత్య రంగయ్య ఆమెను రేప్ చేసి తన వద్ద ఉంచుకుంటాడు.

కాలక్రమంలో పెద్దకాపు (విరాట్ కర్ణ), అతని సోదరుడు ఆ ప్రాంతాన్ని పీడిస్తున్న ఇద్దరు రాజకీయనాయకులపై తిరగబడి ఆ ప్రాంతంలో తెలుగుదేశం జెండాని ఎగురవేస్తారు. అక్కడి నుంచి రాజకీయ యుద్ధం రక్తయుద్ధంగా మారుతుంది.

"మీకే అంతుంటే మాకెంత ఉండాలిరా?" అనే డైలాగుతో సినిమా మొత్తం నడుస్తుంది. రెండు వర్గాల మధ్య పోరు, ఫలితంగా తలలు, చేతులు ఎగిరి పడడం...!

చివరికి సత్య రంగయ్య, బయ్యన్నలు ఏమౌతారు? పెదకాపుకి అండనిచ్చే రహస్య హస్తం ఎవరిది అనేవి చివర్లో రివీల్ అయ్యే అంశాలు. 

కథగా ఇది పేపర్ మీదా బాగానే ఉండి ఉండొచ్చు. కానీ తీయడంలో పూర్తిగా తడబడి గందరగోళపరిచాడు దర్శకుడు. స్క్రీన్ ప్లేలో ఎక్కడా ఒక కన్సిస్టెంట్ ఫ్లో లేదు. 

ప్రధమార్థమంతా ఏవో సీన్లు తెర మీద వెళ్తూ ఉంటాయి తప్ప అసలు కథే అర్ధం కాదు. కథలో సంఘర్షణ ఏవిటో కూడా సగటు ప్రేక్షకుడికి అందదు. తెర మీద పాత్రలు మాత్రం వారి వారి భావోద్వేగాలతో నటించేస్తుంటారు. 

ప్రధాన పాత్రలుగా ఆడుకాలం రవి, రావు రమేష్ లే కనిపిస్తారు. వారిద్దరి విలనీలో కొత్త పోకడలేమీ లేవు. బలమైన మేనరిజంస్ కానీ, హత్తుకునే సంభాషణలు కానీ వాళ్లకి రాయలేదు.

ఇంతకీ హీరోగా కనిపించిన విరాట్ కర్ణ ఈ కథకి సరిపోలేదు. తనలో ప్రతిభ ఎంతున్నా అతని వాయిస్ కానీ, స్క్రీన్ ప్రెజెన్స్ కానీ ఈ "పెదకాపు" పాత్రకి సరిపోలేదు. ఇంతకీ అతనిని "పెదకాపు" అనేంత ఏం చేసాడో కూడా ఎక్కడా ఎష్టాబ్లిష్ కాలేదు. 

ప్రగతి శ్రీవాస్తవ మాత్రం చూడడానికి బాగుంది.

కథలో ద్వితీయార్ధంలో వచ్చే అనసూయదే కాస్త బరువున్న పాత్ర. అయితే ఆ పాత్రని కూడా మలచాల్సిన రీతిలో మలచలేదు. 

దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ఇందులో నెగటివ్ పాత్రలో కనిపించాడు. టైట్ క్లోజుల్లో ఒకటే తరహా ఎక్స్ప్రెషన్ తో చివరిదాకా లాగాడు. ఆ పాత్రకి బహుశా పెద్దగా నటనాప్రతిభ అవసరం లేదని కాబోలు తానే నటించేసాడు. 

టెక్నికల్ గా చూసుకుంటే పాటలు చాలా వీక్ గా ఉన్నాయి. మిక్కీ జే మేయర్ సంగీతమే అయినా చాలా హాఫ్-హార్ట్ తో పని చేసినట్టు అనిపించింది. నేపథ్య సంగీతం చాలా చోట్ల బాగానే ఉన్నా కొన్ని చోట్ల నాన్-సింక్ గా అనిపించింది. ముఖ్యంగా శ్రీకాంత్ అడ్డాల ఇంట్రో సీన్లో వినిపించే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విచిత్రంగా ధ్వనించి నవ్విస్తుంది తప్ప రోమాంఛితంగా అనిపించదు. 

మొత్తానికి సాఫ్ట్ సినిమాలు తీసే శ్రీకాంత్ అడ్డాల, సాఫ్ట్ మ్యూజిక్ కి కెరాఫ్ అయిన మిక్కీ జె మేయర్ కలిసి నాలుగు హింసాత్మక సినిమాలు చూసి తాము కూడా అలాంటి ఒక ప్రయత్నం చేసారు. కానీ విఫలమయ్యారు. 

అయితే కెమెరా వర్క్ గానీ, ఆర్ట్ వర్క్ గానీ మెప్పించాయి. 1980ల తాలూకు యాంబియన్స్ ని చాలా చక్కగా చూపించారు. 

ఇక్కడ సమస్యల్లా ఒక్కటే. "రంగస్థలం" లాంటి సినిమాని చూసేసాక ఆడియన్స్ అంచనాలు, టేస్ట్ ఏ రేంజులో మారుంటాయో ఒక అంచనా ఉండాలి. ఆ అంచనాలకి తగ్గట్టుగా కథ, కథనం రాసుకోవడం చేయాలి. డైలాగ్స్ దగ్గరనుంచి, పాటల వరకు ప్రతి అంశంలోనూ "రంగస్థలం" కంటే గొప్పగా ఉండేలా ప్రయత్నించాలి (ఆ తరహా సినిమా తీస్తున్నప్పుడు). కానీ ఆ కసరత్తేమీ కనిపించలేదు. మనసులో ఏదో అనుకుని తీసినట్టుంది తప్ప జనానికి అర్ధమయ్యేలా తియ్యాలనే పని చెయ్యలేదు. తెర మీద సీన్లు పేజీలు తిప్పినట్టు వెళుతూ ఉంటాయి తప్ప మనసుకి బుర్రకి ఏమీ ఎక్కదు. 

కొన్ని సీన్లే కాదు, డైలాగ్స్ కూడా అర్ధం కావు. 

"దేశంతో పనిపడితే ఊరిని తగలపెట్టేస్తాను- ఊరితో పని పడితే కుటుంబాన్ని తగలపెట్టేస్తాను- కుటుంబంతో పని పడితే మనిషిని తగలపెట్టేస్తాను- అదే నాతో నాకే పని పడితే??.." అంటూ ఒక సుదీర్ఘమైన పంచ్ డైలాగ్ లాంటిది చెప్తాడు దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల. దాంట్లో ఉన్న లోతేంటో ఆయనే చెప్పాలి. 

అలాగే రాజకీయ నేపథ్యంలో జరిగే కథలో ఎన్ని తలలు తెగినా, ఎన్ని చేతులు ఊడిపడ్డా అసలు పోలీసు అరెష్టుల్లాంటివి ఉండవు. శిరచ్ఛేదన సన్నివేశాలు చాలా క్రూరంగా ఉన్నాయి. అదే విధంగా శ్రీకాంత్ అడ్డాల పాత్ర ఒకర్ని చంపే తీరు చూస్తే రామ్ గోపాల్ వర్మ కూడా బెంబేలెత్తాల్సిందే- అంత క్రూరంగా ఉంది. 

దర్శకుడు ఏదో చెప్పాలనుకుని, మొహమాటంతో ఏదీ చెప్పలేక ఏదేదో చెప్పినట్టయ్యింది ఈ సినిమాలో. మొహమాటమని ఎందుకు అనాల్సొస్తోందంటే దర్శకుడు ఈ కథలో కొన్ని కులాల మధ్యన వార్ అన్నట్టు చూపించాడు. ఆ కులాలు దళితులా, కాపులా, కమ్మలా, రెడ్లా..ఇంకెవరన్నానా అనే క్లారిటీ ఇవ్వలేదు. ఆ క్లారిటీ ఇవ్వగలిగే ధైర్యం లేనప్పుడు ఇలాంటి సబ్జెక్ట్స్ ఎత్తుకోకూడదు. టైటిల్ "పెదకాపు" అని పెట్టినా ఇది కాపువర్గం తరఫున తీసిన సినిమాలా కూడా అనిపించదు. 

ఇంతకీ ఇది "పెదకాపు-1". అంటే దీనికి ద్వితీయ భాగం కూడా ఉంటుంది. ఎంతమంది పట్టించుకుంటారో చూడాలి. 

సినిమా చూస్తున్నంత సేపూ, ఎక్కడా ఎమోషన్ అందకుండా, తెర మీద జరిగే హింసాకాండ చూడలేక "పెదకాపూ! చాల్లే ఇక ఆపు" అని అరవాలనిపిస్తుంది. 

బాటం లైన్: చాల్లే ఆపు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?