ఎలాంటి కమ్మవారికి ఎలాంటి దుస్థితి?

అన్ని కులాల్లాగానే కమ్మ కులం కూడా తెలుగు సమాజంలో ఒక భాగం. రైతులుగా, భూస్వాములుగా, వ్యాపారులుగా, వైద్యులుగా ఇలా పలురంగాల్లో వారి ప్రస్థానం సాగిస్తూ నలుగురితోటీ పాలు నీళ్లల్లా కలిసిపోయేవారు. అలా ఆయా రంగాల్లో…

అన్ని కులాల్లాగానే కమ్మ కులం కూడా తెలుగు సమాజంలో ఒక భాగం. రైతులుగా, భూస్వాములుగా, వ్యాపారులుగా, వైద్యులుగా ఇలా పలురంగాల్లో వారి ప్రస్థానం సాగిస్తూ నలుగురితోటీ పాలు నీళ్లల్లా కలిసిపోయేవారు. అలా ఆయా రంగాల్లో ప్రగతి సాధించిన వారు అన్ని కులాల్లోనూ ఉండేవారు. 

అయితే 1983లో తెలుగుదేశం పార్టీ పుట్టే వరకు కమ్మ కులంపై ప్రత్యేకమైన దృష్టి ఎవరి నుంచి కేంద్రీకృతమయ్యేది కాదు. ఆ తర్వాతే కమ్మవారి ప్రాబల్యం మొదలయ్యింది.

“తెలుగువారి ఆత్మగౌరవం” నినాదంతో తెలుగుదేశం ఆవిర్భావం జరిగినా అది “కమ్మవారి ఆత్మగౌరవం” కోసం పుట్టిన పార్టీ అని జననానికి అర్ధం కావడానికి చాలా కాలం పట్టింది. 

ఎన్.టి.ఆర్ ముఖ్యమంత్రి అయినప్పటికించుంచీ ప్రతి జిల్లాకి ఒక్క కమ్మనాయకుడైనా ఉండాలన్న లెక్కతో శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ఎక్కడ ఏ మూల ఏ కమ్మ ఆసామి ఉన్నా “బ్రదర్” అంటూ భుజాన చెయ్యేసి ఎంపీ సీటో, ఎమ్మెల్యే సీటో ఇవ్వడం మొదలుపెట్టారు. ఆ స్ఫూర్తితో పంచాయతీ, కార్పొరేషన్ల లెవెల్లో కూడా కమ్మవారి వ్యాప్తి జరిగింది. 

మొదటి నుంచీ ఎన్.టి.ఆర్ కి స్వకులాభిమానం ఎక్కువ. అది ఆయన సినిమా రంగంలో ఉన్నప్పటి నుంచీ ఉండేది. సినిమా రచయితలుగా ఒకానొక కులం వారే చలామణీ అవుతున్న రోజుల్లో తమ కులంలో ఉన్న గొప్ప కవులను, రచయితలను ఇండస్ట్రీకి పరిచయం చేసిన వ్యక్తి ఎన్.టి.ఆర్. 

అదే స్వకులాభిమానం ఆయన రాజకీయాల్లో కూడా ప్రసరింపజేసారు. నిజానికి స్వకులాభిమానం తప్పు కాదు. తమ కులంలో ఉన్న ప్రతిభావంతులకు “కూడా” తగు స్థానన్ని కల్పించే దిశగా ప్రయత్నం చేయడం తప్పు లేదు. ఇక్కడా “కూడా” అన్న పదాన్ని మీరు గమనించాలి. నలుగురితో పాటూ వారిని “కూడా” అని అర్ధం. అంతే తప్ప వారికి “మాత్రమే” అని కాదు. తెలుగుదేశంలో మాత్రం అదే జరిగింది. పార్టీ మొత్తం కమ్మవారితో “కూడా” అని కాకుండా కమ్మవారితో “మాత్రమే నిండిపోయింది. కులప్రాతిపదికన తప్పనిసరిగా కొన్ని స్థానాల్లో ఇతర కులాల వారికి సీట్లివ్వాల్సొచ్చి ఇవ్వడమే తప్ప తక్కిన అన్ని చోట్లా కమ్మవారే కమ్మేసారు.

పేరుకి కొన్ని మినిస్ట్రీలు, నామినేటెడ్ పోస్టులు బీసీలకి ఇవ్వడం వల్ల పైకి తెదేపాని బీసీ పార్టీగా కనపడేది. కానీ వెనుక కీలక స్థానాల్లో నడిపెది మొత్తం కమ్మ నాయకులే. 40 ఏళ్ల తెదేపా చరిత్రలో భారీగా సంపాదించుకుని బాగుపడ్డ బీసీలు కనపడరు. అప్పటికి, ఇప్పటికీ కమ్మలు మాత్రమే కనిపిస్తారు. 

అంతే కాదు, ఎక్కడో అమెరికాలో ఉన్న సుప్రసిద్ధ వైద్యుల్ని వెనక్కు పిలిపించడం, ఎక్కడెక్కడ ఏ రంగాల్లో ఏ అత్యున్నత స్థితిలో ఏ కమ్మ వ్యక్తి ఉన్నా వారిని పిలిచి ఏదో ఒక పట్టం కట్టడం సాగుతూ వచ్చింది. 

అందుకే కమ్మవారికి ఎన్.టి.ఆర్ దేవుడు. వాళ్లకి ఆరాధ్యుడు. అంతే తప్ప అందరు తెలుగువారికీ కాదు. కాదంటే కమ్మవారికి కోపం రావచ్చు. కానీ అది సత్యం. 

ఎన్.టి.ఆర్ ని ఒక గొప్ప నటుడిగా ఆరాధిస్తారేమో తప్ప అతని పేరు చెబితే గుండెలు ఉప్పొంగి దైవ భావంతో భక్తి పెల్లుబికేంత పరిస్థితి కమ్మవారికి తప్ప ఏ కులం వాడికీ లేదు. 

అదలా ఉంటే, కమ్మవారు క్రమంగా రాజకీయబలంతో వ్యాపార, పారిశ్రామిక రంగాల్లో కూడా విపరీతంగా ఎదిగారు. దీనికి తోడు చంద్రబాబు కూడా ఇదే పద్ధతి అవలింబించడంతో వ్యవస్థల్లో కూడా స్వకులస్తులు చొచ్చుకెళ్లి కొన్నేళ్లకి ఆయా వ్యవస్థల్లో అగ్రస్థానాలని వాళ్లే కమ్మేసారు. 

తెలుగు వారికి కమ్మవారిని చూస్తే ఒకే ఒక్క విషయంలో అసూయ ఉంటుంది. అదే “ఐకమత్యం”. కమ్మవారిలో ఉన్నంత ఐకమత్యం మిగిలిన ఏ కులాల్లోనూ ఉండదంటే అతిశయోక్తి కాదు. అదే వాళ్లని ఎదిగేలా చేసింది. అదే వాళ్లని కాల క్రమంలో కార్నర్ చేసింది. ఇప్పుడదే వాళ్ల కొంప ముంచుతోంది. 

అదెలాగో చూద్దాం. సమాజంలో పాలనాస్థానాలు, అధికారస్థానాలు, వ్యాపార కేంద్రాలు, పాలు, పేపరు, పచ్చడి..ఇలా ఎక్కడపడితే అక్కడ కమ్మ వారి ఉనికి కనిపించడం సమస్య కాదు కానీ…వాళ్ల ఉనికిని పదే పదే చాటుకుంటూ, “మా బ్లడ్ వేరు మా బ్రీడ్ వేరు” అనే విధంగా పేట్రేగడం తక్కిన కులాల వారిని చిరాకు పెట్టడం మొదలుపెట్టింది. 

అసలు కమ్మ వారు కార్నర్ కావడానికి ప్రధానమైన వ్యక్తి ఒక ఇంటర్వ్యూలో ఆ డైలాగ్ కొట్టిన బాలకృష్ణే. 

ఏ విషయంలో తమ బ్లడ్-బ్రీడ్ వేరో చూద్దామన్న లెక్కలో జనం చూడడం మొదలు పెట్టారు. సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగులు చేయడం మొదలయ్యింది. 

ఆంధ్రప్రదేశులో కమ్మవారి జనాభా శాతం 5-6% ఉండొచ్చు. తామే గొప్పని బాహాటంగా టముకు వేస్తూ, బాలకృష్ణ సినిమాలకి దరువేస్తూ, ఆయన్ని దైవకుమారుడిగా కీర్తిస్తూ ఉండడంతో పరిస్థితి వికటించింది.

ఎక్స్-ఎమ్మెల్యే అడుసుమిల్లి జయప్రకాష్ ఒకమాటన్నారు- “కమ్మవారి దరిద్రమేంటంటే చంద్రబాబు కూడా ఆ కులంలో పుట్టడం” అని. చంద్రబాబుకంటే ముందుగా బాలకృష్ణ పేరు చెప్పాలి. ఎందుకంటే అతని “బ్లడ్-బ్రీడ్”, “బురదజాతి” డైలాగులు కమ్మ ఇమేజ్ కి చేసినంత డ్యామేజ్ అంతా ఇంతా కాదు. 

అడుసుమిల్లి జయప్రకాష్ తీరుగానే పోసాని కృష్ణమురళి కూడా తెదేపాలో ఉన్న ఈ అతి స్వకులాభిమానాన్ని చూసి సహించలేని స్థితిలో తరచూ వాగ్బాణాలు వేస్తుంటారు. 

ఇదిలా ఉంటే ఇప్పటికీ తెదేపా వల్ల ఎదిగిన వ్యక్తులెవరో చెప్పమంటే ఠపీమని గుర్తొచ్చే మొహాలు- రామోజీరావు, మురళీమోహన్, కె.రాఘవేంద్ర రావు, సుజనా చౌదరి, అశ్వినిదత్…ఇలా! నిజంగానే స్టూడియోలు, థియేటర్ కాంప్లెక్సులు, రియల్ వ్యాపారాలు, ఇతరత్రా పరిశ్రమలు ఉన్నవి వీళ్లకే. అందరూ ఒక వర్గం వారే కావడం, దానిని జనం గమనించడం తెదేపాని జనం కార్నర్ చేయడానికి కారణమవుతోంది. అనట్టు చంద్రబాబు జైలు పాలైతే ఖండించి కూడా వీళ్లే.

ఇదంతా ఒకెత్తైతే తాజాగా రేణుకా చౌదరి కష్టాలు మరో ఎత్తు. జనానికి నవ్వు తెప్పిస్తున్నాయి ఆవిడ పోరాటాలు, ఆరాటాలు. కమ్మవారికి ప్రతి పార్టీలోనూ కనీసం 40-50 సీట్లిచ్చి కూర్చోబెట్టాలట. దీని కోసం ఆమె కమ్మ నాయకురాలిగా మారి ఢిల్లీ స్థాయిలో పోరాటం చేస్తోంది. సమాజంలో అధిక శాతంలో ఉన్న బలహీన వర్గాలు కూడా ఇంతిలా రోడ్డున పడి పార్టీల్లో సీట్ల కోసం అర్రులు చాపలేదు. రిజర్వేషన్ రీత్యా కలిగిన అర్హతతో ఏ కొన్ని సీట్లో తమ వర్గానికి చెంది ఉన్నాయని రాజ్యాంగ స్ఫూర్తితో ముందుకెళ్తున్నారు. కానీ అగ్రకులాల్లో ఒకటైన ఈ కమ్మ కులం వారి ఆరాటం మాత్రం అందరినీ నవ్విస్తోంది. 

ఏంటంత గొప్ప? ఎందుకివ్వాలి 40-50 సీట్లు? సమాజంలో మీ కులం జనాభా ఎంత? ఈ ప్రశ్నలేస్తున్నారు సోషల్ మీడియాలో జనం. 

ఏదైనా “అతి సర్వత్ర వర్జయేత్” అని ఒక లెక్కుంటుంది. సర్వేజనా సుఖినో భవంతు అనాల్సిన ఒక రాజకీయ పార్టీ “కమ్మేజనా సుఖినో భవంతు” అన్న తీరుగా చేతల్లో చేసి చూపించడం వల్ల ఇప్పుడీ దుస్థితి వచ్చింది. ఎలాంటి కులం వారు ఇప్పుడు పార్టీలో సీట్ల కోసం ఎలా భిక్షమెత్తుతున్నారు అని జనం జాలి చూపిస్తున్నారు. అంతలా సీట్లు, పదవులు లేకపోతే ఊపిరాడనంత స్థితిలో ఎందుకుండాలి?

ఎవరికైనా సరే కులాభిమానం దురదగా మారకూడదు. ఆ దురదతో అతిగా గోక్కోకూడదు. అలా అతి గోకుడు వల్ల రక్తమొచ్చి చర్మం ఊడుతుంది తప్ప సానుకూల ఫలితాలు రావు. 

హరగోపాల్ సూరపనేని