భార‌తీయుల ప్ర‌త్యేక‌త.. ప్రేమ బంధాల్లోనూ రాజ‌కీయ ప్రాధాన్య‌త‌!

దేశంలో ఎన్నిక‌ల ట్రెండ్ న‌డుస్తోంది! ఇలాంటి త‌రుణంలో స్నేహితులు, హితుల మ‌ధ్య‌న కూడా రాజ‌కీయ చ‌ర్చ‌లు త‌ప్ప‌వు! ఇలాంటి చ‌ర్చ‌లు కొన్ని ప‌రిణ‌తితో సాగుతుంటే, మ‌రి కొన్ని అప‌రిప‌క్వ‌త‌తో సాగుతాయి. సొంత బంధువులు,  స్నేహితులు, స‌హోద్యోగుల…

దేశంలో ఎన్నిక‌ల ట్రెండ్ న‌డుస్తోంది! ఇలాంటి త‌రుణంలో స్నేహితులు, హితుల మ‌ధ్య‌న కూడా రాజ‌కీయ చ‌ర్చ‌లు త‌ప్ప‌వు! ఇలాంటి చ‌ర్చ‌లు కొన్ని ప‌రిణ‌తితో సాగుతుంటే, మ‌రి కొన్ని అప‌రిప‌క్వ‌త‌తో సాగుతాయి. సొంత బంధువులు,  స్నేహితులు, స‌హోద్యోగుల మ‌ధ్య‌న రాజ‌కీయ చ‌ర్చ‌లు వాడీవేడీగా సాగుతున్న త‌రుణం ఇది.

ఇలాంటి త‌రుణంలో ప‌ర‌స్ప‌రం వేర్వేరు అభిప్రాయాల‌ను క‌లిగిన వ్య‌క్తులు పోటీప‌డి వాదించుకుంటూ ఉంటారు. వాట్సాప్ గ్రూపుల్లో, డైరెక్టుగా, ఇంకా ర‌క‌ర‌కాల సోష‌ల్ మీడియా స్ట్రీమ్స్ లో వారి చ‌ర్చ‌లు సాగుతూ ఉన్నాయి. ఇలాంటి వాటితో మ‌న‌స్ప‌ర్థ‌లు పెంచుకునే వారు కూడా కోకొల్ల‌లు. సొంత వారే అయిన‌ప్ప‌టికీ.. రాజ‌కీయ ప‌ర‌మైన చ‌ర్చ‌ల్లో విబేధాల‌తో దూషించుకునే వారు, మ‌ళ్లీ మొహాలు చూసుకునే ఆస‌క్తి లేని వారు కోకొల్ల‌లు! 

ఎవ‌రికి వారు తాము అభిమానించే, తాము కోరుకునే వారే గెల‌వాల‌నే త‌ర‌హాతో రెచ్చిపోతూ ఉంటారు! ఇదంతా రొటీనే!  అయితే కొంద‌రు కాస్త ప‌రిణ‌తితో ఉంటారు. సొంత వాళ్ల‌తో ఎక్క‌డి వ‌ర‌కూ వాదించాలో అక్క‌డి వ‌ర‌కూ వాదించి ఆగిపోతూ ఉంటారు. స్నేహితుల‌తో వాట్సాప్ గ్రూపుల్లో అయినా, డైరెక్టు చ‌ర్చ‌ల్లో అయినా రాజ‌కీయం వారి మ‌ధ్య‌న వ్య‌క్తిగ‌త స్ప‌ర్థ‌లు పెంచ‌కుండా చూసుకుంటారు. అయితే మ‌న‌సులో మాత్రం.. తమ అభిమానాలు గెలిస్తే, కాసేపు అయినా స్నేహితుల‌తో ఆడుకోవాల‌ని అనుకునే వారు కూడా ఎక్కువే!

ఇక బంధువుల మ‌ధ్య‌న రాజ‌కీయ విబేధాల‌కు ఏపీలో కొద‌వ‌లేదు! అనేక మంది రాజ‌కీయ నేత‌లు బంధుత్వాలు ఉన్నా..వేర్వేరు పార్టీల త‌ర‌ఫున పోటీ చేయ‌డం రొటీనే! ఇప్పుడు అది కాస్త త‌గ్గిన‌ట్టుగా ఉంది. గ‌తంలో అయితే.. వియ్యంకులు, మామా అల్లుళ్లు, అన్న‌ద‌మ్ములు కూడా వేర్వేరు పార్టీల త‌ర‌ఫున పోటీ చేయ‌డం ఎక్కువ‌గా ఉండేది. ఇప్పుడూ అది ఉన్నా.. అది పెద్ద పెద్ద రాజ‌కీయ ఫ్యామిలీల‌కే ప‌రిమితం అయ్యింది. చిన్న వాళ్లు స‌ర్దుకుపోతున్నారు!     

మ‌రి ఇవ‌న్నీ అలా ఉంటే.. భార‌తీయుల్లో రాజ‌కీయ ఆస‌క్తుల మేర‌కే అన్నీ ఉండాల‌నుకునే త‌త్వం ప్రేమ‌బంధాల్లో కూడా ఉంద‌ట‌! ఎన్నిక‌ల వేళ ఒక స‌ర్వే సంస్థ మీ ల‌వ్ ఇంట్ర‌స్ట్ కూ, పొలిటిక‌ల్ ఇంట్ర‌స్ట్ కూ సంబంధం ఉందా అంటే.. ఏకంగా న‌ల‌భై శాతం మంది వ‌ర‌కూ ఎస్ అని చెప్పార‌ట‌! త‌మ‌తో ల‌వ్ రిలేష‌న్ షిప్ ఉన్న వాళ్లు క‌చ్చితంగా తాము మ‌ద్ద‌తు ఇచ్చే పార్టీ వైపే ఉండాల‌ని న‌ల‌భైశాతం మంది వ‌ర‌కూ గ‌ట్టిగా కోరుకున్నార‌ట! అంటే రాజ‌కీయంగా తమ విధానాల‌కే క‌ట్టుబ‌డే వారినే తాము ల‌వ్ చేస్తామ‌ని ఇలాంటి వారు సూటిగా చెప్పార‌ట‌!   అయితే అర‌వై శాతం మంది మాత్రం ప్రేమ బంధానికీ, రాజ‌కీయానీకి సంబంధం లేద‌న్నార‌ట‌! మ‌రి ఇలాంటి వారే ఎక్కువ అయిన‌ప్ప‌టికీ.. ఇందులో ఒక తిర‌కాసుంది!

ప్రేమ‌బంధానికీ, రాజ‌కీయానికి సంబంధం లేద‌ని చెప్పిన వారిలో మెజారిటీ 25 యేళ్ల లోపు వారు! అంటే 18 నుంచి 25 ఏజ్ మ‌ధ్య‌న ఉన్న వారు ఈ త‌ర‌హా అభిప్రాయాల‌ను ఎక్కువ‌మంది చెప్పారు! వీరికి రాజ‌కీయ ఆస‌క్తుల‌కూ, ప్రేమ‌కూ సంబంధమే లేద‌నిపించ‌డంలో పెద్ద ఆశ్చ‌ర్యం లేదు. వారు ఇంకా పూర్తి స్థాయిలో స‌మాజ ప్ర‌భావానికి లోను కాక‌పోవ‌చ్చు. పాతిక దాటాకా.. రాజ‌కీయం విష‌యంలో అభిప్రాయాలు బ‌ల‌ప‌డ‌వ‌చ్చు. కులం, స‌మాజం ప్ర‌భావం పెర‌గొచ్చు. ఈ కేటగిరి వారిలో మెజారిటీ మాత్రం.. ప్రేమ‌లో రాజ‌కీయం కూడా ముడిప‌డిందంటున్నారు. 

తాము ప్రేమించే వాళ్లు, తాము ఒకే పార్టీ వైపు ఉండాలంటున్నారు పాతిక యేళ్లు దాటిన వారు!  ఈ స‌ర్వే సంగ‌తెలా ఉన్నా,. తెలుగునాట అయితే యువ‌త‌లో కూడా రాజ‌కీయ ఆస‌క్తులు ప్రేమ‌లోనూ చ‌ర్చ‌కు త‌ప్ప‌వు! ఏపీలో కులాంత‌ర వివాహాల త‌గ్గుద‌ల‌కు రాజ‌కీయం కూడా ఒక కార‌ణం అంటే ఆశ్చ‌ర్యం లేదు! రాజ‌కీయంగా ఒక్కో కులం ఒక్కో పార్టీని అతిగా ఓన్ చేసుకోవ‌డం వ‌ల్ల‌.. ఎందుకొచ్చిన గొడ‌వ‌లే అని అప్ప‌ర్ మిడిల్ క్లాస్ లో నూ, మిడిల్ క్లాస్ లోనూ కులాంత‌ర వివాహాలు త‌క్కువ! కులంపై అభిమానామే దీనికి ప్ర‌ధాన కార‌ణం అయినా, ఇప్పుడు రాజ‌కీయం కూడా కులంతో తీవ్రంగా ముడిప‌డిపోయింది తెలుగు రాష్ట్రాల్లో!