కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితమైన ఘోర పరాజయం నేపథ్యంలో.. జగన్మోహన్ రెడ్డి పార్టీ పునర్నిర్మాణం మీద దృష్టి సారించినట్టుగా ఇప్పుడు వార్తలు వస్తున్నాయి.
ఇటీవలి ఎన్నికల్లో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వారి మీద కఠిన చర్యలు తీసుకోవడం ప్రారంభం అయింది. కదిరి నియోజకవర్గం నుంచి 2019 ఎన్నికల్లో పార్టీ తరఫున గెలిచి, 2024 టికెట్ పొందలేకపోయిన పి వెంకట సిద్ధారెడ్డి మీద వైసీపీ తొలి వేటు వేసింది. ఇది ప్రక్షాళనకు శ్రీకారం అని పార్టీ నాయకులు అంటున్నాయి. అయితే, నిజమైన ప్రక్షాళన అంటే ఇదేనా.. అంటూ పార్టీ శ్రేణులే విస్మయం వ్యక్తం చేస్తున్నాయి.
జగన్మోహన్ రెడ్డి కొన్ని రోజులుగా ఓటమికి దారితీసిన కారణాల గురించి సమీక్షిస్తున్నట్టుగా ప్రచారం జరిగింది. జగన్ కు విశ్వసనీయులైన నాయకులు.. రాష్ట్ర వ్యాప్తంగా ఏయే నియోజకవర్గంలో ఏ కారణాల చేత ఓడిపోయాం అనే అంశాలను సమీకరించారు. వాటినన్నింటినీ మధించి.. చర్యలు తీసుకోవడం ఇప్పుడే ప్రారంభించారు. ఆ లెక్కన తొలి వేటు కదిరికి చెందిన పీవీ సిద్ధారెడ్డి మీద పడింది.
అయితే పార్టీకి తన వల్ల నష్టం కాదు కదా.. పార్టీ వల్లే తనకు నష్టం జరిగిందని ఆయన అంటున్నారు. ఆ సంగతి పక్కన పెడితే.. అసలు పార్టీ ప్రక్షాళన అంటే ఇదేనా అనే అనుమానం కార్యకర్తల్లో ఉంది.
జగన్మోహన్ రెడ్డి సలహాదారుల ముసుగులోని స్వార్థ పరుల వల్లనే పార్టీ ఓడిపోయిందనేది మెజారిటీ కార్యకర్తల అభిప్రాయం. సజ్జల రామక్రిష్ణారెడ్డి, ధనంజయరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, చెవిరెడ్డి భాస్కర రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి .. ఇలా.. ఏయే నాయకుల మీదనైతే జగన్ విపరీతంగా ఆధారపడ్డారో వారంతా కేవలం తమ స్వార్థంతో రాజకీయం నడిపిన వారే తప్ప.. నిజాయితీగా పార్టీ ప్రయోజనాల కోసం పని చేయలేదనే అభిప్రాయం పలువురిలో ఉంది.
ఇలాంటి కఠోర వాస్తవాలను అంగీకరించనంత వరకు జగన్ ఎన్ని చర్యలు తీసుకున్నా సరే.. ఎందరి మీద వేటు వేసినా సరే.. అది పార్టీ ప్రక్షాళన ఎలా అవుతుందని ప్రశ్నిస్తున్నారు. ముందు మీ చుట్టూ చేరి.. మిమ్మల్ని మభ్యపెడుతున్న.. మిమ్మల్ని ముసుగులో ఉంచుతున్న వాళ్లను తప్పించి.. పార్టీని చూడండి.. ప్రపంచాన్ని చూడండి అప్పుడు వాస్తవాలు ఏమిటో మీకు అర్థమవుతాయి.. అని పార్టీ శ్రేణులు అంటున్నారు. కానీ.. వారి మీద అమితంగా ఆధారపడిన జగన్ కు అది సాధ్యమవుతుందో లేదో మరి!